ఆ సినిమా ఆడదంటే ఆడదన్నారు.. కానీ

మోసగాళ్లకు మోసగాడు.. తెలుగు సినీ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే చిత్రాల్లో ఒకటి. సూపర్ స్టార్ కృష్ణ ఎంతో సాహసోపేతంగా చేసిన ఈ సినిమా అప్పట్లో ఒక సంచలనం. ఇండియానా జోన్స్ తరహాలో నిధి వేట నేపథ్యంలో ఇండియాలో తెరకెక్కిన తొలి కౌబాయ్ చిత్రమిది. అప్పటిదాకా బాలీవుడ్లోనూ కౌబాయ్ సినిమాలు రాలేదు. అలాంటిది తెలుగులో అంతర్జాతీయ ప్రమాణాలతో ‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్రాన్ని రూపొందించి సంచలనం రేపాడు కృష్ణ.

ఈ చిత్రంలో హీరోగా నటించడమే కాదు.. అప్పట్లోనే రూ.7 లక్షల భారీ బడ్జెట్లో సినిమాను నిర్మించి .. తెలుగు ప్రేక్షకులు అప్పటిదాకా చూడని లొకేషన్లలో షూటింగ్ చేసి తనకు తానే సాటి అనిపించాడు కృష్ణ. కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో భారీ వసూళ్లు దక్కించుకున్నాక.. హిందీ, తమిళం, కన్నడతో పాటు ఇంగ్లిష్ భాషలోనూ అనువాదం అయి అంతర్జాతీయ స్థాయిలో విడుదల కావడం విశేషం.

ఐతే ఈ సినిమా తీస్తున్నపుడు, తీశాక కృష్ణను అందరూ నిరుత్సాహపరిచిన వాళ్లేనట. తెలుగులో ఇలాంటి సినిమా అస్సలు వర్కవుట్ కాదనే చాలామంది అన్నారట. సినిమాల జడ్జిమెంట్ విషయంలో తిరుగులేని పేరున్న విజయా సంస్థ అధినేత చక్రపాణి అయితే ఈ సినిమా ఆడే అవకాశమే లేదని తీర్పిచ్చేశారట.

‘మోసగాళ్లకు మోసగాడు’ విడుదలై 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కృష్ణనే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘చక్రపాణి గారికి సినిమా చూపిస్తే ఏమిటీ అవతారాలు.. మన నేటివిటీకి తగిన సినిమా కాదు. ఆడదు అనేశారు. ఆయన జడ్జిమెంట్ చాలా కరెక్ట్‌గా ఉండేది. ఆయన ఓ సినిమా ఆడదు అన్నారంటే ఆడేది కాదు. కానీ ‘మోసగాళ్లకు మోసగాడు’ విషయంలో ఆయన అంచనాలు తప్పాయి. ఈ సినిమాకు చెన్నైలో ప్రివ్యూ వేసినపుడు చూసిన వాళ్లలో కూడా చాలామంది ఆఢటం కష్టమనే అన్నారు. కానీ ఎన్టీఆర్ గారు మాత్రం మంచి మాస్ చిత్రం తీశామని అభినందించారు. సినిమా హిట్టవుతుందని.. కానీ లేడీస్ చూడరని అన్నారు. ‘మోసగాళ్లకు మోసగాడు’కు లాంగ్ రన్ లేదు కానీ.. వసూళ్లు బాగా వచ్చాయి. తర్వాత వివిధ భాషల్లో ఈ చిత్రాన్ని అనువదించాం’’ అని కృష్ణ తెలిపారు.