సుబ్బరాజు చెక్కును డ్ర‌గ్స్ కేసు తో లింక్ పెట్టేసారే!

సుబ్బరాజు చెక్కును  డ్ర‌గ్స్ కేసు తో లింక్ పెట్టేసారే!

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇప్పుడు నెటిజన్ల ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అందుకు కారణం... డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొన్న నటుడు సుబ్బరాజుతో ఆయన దిగిన ఒక ఫొటో సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతుండడమే. ఇటీవల ఓ ప్రైవేటు ఫంక్ష‌న్‌కు వెళ్లిన కేటీఆర్‌ను సుబ్బరాజు కలవడంతో పాటు ఒక చెక్ కూడా ఆయన చేతిలో పెట్టారు. ఆ చెక్కేమీ కేటీఆర్ కోసం ఇవ్వలేదాయన.. సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా కొంత మొత్తం ఇస్తూ దానికి చెక్ ఇచ్చారు సుబ్బరాజు.

అయితే.. సుబ్బరాజు డ్రగ్స్ కేసు నేపథ్యంలోనే ప్రభుత్వాన్ని మంచి చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఈ విరాళం ఇచ్చారన్న విమర్శలు మొదలయ్యాయి. డ్ర‌గ్స్ కేసు మాఫీ కోసమే ఈ చెక్కు తీసుకున్నారా? అంటూ నెటిజన్లు ప్ర‌శ్న‌లు కురిపిస్తున్నారు.

గత ఏడాది తెలుగు సినీ ఇండస్ట్రీలో డ్ర‌గ్స్ కేసు ఎంతగా ప్రకంపనలు సృష్టించిందో తెలిసిందే.  రెండు మూడు నెలల పాటు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిగ్గా మారిన ఆ కేసు తరువాత క్రమంగా చల్లబడిపోయింది. దర్శకుడు పూరీ జగన్నాథ్ తో పాటు టాప్ టాలీవుడ్ సెల‌బ్రెటీలు విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. కానీ... ఇప్పుడా కేసు ఏమైందో కూడా తెలియదు.

ప్రభుత్వ ఒత్తిడి వల్లే పోలీసులు ఈ కేసును తొక్కిపెట్టేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ సెలబ్రిటీలు ఉండడంతో వివిధ కారణాల వల్ల ఈ కేసును ముందుకు కదలకుండా చేస్తున్నారని.. అందుకు ప్రతిఫలంగానే ఇలా ప్రభుత్వం కోసం తోచినంత సాయం చేస్తున్నారని విమర్శలొస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో కాంగ్రెస్ దీన్ని బాగా షేర్ చేస్తోంది. సీఎం సహాయ నిధికి ఇచ్చే చెక్కులేమీ వ్యక్తుల ఖాతాల్లోకి వెళ్లకపోయినా కూడా ప్రభుత్వ నిధికి డబ్బు సమకూర్చడం వెనుక ఇదే కారణమని కాంగ్రెస్ అనుకూల నెటిజన్లు విమర్శిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు