కాంగ్రెస్ లోకి మరిన్ని వలసలు

కాంగ్రెస్ లోకి మరిన్ని వలసలు

తెలంగాణలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితిపై అసమ్మతితో ఉన్న ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర పార్టీలకు చెందిన  నాయకులను  కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.  టిఆర్ఎస్ కు చెందిన నలుగురైదుగురు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోనున్నట్లు సమాచారం.

ఈ నెల 13, 14 తేదీల్లో రాహుల్ గాంధీ తెలంగాణాలో పర్యటించనున్ననేపథ్యంలో కొందరు ముఖ్య నేతలు పార్టీలో చేరనున్నట్లు పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఇందులో భాగంగా కొందరు నాయకులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే తెలంగాణ పిసిసితో టచ్ లో ఉన్న కొందరు నాయకులు రాహుల్ గాంధీ సమక్షంలో  కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది.

కాంగ్రెస్ అధిష్టానం కూడా వచ్చిన వారిని వచ్చినట్లుగా చేర్చుకోవాలని,  తెలంగాణ రాష్ట్ర సమితిని  నైతికంగా దెబ్బ కొట్టాలని భావిస్తోంది. ఇందుకోసం ఓ కమిటీని వేయాలని, వారి పర్యవేక్షణలో జిల్లాల్లోను, గ్రామస్ధాయిలోనూ కూడా పార్టీలోకి నాయకులను తీసుకోవాలన్నది కాంగ్రెస్ అధిష్టానం ఆలోచన. తెలంగాణలో టిఆర్ఎస్ ను ఎదుర్కొవాలంటే అది కాంగ్రెస్ కు మాత్రమే సాధ్యమని, ఇక్కడ పార్టీకి మంచి పట్టు కూడా ఉందన్నది పార్టీ భావన.

ఇంతే కాదు తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీయే అని ఇక్కడి వారికి తెలియజేయడంలో స్ధానిక కాంగ్రెస్ నాయకులు విఫలం అయ్యారని, అందుకే గత ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాలేదన్నది అధిష్టానం ఆలోచన. రాబోయే ఎన్నికల్లో ఈ విషయాన్ని ఇప్పటి నుంచే ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, అందుకోసం తగిన చర్యలు తీసుకోవాలని కూడా పార్టీ భావిస్తోంది.

తెలంగాణలో ప్రభుత్వంతో పడని వారు, టిఆర్ఎస్ లో అసంత్రప్తులు ఎవరైనా ఉంటే వారందరిని టార్గెట్ చేయాలని, వారికి ఎలాంటి అవసరాలున్నాయో తెలుసుకుని వాటిని తీరుస్తామని హామీ ఇచ్చి మరీ పార్టీలోకి ఆహ్వానించాలని రాహుల్ గాంధీ పిసిసి నాయకులకు తెగేసి చెప్పినట్టు సమాచారం. పార్టీలో ఏ ఒక్కరూ క్రమశిక్షణ తప్పకుండా పార్టీ అధికారంలోకి వచ్చేలా కష్టపడాలని కూడా రాహుల్ ఆదేశించినట్లు చెబుతున్నారు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ జూలు విదిల్చి కదన రంగంలో దూకేందుకు సిద్ధమవుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు