అరే.. తెలంగాణ‌లో జ‌గ‌న్ పార్టీ ఉంద‌ట‌

అరే.. తెలంగాణ‌లో జ‌గ‌న్ పార్టీ ఉంద‌ట‌

ఏంటి?.. తెలంగాణ‌లో జ‌గ‌న్ పార్టీనా?  డౌట్ ప‌డాల్సిన ప‌నే లేదు.2014 ఎన్నిక‌ల త‌ర్వాత వ‌చ్చిన రెండు మూడు సీట్ల‌ను కాస్తా.. ఆక‌ర్ష్ అస్త్రాన్ని ప్ర‌యోగించిన‌ కేసీఆర్  ఉన్న కొద్ది మందిని గులాబీ కారులో క‌లిపేసుకోవ‌టం తెలిసిందే.  త‌న పార్టీ అడ్ర‌స్ లేకుండా చేసిన కేసీఆర్ ను ఒక్క మాట అన‌కుండా ఉండిపోయిన ప్ర‌త్యేక‌త జ‌గ‌న్ సొంతం. త‌న పార్టీ ఆన‌వాళ్లు లేకుండా చేసిన వారిపై అక్క‌సుతో విరుచుకుప‌డటం ఎక్క‌డైనా చూస్తాం. కానీ.. జ‌గ‌న్ మాత్రం అందుకు భిన్నం.

తెలంగాణ‌లో త‌న పార్టీని చావుదెబ్బ తీసిన కేసీఆర్ ను ఒక్క‌మాట కూడా అన‌లేదు. గ‌డిచిన నాలుగేళ్ల‌లో ఆ పార్టీ ఊసే లేదు. అలాంటిది.. తాజాగా జ‌గ‌న్‌పార్టీ నేత‌లంటూ కొద్ది మంది హైద‌రాబాద్ క‌లెక్ట‌రేట్ ఎదుట హ‌డావుడి చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ పై విమ‌ర్శ‌లు చేశారు. ఉమ్మ‌డి ఏపీలో తెలంగాణ విద్యార్థులు.. నిరుద్యోగుల‌కు ఉద్యోగ అవ‌కాశాల్లో అన్యాయం జ‌రుగుతోంద‌ని.. తెలంగాణ వ‌స్తే ల‌క్ష‌ల ఉద్యోగాలు వ‌స్తాయ‌ని కేసీఆర్ చెప్పారంటూ ఫైర్ అయ్యారు.

కోట్లాది తెచ్చుకున్న కొత్త రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబంలోనే ఐదు ఉద్యోగాలు వ‌చ్చాయే కానీ విద్యార్థులు.. నిరుద్యోగుల ఆశ‌లు ఆవిర‌య్యాయ‌ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు డాక్ట‌ర్ గ‌ట్టు శ్రీ‌కాంత్ రెడ్డి విమ‌ర్వించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ల‌క్ష‌న్న‌ర ఉద్యోగాల్ని వెంట‌నే భ‌ర్తీ చేయాల‌న్న డిమాండ్ తో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా క‌లెక్ట‌రేట్ల ద‌గ్గ‌ర ధ‌ర్నాకు జ‌గ‌న్ పార్టీ పిలుపునిచ్చింది.

తెలంగాణ‌లో జ‌గ‌న్ పార్టీ స‌ద్దేసుకుంద‌న్న భావ‌న అంద‌రి మ‌నుసుల్లో ముద్ర ప‌డిన వేళ‌.. జ‌గ‌న్ పార్టీ జెండాల‌తో నేత‌లు కొంద‌రు చేసిన హ‌డావుడితో.. అరే.. తెలంగాణ‌లో జ‌గ‌న్ పార్టీ ఉందా? అన్న ప్ర‌శ్న ప‌లువురి నోట వినిపించింది. మ‌రి.. పార్టీ ఉంటే.. నాలుగేళ్ల‌లో ఇన్ని జ‌రిగినా ఒక్క‌సారిగా ఆ పార్టీ త‌ర‌ఫున ఎవ‌రూ ఎందుకు మాట్లాడ‌న‌ట్లు?

ఎన్నిక‌లు ప‌ది నెల‌ల‌కు వ‌చ్చిన నేప‌థ్యంలో ఇంత కాలం కామ్ గా ఉన్న జ‌గ‌న్ పార్టీ ఇప్పుడు యాక్టివ్ అయిపోయి.. ఎన్నిక‌ల రాజ‌కీయాలు షురూ చేయ‌నుందా?  నాలుగేళ్ల‌లో తెలంగాణ అధికార‌ప‌క్షం చేసిన త‌ప్పుల్ని ఏనాడు విమ‌ర్శించ‌ని జ‌గ‌న్ కు.. తెలంగాణ ప్ర‌జ‌ల క‌ష్టాల గురించి మాట్లాడే నైతిక‌త ఉంటుందా? అన్న‌ది ప్ర‌శ్న‌. జ‌గ‌న్  పార్టీ నుంచి అలాంటివి కోరుకోవ‌టం అత్యాశే అవుతుందేమో. ఏది ఏమైనా.. తెలంగాణ‌లో జ‌గ‌న్ పార్టీ ఇంకా ఉంద‌న్న మాట‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు