ఏవండీ.. అమరావతి ఎక్కడుంది?

ఏవండీ.. అమరావతి ఎక్కడుంది?

ఏపీ కొత్త రాజధాని అమరావతి ఎక్కడుంది?.. ఇదేం ప్రశ్న అనుకోవద్దు.. గుంటూరులో అమరేశ్వరాలయం ఉన్న అమరావతి ఊరికి వెళ్తే ఈ ప్రశ్న పదేపదే వినిపిస్తుంది. కారణం.. ఏపీ రాజధాని అమరావతి అనుకుని ఈ ఆలయం ఉన్న ఊరికి వస్తున్నారు కొందరు. రాజధాని అమరావతికి ఇంకా పూర్తిస్థాయిలో కనెక్టివిటీ లేకపోవడం.. విజయవాడ, గుంటూరు బస్టాండ్ల నుంచి అమరావతి అని కనిపించే బస్సులను చాలామంది ఎక్కుతుండడంతో ఇలా జరుగుతోంది.

ప్రభుత్వ పరంగా వివిధ పనులపై వచ్చే వారు వెలగపూడిలోని సచివాలయానికి బదులు అమరావతి గుడికి వెళుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. మరికొందరు రాజధాని ప్రాంతంలోనే బస్సులలో చక్కర్లు కొడుతూ యాతన పడుతున్నారు. ముఖ్యంగా విజయవాడ, గుంటూరులోని బస్టేషన్లలో రాజధాని అమరావతి వెళ్లేం దుకు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, కార్యదర్శులు, ప్రత్యేక కార్యదర్శుల నుంచి జరిగే ఉత్తర ప్రత్యుత్తరాల్లో చిరునామాగా చోట్ల అమరావతి అని పేర్కొంటున్నారు. దీంతో చాలా మంది అమరేశ్వరస్వామి ఆలయం ఉన్న అమరావతికి చేరుతున్నారు.

ఒకప్పడు ఉమ్మడి రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఆయా చిరునామాల ప్రకారం వెళ్లి పనులు చేయించుకునేవారు. నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి పేరును ప్రకటించి, వెలగపూడిలో సచివాలయ నిర్మాణాన్ని పూర్తి చేసి 2016 అక్టోబరు 3 నుంచి పాలనను ఇక్కడ నుంచే సాగిస్తున్నారు. పలు శాఖలకు చెందిన కార్యాల యాలను విజయవాడ, గుంటూరు నగరాలతోపాటు శివారు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. అంతా బాగానే ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి వచ్చే కొన్ని ఉత్తరాల్లో చిరునామాను అమరావతిగా పేర్కొనడంతో అనేక మంది అయోమయానికి లోనవుతున్నారు.

రీసెంటుగా కర్నూలులోని కళాశాల ప్రిన్సిపాల్‌ కాలేజ్‌ కమిషనరేట్‌ పని కోసం వెలగపూడి రావాల్సి ఉండగా ఆయనకు పంపిన ఉత్తరంలో చిరునామా అమరావతిగా పేర్కొన్నారు. దీంతో ఆయన కర్నూలు నుంచి నేరుగా విజయవాడకు సోమవారం ఉదయం బస్సులో వచ్చి అక్కడ బస్టాండ్‌లోనే అల్పాహారం తీసుకొని అమరావతి వెళ్లే బస్సు ఎక్కాడు. ఆయన అమరావతికి టికెట్‌ తీసుకోగా ఆ బస్సు సచివాలయం మీదుగా గంటన్నర ప్రయాణం తర్వాత అమరావతి చేరుకుంది. తీరా అక్కడ దిగిన ఆయన తనకు కావలసిన చిరునామా కోసం స్థానికులను విచారిస్తే.. ఆ కార్యాలయం వెలగపూడిలో ఉన్నట్లు తేలింది. దీంతో ప్రిన్సిపాల్‌ లబోదిబోమంటూ మరో బస్సులో వెలగపూడి చేరుకున్నారు. ఇలాంటి సంఘటనలు నిత్యం చోటు చేసు కుంటున్నాయని అమరావతి వాసులు చెబుతున్నారు. వెలగపూడి వెళ్లవలసిన అనేక మంది బస్సుల్లో అమరావతి వచ్చేస్తున్నారని తెలిపారు.

 కళాశాల ప్రిన్సిపాల్‌ వంటి చదువుకున్నవారినే ఇలా కన్ఫ్యూజ్ చేసేస్తుంటే  సామాన్యుల పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో ఈ ఘటనే అద్దం పడుతోంది. ఇప్పటికైనా ఆయా ప్రభుత్వశాఖలు చిరునామాల్లో కచ్చితంగా వెలగపూడి చిరునామాతోనే లావాదేవీలు జరపాలని, సందేహాల నివృత్తి కోసం టోల్‌ఫ్రీ నెంబరును కేటాయిస్తే దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఉపయుక్తంగా ఉంటుందని రాజధాని ప్రాంతవాసులు సూచిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English