కేసీఆర్ ఢిల్లీ టూర్ వెనుక భారీ స్కెచ్‌!

కేసీఆర్ ఢిల్లీ టూర్ వెనుక భారీ స్కెచ్‌!

కుడి చేత్తో చేసే ప‌ని ఎడం చేతికి తెలీన‌ట్లుగా కొన్నిసార్లు వ్య‌వ‌హ‌రిస్తుంటారు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి. ఆయ‌న మాట్లాడే మాట‌ల‌కు చేత‌ల‌కు మ‌ధ్య అంత‌రం ఎక్కువ ఉంటుంది. అలా అని ఆయ‌న క‌ద‌లిక‌ల్ని.. ఆయ‌న మాట‌ల్ని నిశితంగా గమ‌నిస్తే.. ఆయ‌న మ‌న‌సులోనిది కొన్నిసార్లు ఇట్టే దొరికిపోతుంది.

ఎక్క‌డిదాకానో ఎందుకు..?  కేసీఆర్ ఏదైనా కీల‌క‌మైన అంశం మీద మ‌ధ‌నం జ‌రుపుతుంటే ఆయ‌న ఫాంహౌస్ కి వెళ్లిపోతారు. రోజుల త‌ర‌బ‌డి ఉండిపోతారు. గ‌తంలో కేసీఆర్ ఫాంహౌస్ ప్ర‌యాణం గురించి వార్త‌లు వ‌చ్చేవి. ఈ మ‌ధ్య‌న అస్స‌లు రావ‌టం లేదు. కేసీఆర్ సార్ ఇష్ట‌ప‌డ‌టం లేద‌న్న మాట‌తో అలాంటి వార్త‌ల‌ను ఆపేసిన‌ట్లుగా చెబుతారు. కొన్నిసార్లు.. ఏదైనా ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న చోటు చేసుకుంటే మాత్రం చిన్న ముక్క‌గా వ‌స్తోంది. దీన్ని ఇలా వ‌దిలేసి కేసీఆర్ ముచ్చ‌ట్లోకి వెళితే. . కేంద్రానికి సంబంధించి ఏదైనా రాయ‌బారం న‌డ‌పాలంటే ఆయ‌న అడుగులు త‌ర‌చూ రాజ్ భ‌వ‌న్ వైపు వెళ్ల‌ట‌మే కాదు.. గంట‌ల కొద్దీ అక్క‌డే చ‌ర్చ‌లు జ‌రుపుతారు.

తాజాగా ఆయ‌న ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు ముందు.. గ‌వ‌ర్న‌ర్ ను క‌ల‌వ‌టం క‌నిపిస్తుంది. దేశంలో మ‌రే ముఖ్య‌మంత్రి కూడా గ‌వ‌ర్న‌ర్ ను ఇంత త‌ర‌చూ క‌ల‌వ‌టం.. ఇంత సుదీర్ఘంగా మాట్లాడటం క‌నిపించ‌దు. కొన్ని రాష్ట్రాల్లో అయితే.. గ‌వ‌ర్న‌ర్ తో ముఖ్య‌మంత్రి భేటీ అంటే అదో బ్రేకింగ్ న్యూస్ గా ఉంటుంది. ఇక‌.. కేసీఆర్ విష‌యంలో అయితే.. దాని ప్రాధాన్య‌త‌ను బాగా తగ్గించేశాయి మీడియా సంస్థ‌లు. కొన్నింట్లో మాత్రం.. కాస్త ఉత్సాహంతో కొద్దిగా రాయ‌టం మిన‌హాయిస్తే.. మిగిలిన వారంతా గ‌వ‌ర్న‌ర్ తో సీఎం భేటీ.. ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌పై చ‌ర్చ‌.. లాంటి సాదాసీదా మాటల‌తో వార్త పూర్తి అవుతుంది.

ఇంత‌కీ.. తాజాగా కేసీఆర్ ఢిల్లీ టూర్ వెనుక విష‌యం ఏమిట‌న్న ప్ర‌శ్న‌కు.. ఆస‌క్తిక‌ర‌మైన స‌మాధానం ల‌భిస్తోంది. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం.. కేసీఆర్ ఒక రాజ‌కీయ అంశానికి సంబంధించి ప్ర‌ధాని మోడీ స‌ల‌హా కోసం ఢిల్లీకి వెళ్లార‌న్న మాట వినిపిస్తోంది. అయితే.. ఈ విష‌యం ఏమిట‌న్న దానిపై స్ప‌ష్ట‌త రావ‌టం లేదు.

కాకుంటే.. తాను తీసుకోవాల్సిన నిర్ణ‌యానికి మోడీ మాట సాయం తీసుకుంటున్నారంటే.. అది చాలా పెద్ద విష‌య‌మ‌నే చెబుతున్నారు. తాను తీసుకునే రాజ‌కీయ నిర్ణ‌యానికి కేంద్రానికి సంబంధించిన సాంకేతిక సాయం అవ‌స‌రం అవుతుంద‌ని.. ఆ విష‌యం మీద క్లారిటీ కోస‌మే తాజా ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌గా చెబుతున్నారు.  ఇంత‌కీ ఆ రాజ‌కీయ అంశం ఏమిట‌న్న దానిపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు సంబంధించిన మోడీ ఆలోచ‌న‌లు తెలుసుకోవాల‌న్న మాట ఒక‌టైతే..నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌లు ఎప్పుడు జ‌రుగుతాయ‌న్న దానిపై మోడీ క్లారిటీ తీసుకొని.. దానికి త‌గ్గ‌ట్లే త‌న ఆలోచ‌న‌లు ప్ర‌ధానితో పంచుకోవాల‌న్న ఆకాంక్ష‌తో కేసీఆర్ ఢిల్లీ టూర్ ఉంద‌న్న మాట వినిపిస్తోంది. అయితే.. ఇందులో నిజం ఎంత‌న్న‌ది రానున్న రోజుల్లో క్లారిటీ రావ‌టం ఖాయం.  


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు