ఆ ఆగ్ర‌న‌టుడి మాట‌తో అంద‌రి కంటా త‌డి!

ఆ ఆగ్ర‌న‌టుడి మాట‌తో అంద‌రి కంటా త‌డి!

ఒక బాలీవుడ్ న‌టుడికి హాలీవుడ్ లో అదే ప‌నిగా అవ‌కాశాలు రావ‌టం మామూలు విష‌యం కాదు. అంతేనా.. అత‌గాడు సీన్లోకి వ‌స్తే.. స్క్రీన్ మీద ఎవ‌రున్నా.. అత‌డి మీద‌నే అంద‌రి కాన్సంట్రేష‌న్. పాత్ర‌.. చిన్న‌దా.. పెద్ద‌దా? అన్న‌ది ప‌ట్టించుకోకుండా త‌న‌కిచ్చిన అవ‌కాశాన్ని నూటికి నూరుపాళ్లు న్యాయం చేసే అతి కొద్ది న‌టుల్లో బాలీవుడ్ న‌టుడు ఇర్ఫాన్ ఖాన్ ఒక‌రు.

కావాల్సినంత సొమ్ములు.. అంత‌కు మించిన పేరు ప్ర‌ఖ్యాతులు.. కోట్లాది మంది అభిమాన‌గ‌ణం.. ఒక వ్య‌క్తికి ఇంత‌కు మించి కావాల్సిందేముంది? అనిపించేలా ఉండే అత‌డి జీవితాన్ని క్యాన్స‌ర్ మొత్తంగా మార్చేసింది. నిక్షేపంగా ఉన్న‌ట్లు క‌నిపించే ఇర్ఫాన్ క్యాన్స‌ర్ అడ్వాన్స్ స్టేజ్ లో ఉండ‌టం.. చికిత్స కోసం అమెరికాకు వెళ్ల‌టం తెలిసిందే.
 
సినీ అభిమానులు మొద‌లుకొని ఇర్ఫాన్ గురించి తెలిసిన ప్ర‌తి ఒక్క‌రూ షాక్ కు గురైన ఆయ‌న అనారోగ్యంపై తాజాగా బాంబు లాంటి మ‌రో నిజాన్ని చెప్పారు. తానిక ఎక్కువ కాలం బ‌త‌క‌లేన‌న్న చేదు నిజాన్ని చెప్పేశారు. ఈ విష‌యం త‌న మెద‌డు త‌న‌కు నిత్యం గుర్తు చేస్తూనే ఉంటుంద‌న్నారు.

తాజాగా ఒక మీడియా సంస్థ‌కు ఇచ్చిన ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన ఇర్ఫాన్‌.. కొంత‌కాలంగా ఎండో క్రిన్ ట్యూమ‌ర్  క్యాన్స‌ర్ తో బాధ ప‌డుతున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న లండ‌న్ లో చికిత్స పొందుతున్నారు. త‌న‌కు సోకిన క్యాన్స‌ర్ కు ఆరు ద‌శ‌ల్లో కీమోథెర‌పీ చేయాల‌ని.. ఇప్ప‌టికి నాలుగు సైకిల్స్ పూర్తి అయ్యాయ‌ని.. మ‌రో రెండు సైకిల్స్ మిగిలి ఉన్న‌ట్లు చెప్పారు.

ఆ సైకిల్స్ కూడా పూర్తి అయ్యాక మ‌రోసారి స్కానింగ్ చేస్తార‌న్నారు. త‌న‌కు తెలిసినంత వ‌ర‌కూ మ‌రి కొద్ది నెల‌లు.. లేదంటే ఒక ఏడాది.. కాదూకూడ‌దూ అంటే మ‌రో రెండేళ్లు మాత్ర‌మే తానిక జీవిస్తాన‌ని.. ఇక‌పై ఈ విష‌యాన్ని త‌న మ‌న‌సులో నుంచి తీసేయాల‌ని అనుకుంటున్నట్లు చెప్పారు. ఉన్నంత కాలం ఆనందంగా ఉండాల‌ని భావిస్తున్నట్లు చెప్పారు. క‌రిగే కాలంతో పోటీ ప‌డే ఆయుష్షు లెక్క తెలిశాక ఇర్పాన్ నోటి నుంచి వ‌స్తున్న మాట‌లు మ‌న‌సు చేదెక్కించ‌ట‌మే కాదు.. అంద‌రి కంట క‌న్నీరును పెట్టిస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు