అశోక్ గజపతి రాజకీయాల నుంచి తప్పుకోనున్నారా?

అశోక్ గజపతి రాజకీయాల నుంచి తప్పుకోనున్నారా?

కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదా? లేదంటే లోక్‌సభకు కాకుండా శాసనసభకు పోటీ చేస్తారా..? ప్రస్తుతం ఉత్తరాంధ్ర రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న చర్చ ఇది. సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న అశోక్ 2014లో తొలిసారి పార్లమెంటుకు వెళ్లారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో తెలుగుదేశం చేరడంతో ఆయనకు మంత్రి పదవి దక్కింది. అయితే... అయిదేళ్లు పదవి అనుభవించడానికి ముందే పొత్తులు పెటాకులవడంతో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అంతేకాదు.. అప్పటివరకు ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే.. 2019 ఎన్నికల్లో అశోక్ పార్లమెంటుకు వెళ్లాలని అనుకోవడం లేదట. తన పెద్ద కుమార్తె అదితి గజపతి రాజును విజయనగరం పార్లమెంటు సీటుకు బరిలో నిలపనున్నట్లు వినిపిస్తోంది.

    అయితే.. కొన్నాళ్ల కిందటే ఈ ప్రచారం మొదలవగా అశోక్ దీన్ని పలుమార్లు ఖండించారు. అశోక్‌తో పాటు ఆమె పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో ఆమె రాజకీయ రంగ ప్రవేశంపై ప్రచారం జరిగింది. కానీ.. అశోక్ మాత్రం.. అదితి కేవలం మాన్సాస్ ట్రస్ట్ కార్యక్రమాల్లోనే పాల్గొంటోందని.. అవి రాజకీయ కార్యక్రమాలు కావని చెబుతున్నారు. మాన్సాస్ ట్రస్టు వ్యవహారాలను ఆమె చూస్తుండడంతో అందుకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని అశోక్ చెప్పుకొస్తున్నారు.

    మరోవైపు అదితి మాత్రం తన రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలకు తావిచ్చేలా ఇటీవల మాట్లాడారు. ఒక తెలుగు ఛానల్‌తో మాట్లాడుతూ భవిష్యత్తులో ఏం జరుగుతుందో తానేమీ చెప్పలేనని అన్నారు. దీంతో ఆమె రాజకీయ ప్రవేశంపై విజనగరం టీడీపీ నేతల నుంచి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అంతేకాదు... గత ఎన్నికల్లో ఆమె తండ్రి తరఫున చురుగ్గా ప్రచారం చేసిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. అయితే... తెలుగుదేశం అధినేత చంద్రబాబు మాత్రం అశోక్‌ను ఈసారి కూడా పార్లమెంటుకు పోటీ చేయించాలని భావిస్తున్నట్లు సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు