భాజపాని దించాలి.. మోదీని వంచాలి

భాజపాని దించాలి.. మోదీని వంచాలి

ఇప్పుడు జాతీయ స్ధాయిలో అన్ని పార్టీలదీ ఒకటే నినాదం... ఇప్పుడు రాష్ట్రాలలోనూ ఒక్కటే కోరిక. అదే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని గద్దె దించడం. అంతేే కాదు... ఇన్నాళ్లూ ఏకఛత్రాదిపత్యంగా ఏలుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆ పదవి నుంచి తప్పించాలి.

ఇందుకోసం వైరి పక్షాలు ఏకం అవుతున్నాయి. నిన్నటి వరకూ ఉప్పూ... నిప్పుగా ఉన్న వారు... భూమి.. ఆకాశం అంత దూరంగా మెలిగిన వారు ఇప్పుడు ఏకం అవుతున్నారు. ఇందుకు ఆ పార్టీ.. ఈ పార్టీ అని మినహాయింపు లేదు. జాతీయ పార్టీ... ప్రాంతీయ పార్టీ అని సంబంధం లేదు. అన్ని రాజకీయ పార్టీలు ఏకం అవుతున్నాయి. ఇందుకోసం వారి మధ్య ఇన్నాళ్లుగా ఉన్న వైరాన్ని సైతం పక్కన పెడుతున్నాయి. అన్ని పార్టీలు... నాయకులు కూడా ముందు భారతీయ జనతా పార్టీ పతనం... నరేంద్ర మోదీ అధికారం నుంచి వైదొలగేలా చేయడం. ఇదే అందరి ఏకైక ఫార్మలాగా మారింది.

కాంగ్రెస్ పార్టీలో... అందునా జాతీయ స్ధాయిలో ఆ పార్టీకి తలలో నాలికలా మెలిగిన దీదీ మమతా బెనర్జీ అలిగి ఆ పార్టీని వీడారు. పట్టుదలతో... పౌరుషంతో తాను పెట్టిన కొత్తపార్టీని పశ్చిమ బెంగాల్ లో అధికారంలోకి తీసుకువచ్చారు. అప్పటి నుంచి ఆమె కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే పని చేస్తున్నారు. అయితే ఇప్పుడు సీన్ మారిపోయింది.

తాజాగా మమతా దీదీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని, ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని కలిసారు. చాలా సేపు మంతనాలు జరిపారు. దీని అర్ధం... పరమార్ధం ఒక్కటే. ముందుగా భారతీయ జనతాపార్టీని గద్దె దించడమే. ఇందుకోసం ప్రధాని పదవిని కూడా పక్కన పెడదాం అంటూ త్యాగానికి సిద్ధపడ్డారు. అంతకు ముందే రాహుల్ గాంధీ కూడా ఇదే అంశాన్ని పక్కన పెట్టారు.

ప్రధాని ఎవరూ అనేది ముఖ్య అంశం కాదని, నరేంద్ర మోదీని గద్దె దించడమే లక్ష్యమని ఆయన చెప్పారు. అలాగే వామపక్షాలు కూడా ఇదే వైఖరిని ప్రకటించాయి. ప్రాంతీయ పార్టీలైన తెలుగుదేశం, బహుజన సమాజ్ పార్టీ, డిఎంకె, జనతాదళ్, శివసేన, ఎంఐఎం, బిఎస్పీ వంటి పార్టీలు కూడా ఈ త్యాగాలకు సై అంటున్నాయి. దీంతో ఈ పార్టీలన్నింటి లక్ష్యం భారతీయ జనతా పార్టీగా మారింది.

అంతే కాదు... నియంతలా మారుతున్న నరేంద్ర మోదీని అధికారం నుంచి తప్పించడమే లక్ష్యంగా పని చేయాలని నిర్ణయించుకున్నాయి. ఎన్నికలకు ఏడాది సమయమున్న కాలంలో కప్పల తక్కెడ పార్టీలన్నీ ఒక్క మాటపై నిలబడతాయో లేదో వేచి చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు