ఏం ముద్ర‌గ‌డ‌.. ఇప్పుడేమంటావ్‌?

ఏం ముద్ర‌గ‌డ‌.. ఇప్పుడేమంటావ్‌?

కీల‌క అంశాల మీద నిర్ణ‌యాలు యుద్ధ‌ప్రాతిప‌దిక‌న తీసుకోవ‌టం సాధ్యం కాదు. సున్నిత‌మైన అంశాల్ని ఒక కొలిక్కి తీసుకురావ‌టానికి ప్ర‌త్యేక వ్యూహం అవ‌స‌రం. అంతేకాదు.. రాజ‌కీయ ప‌రిస్థితులు.. సానుకూల వాతావ‌ర‌ణం చాలా అవ‌స‌రం. ఒక‌రికి మేలు జ‌రుగుతుందంటే.. మ‌రికొరికి దాని కార‌ణంగా న‌ష్టం జ‌రుగుతుంద‌న్న అభిప్రాయాలు బ‌లంగా ఉన్న వేళ‌లో.. అలాంటివేమీ ఉండ‌వ‌న్న న‌మ్మ‌కం క‌లిగించాల్సిన అవ‌స‌రం బాధ్య‌త క‌లిగిన ప్ర‌భుత్వాల‌కు ఉంటుంది.

తాను ఇచ్చిన హామీకి త‌గ్గ‌ట్లే కాపు రిజ‌ర్వేష‌న్ల మీద ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఆచితూచి వ్య‌వ‌హ‌రించిన సంగ‌తిని మ‌ర్చిపోకూడ‌దు. అయితే.. కాపు రిజ‌ర్వేష‌న్ అంశాన్ని భావోద్వేగ అంశంగా మార్చేసి రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు పొందాల‌న్న ప్ర‌య‌త్నం జ‌ర‌గ‌టం తెలిసిందే.

ఇలాంటివేళ‌లో చోటు చేసుకున్న ప్ర‌తి ఉదంతాన్ని భూత‌ద్దంలో చూపిన జ‌గ‌న్‌.. తాజాగా మాత్రం కాపు రిజ‌ర్వేష‌న్ల‌పై తానేమీ చేయ‌లేనని తేల్చేయటం సంచ‌ల‌నంగా మారింది. కాపు రిజ‌ర్వేష‌న్ మీద తాజాగా క్లారిటీ ఇచ్చిన జ‌గ‌న్ తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనూ విస్మ‌యం వ్య‌క్త‌మ‌వుతోంది. కాపు రిజ‌ర్వేష‌న్ మీద ఉన్న అడ్డంకుల్ని అధిగ‌మించేలా చేసే వీలున్నా.. అదేమీ సాధ్యం కాద‌న్న‌ట్లుగా తేల్చేసిన జ‌గ‌న్‌.. త‌న ద్వంద నీతిని మ‌రోసారి ప్ర‌ద‌ర్శించార‌ని చెబుతున్నారు.

కాపు రిజ‌ర్వేష‌న్లు సాధ్యం కాద‌ని చెబుతున్న జ‌గ‌న్‌.. కాపు ఉద్య‌మం పేరుతో జ‌రిగిన రాజ‌కీయ క్రీడ‌ను ఎందుకు ఆడించిన‌ట్లు? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. కాపు ఉద్య‌మం పేరుతో భావోద్వేగాల్ని ర‌గిలించిన ముద్ర‌గ‌డ‌.. జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌పై ఇప్ప‌టివ‌ర‌కూ స్పందించింది లేదు. తాను అనుకున్నంత‌నే అన్ని జ‌రిగిపోవాల‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే ముద్ర‌గ‌డ‌.. జ‌గ‌న్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన గంట‌ల త‌ర్వాత కూడా ఇంకా స్పందించ‌క‌పోవ‌టం దేనికి నిద‌ర్శ‌నమ‌న్నది ఇప్పుడు క్వ‌శ్చ‌న్ గా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు