మా జ‌గ‌న్‌కు ఏమైంది.. త‌ల ప‌ట్టుకుంటున్న నేత‌లు!

మా జ‌గ‌న్‌కు ఏమైంది.. త‌ల ప‌ట్టుకుంటున్న నేత‌లు!

త‌ప్పు ఒక‌సారి చేయొచ్చు. కానీ.. ప‌దే ప‌దే చేయ‌టంపై వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌ల నోటికి మాట‌లు రాని ప‌రిస్థితి. ఒక వారంలో రెండు భారీ త‌ప్పులు చేయ‌టం ఏ రాజ‌కీయ అధినేతా చేయ‌రు. కానీ.. ఆ విష‌యంలో జ‌గ‌న్ కొత్త రికార్డ్ సృష్టించార‌నే చెప్పాలి.

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పై తాను చేసిన వ్య‌క్తిగ‌త వ్యాఖ్య‌లు పెను దుమారాన్ని రేప‌ట‌మే కాదు.. ప‌వ‌న్ అభిమానుల‌తో పాటు.. ప‌లువురిలో తీవ్ర ఆగ్ర‌హాం వ్య‌క్త‌మ‌య్యేలా చేసింది. ఎన్న‌డు వ్య‌క్తిగ‌త విష‌యాల మీద మాట్లాడ‌ని ప‌వ‌న్ ను ఉద్దేశించి జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌లు చూస్తే.. ల‌క్ష్మ‌ణ‌రేఖను పూర్తిగా దాటేశార‌న్న అభిప్రాయాన్ని ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు.

ప‌వ‌న్ పై చేసిన వ్యాఖ్య‌ల వివాదం ఒక కొలిక్కి రాక ముందే.. జ‌గ‌న్ నోటి నుంచి వ‌చ్చిన మ‌రో మాట ఆస‌క్తిక‌రంగా మార‌ట‌మే కాదు.. కాపుల్లో తీవ్ర ఆగ్ర‌హావేశాలు వ్య‌క్త‌మ‌య్యేలా చేస్తోంది. కీల‌క అంశంలో జ‌గ‌న్ ప్ర‌ద‌ర్శించిన వైఖ‌రి ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ ఇవ్వ‌లేన‌ని కుండ‌బ‌ద్ధ‌లు కొట్టిన జ‌గ‌న్ మాట‌లు వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌ల నోటి నుంచి మాట‌లు రాకుండా చేస్తున్నాయి. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో జ‌రుగుతున్న జ‌గ‌న్ పాద‌యాత్ర సంద‌ర్భంగా జ‌గ్గంపేట‌లో శ‌నివారం స‌భ‌ను ఏర్పాటు చేశారు. జ‌గ‌న్ మాట్లాడుతున్న వేళ‌.. కొంద‌రు యువ‌కులు కాపు రిజ‌ర్వేష‌న్ల ప్ల‌కార్డులు ప‌ట్టుకున్న  వైనాన్ని చూశారు. ఆ వెంట‌నే స్పందించిన ఆయ‌న‌.. కాపు రిజ‌ర్వేష‌న్ల‌పై త‌న వైఖ‌రిని వెల్ల‌డించారు.

తాను ఏదైనా మాట ఇస్తే మాట మీదే నిల‌బ‌డ‌తాన‌ని.. చేయ‌గ‌లిగింది మాత్ర‌మే చెబుతాన‌ని.. నాకు చేయ‌లేనిది చెప్పే అల‌వాటు లేద‌ని కాపుసోద‌రుల‌కు చెబుతున్నానంటూ.. "కొన్ని అంశాలు రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌రిధిలో ఉన్న అంశాలు ఉంటాయి. మ‌రికొన్ని రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌రిధిలో లేనివి ఉంటాయి. అలాంటిదే ఈ రిజ‌ర్వేషన్ స‌మ‌స్య‌. రిజ‌ర్వేష‌న్లు 50 శాతం దాటితే సుప్రీంకోర్టు జ‌డ్జిమెంటు ఉన్న ప‌రిస్థితుల్లో.. ఇవ‌న్నీరాష్ట్ర ప్ర‌భుత్వం ప‌రిధిలో లేని అంశాలు. కాబ‌ట్టి వీటి మీద నేను చేయ‌గ‌లిగింది ఏమీ లేదు. కాబ‌ట్టి నేను చేయ‌లేక‌పోతున్నా అని కచ్ఛితంగా మీ అంద‌రికీ.. ఏ మాత్రం మొహ‌మాటం లేకుండా చెబుతున్నా" అని వ్యాఖ్యానించారు.

జ‌గ‌న్ మాట‌ల‌కు వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌ల ముఖంలో ర‌క్తం చుక్క లేకుండా పోయింది. ప‌వ‌న్ పై త‌మ అధినేత చేసిన వ్య‌క్తిగ‌త వ్యాఖ్య‌ల కార‌ణంగా జ‌రిగిన డ్యామేజీ ఒక కొలిక్కి రాకుండా.. కాపుల్లో వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతుంద‌న్న మాట‌ను వారు చెబుతున్నారు. అలాంటి వేళ‌.. కాపుల‌కు మ‌రింత మంట పుట్టేలా రిజ‌ర్వేష‌న్ల మీద జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌లు పార్టీని భారీగా న‌ష్ట‌పోయేలా చేస్తాయ‌ని వ్యాఖ్యానిస్తున్నారు. కొంద‌రు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌లైతే.. మా జ‌గ‌న్ కు ఏదో అయ్యింది.. ఆయ‌న మా కొంప ముంచుతున్నాడంటూ ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. కాపు రిజ‌ర్వేష‌న్ల‌పై జ‌గ‌న్ క్లారిటీ ఇచ్చిన వైనం ఏ మాత్రం స‌రిగా లేద‌న్న అభిప్రాయం జ‌గ‌న్ పార్టీలో వ్య‌క్త‌మ‌వుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు