షర్టు విప్పడం తప్పే అన్న గంగూలీ

షర్టు విప్పడం తప్పే అన్న గంగూలీ

90ల్లో భారత క్రికెట్ జట్టు మైదానంలో ఎంత భయం భయంగా కనిపించేదో తెలిసిందే. పెద్ద జట్లను ఎదుర్కొనేటపుడు భారత జట్టులో అసలు ఆత్మవిశ్వాసం కనిపించేది కాదు. భారత్ ఎక్కువగా మ్యాచ్‌లు ఓడిపోవడానికి అదో ముఖ్య కారణం. అలాంటి జట్టులో ఎక్కడ లేని ధైర్యం, ఆత్మవిశ్వాసం, దూకుడు తీసుకొచ్చిన ఘనత సౌరభ్ గంగూలీకే చెందుతుంది. అతను కెప్టెన్సీ చేపట్టాక భారత జట్టు ముఖచిత్రమే మారిపోయింది.

సౌరభ్ కెప్టెన్సీ ప్రస్థానంలో ఎన్నో మెరుపులున్నాయి. అందులో నాట్ వెస్ట్ సిరీస్ విజయం ఒకటి. లార్డ్స్ వేదికగా జరిగిన ఆ టోర్నీ ఫైనల్లో భారత్ భారీ లక్ష్యాన్ని ఛేదించడం అప్పట్లో పెద్ద సంచలనం. విజయానంతరం సౌరభ్ లార్డ్స్ బాల్కనీ నుంచి షర్టు విప్పి గింగిరాలు తిప్పిన ఘటన భారత క్రికెట్ చరిత్రలోనే ఒక ప్రత్యేకమైన ఘట్టం.

ఐతే అప్పుడు ఆవేశంలో ఏదో అలా చేసేశానని.. కానీ తాను అలా చేయడం తప్పే అని గంగూలీ ఇప్పుడు అంటున్నాడు. ముందు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బౌలర్ ప్లింటాఫ్ షర్టు విప్పి అతి చేయడంతో.. దానికి బదులుగా ఆవేశంలో తాను అలా చేశానని చెప్పాడు దాదా. నిజానికి తాను షర్టు విప్పే ప్రయత్నంలో ఉన్నపుడు తన చుట్టూ ఉన్న వీవీఎస్ లక్ష్మణ్, హర్భజన్ సింగ్ తదితరులు తనను వారించే ప్రయత్నం చేశారన్నారు. కానీ తాను మాత్రం ఎవరి మాటా వినకుండా షర్టు విప్పేశానన్నాడు. తాను చొక్కా విప్పాక.. ఇప్పుడు తానేం చేయాలని లక్ష్మణ్ అడిగాడని.. నువ్వు కూడా చొక్కా విప్పేయ్ అంటూ అతడిని బలవంతం చేశానని.. కానీ అతను అంగీకరించలేదని గంగూలీ చెప్పాడు.

ఈ ఘటనను తర్వాత చూసుకుని కొంచెం సిగ్గు పడ్డానని.. తన కూతురు సైతం ఈ విషయంలో తనను ప్రశ్నిస్తుందని.. చొక్కా విప్పాల్సిన అవసరముందా అని అడుగుతుందని గంగూలీ చెప్పాడు. ఐతే కొన్నిసార్లు మన చేతుల్లో ఏమీ ఉండదని గంగూలీ వ్యాఖ్యానించాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు