రధాని పదవికి చేరువగా ఇమ్రాన్ ఖాన్

రధాని పదవికి చేరువగా ఇమ్రాన్ ఖాన్

హింసాత్మక సంఘటనల మధ్య ముగిసిన పాకిస్థాన్ ఎన్నికల్లో అధికారిక ఫలితాలు వెలువడనప్పటికీ గెలుపెవరిదో తెలిసిపోయింది. పాక్ జాతీయ అసెంబ్లీకి బుధవారం ఎన్నికలు జరిగాయి. ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఇప్పటి వరకు అందిన ఫలితాల ప్రకారం.. ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ ముందంజలో ఉంది. మొత్తం 113 స్థానాల్లో పీటీఐ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పార్టీ పీఎంఎల్-ఎన్ 65 స్థానాలు, బిలావల్ భుట్టోకు చెందిన పీపీపీ పార్టీ 43 స్థానాలతో రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి.

నిజానికి ఈసరికే ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. కానీ.... ఓట్ల లెక్కింపు మొదలై పన్నెండు గంటలు దాటినా తుది ఫలితాలు వెల్లడి కాలేదు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఫలితాల్లో ఆలస్యం తలెత్తిందని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. రిజల్ట్స్ ట్రాన్సిమిషన్ సిస్టమ్ పనిచేయకపోవడంతో ఫలితాలు వెల్లడించలేకపోయినట్లు అధికారులు చెబుతున్నారు. మొత్తం 85 వేల పోలింగ్ కేంద్రాలు ఉండగా అందులో కేవలం 25 వేల కేంద్రాలకు సంబంధించిన ఫారాలు మాత్రమే తమకు అందాయని చెప్తున్నారు. కాగా  ఇప్పటివరకు అందిన ఫలితాల ప్రకారం ఇమ్రాన్ ఖాన్ పార్టీ ముందంజలో ఉండగా ఇతర పార్టీలు ఈ ఎన్నికల ఫలితాల వెల్లడిలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్నాయి. పాకిస్తాన్ ముస్లీం లీగ్ - ఎన్, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీలు ఫలితాలను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించాయి. ఫలితాలను తారుమారు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఇమ్రాన్ ఖాన్, నవాజ్ షరీఫ్ లు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు.

పాకిస్తాన్ కు చెందిన డాన్ పత్రిక సమాచారం ప్రకారం ఇమ్రాన్ పార్టీకి 42 శాతం ఓట్లు పడ్డాయి. 113 స్థానాల్లో ఆ పార్టీ గెలిచినట్లు డాన్ పత్రిక వెల్లడించింది. దీంతో ఇతర పార్టీల మద్ధతు అవసరం లేకుండానే ఇమ్రాన్ ఖాన్ ప్రధాని అయ్యే అవకాశం కనిపిస్తోంది. పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీలో మొత్తం 342 సీట్లుంటాయి. అందులో మతపరమైన అల్పసంఖ్యాకులకు 60, మహిళలకు 10 పోను మిగతా 272 స్థానాలకు ప్రత్యక్ష ఎన్నికలు జరుగుతాయి.  137 సీట్లు సాధించిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతుంది.