హైద‌రాబాద్ లో వాటా ఇస్తారా హ‌రీష్?

హైద‌రాబాద్ లో వాటా ఇస్తారా హ‌రీష్?

ఓ ప‌క్క ఏపీకి ప్రత్యేక హోదా కోసం కొద్ది నెల‌లుగా కేంద్రంపై ఏపీలోని ప్ర‌జ‌లు,  పార్టీలు తీవ్ర‌స్థాయిలో ఆందోళ‌న‌లు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా పార్ల‌మెంటులో ప్ర‌వేశ‌పెట్టిన అవిశ్వాస తీర్మానం సంద‌ర్భంగా కూడా పలువురు ఏపీకి హోదా ఇవ్వవ‌ల‌సిందేన‌ని నొక్కి వ‌క్కాణించారు. కేంద్రం...ఏపీకి అన్యాయం చేసింద‌ని ప‌లువురు జాతీయ‌స్థాయి నేత‌లు అభిప్రాయ‌ప‌డ్డారు. అయితే, ప‌క్క రాష్ట్రం అయిన తెలంగాణ ఎంపీలు మాత్రం....ఏపీకి హోదా విష‌యంలో మ‌ద్ద‌తు తెల‌ప‌లేదు. తాజాగా, హోదాపై తెలంగాణ నీటిపారుద‌ల శాఖ మంత్రి హ‌రీష్ రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణకూ ఇవ్వాల్సిందేన‌ని....పరిశ్రమలకు ప‌న్ను రాయితీ కూడా ఇవ్వాని అన్నారు. ఏపీకి ఏమిచ్చినా....తెలంగాణ‌కు ఇవ్వాలని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బిజెపిలు....తెలంగాణను మోసం చేస్తున్నాయ‌ని ఆరోపించారు. ఏపీకి హోదా ఇస్తామ‌ని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో తీర్మానం చేశార‌ని, తెలంగాణ‌కూ హోదా కావాల‌ని టీ కాంగ్రెస్ ఎందుకు అడగటం లేదని హ‌రీష్ అన్నారు. ఈ నేప‌థ్యంలో హ‌రీష్ వ్యాఖ్య‌ల‌పై ఏపీ మంత్రి సోమిరెడ్డి ఘాటుగా స్పందించారు.

విభ‌జ‌నానంత‌రం రాజధాని హైద‌రాబాద్ ను వ‌దిలి కట్టుబట్టలతో అవ‌శేషాంధ్ర‌ప్ర‌దేశ్ కు వ‌చ్చామ‌ని సోమిరెడ్డి అన్నారు. హైదరాబాద్ ఆదాయంలో సగం వాటా ఇచ్చేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందా? అని సోమిరెడ్డి ధ్వ‌జ‌మెత్తారు. లోటు బ‌డ్జెట్ తో ఉన్న ఏపీకి మౌలిక వసతులు, ఆదాయం లేవని, విభ‌జ‌న స‌మ‌యంలో హైద‌రాబాద్ కు మిగులు బ‌డ్జెట్ ఉంద‌ని....అటువంటిది ఈనాడు ఏపీకి ఏమి ఇచ్చినా తెలంగాణ‌కూ ఇవ్వాలన్న హరీష్ వ్యాఖ్యలు సమంజసంగా లేవ‌న్నారు. ఏపీకి కేంద్రం అన్యాయం చేసింద‌ని దేశం మొత్తం చ‌ర్చించుకుంటున్న స‌మయంలో...టీఆర్ ఎస్ ఇలా అడ్డు తగలడం, మెలికలు పెట్టడం సరికాదని హితవు పలికారు. మ‌రోవైపు, హ‌రీష్ వ్యాఖ్య‌ల‌పై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మండిప‌డ్డారు.  హైదరాబాద్ తో కూడిన తెలంగాణ మనకు.... ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని సోనియా ఆనాడు చెప్పారని గుర్తు చేశారు. ఆనాడు మాట్లాడ‌ని హరీష్ ...ఈనాడు మాట్లాడ‌డం రాజకీయ లబ్ది కోసమేనని రేవంత్ అన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English