ఫ్యాన్స్‌కు ప‌వ‌న్ పిలుపు... మ‌రీ ఇన్ని ట్విస్టులా?

ఫ్యాన్స్‌కు ప‌వ‌న్ పిలుపు... మ‌రీ ఇన్ని ట్విస్టులా?

ఏపీ రాజ‌కీయాలు ఇటు ఆన్‌లైన్‌, అటు ఆఫ్‌లైన్ ప్ర‌చార మాధ్య‌మాల్లో హాట్ హాట్‌గా మారుతున్నాయి. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో నాయ‌కులు క్షేత్ర‌స్థాయిలో ఎంతగా విమ‌ర్శ‌లు, ప్ర‌తి విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారో..అంతే స్థాయిలో ఆన్‌లైన్ మాధ్య‌మాల్లో కూడా త‌మ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ఈ ప‌ర్వంలో తాజాగా కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైసీపీ అధ్య‌క్షుడు జ‌గ‌న్ మోహన్‌రెడ్డి ఇటీవ‌ల జ‌రిగిన ప్రెస్‌మీట్‌లో  జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పై ప‌లు ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ``కార్లను మార్చినంత తేలిగ్గా పవన్‌కల్యాణ్ పెండ్లాలను మారుస్తాడు. ఇప్పటికే నలుగురిని మార్చాడు. ఇలాంటి వ్యక్తి మాటలకు కూడా మనం సమాధానం చెప్పాలంటే విలువలు ఎక్కడున్నాయి? అంటూ పవన్‌ను జగన్ విమర్శించిన విషయం తెలిసిందే.

దీంతో స‌హ‌జంగానే....ప‌వ‌న్ అభిమానులు జ‌గ‌న్‌పై విరుచుకుప‌డ్డారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా జ‌గ‌న్‌పై త‌మ ఆగ్ర‌హాన్ని వెళ్ళ‌గ‌క్కారు. ఈ ప‌రిణామం ఏ మ‌లుపు తిరుగుతుందో అని రాజ‌కీయ‌వ‌ర్గాలు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న క్ర‌మంలో ప‌వ‌న్ ఎంట్రీ ఇచ్చారు. త‌న‌ అభిమానుల‌కి ప‌వ‌న్ త‌న విన్న‌పాన్ని ట్వీట్ ద్వారా తెలియ‌జేశారు. ``జ‌గ‌న్ విమ‌ర్శించిన తీరు చాలా మందికి బాధ క‌లిగించిన‌ట్టు నా దృష్టికి వ‌చ్చింది. నేను ఎవ‌రి వ్య‌క్తిగ‌త జీవితాల‌లోకి వెళ్ల‌ను. అది రాజ‌కీయ ల‌బ్ధి కోసం వాడ‌ను. ప్ర‌జ‌ల‌కి సంబంధించిన పాల‌సీల మీద‌నే పార్టీల‌తోనే నేను విభేదిస్తాను. వ్య‌క్తిగ‌తంగా నాకు ఎవ‌రితో విభేదాలు లేవు. ఈ త‌రుణంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారిని, వారి కుటుంబ స‌భ్యుల‌ని కాని, వారి ఇంటి ఆడ‌ప‌డుచుల‌ని వివాదంలోకి లాగొద్దని మ‌న‌స్పూర్తిగా వేడుకుంటున్నాను`` అని పవ‌న్ త‌న ట్వీట్‌లో ఫ్యాన్స్‌ను కోరారు.

అయితే,  ప‌వ‌న్ స్పంద‌న హుందాగా ఉన్న అది కొత్త సందేహాన్ని రేకెత్తిస్తోంద‌ని అంటున్నారు. ఈ ట్వీట్‌కు ముందురోజు భీమవరంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో.. జ‌గ‌న్‌పై  ప‌వ‌న్‌ మండిప‌డిన సంగ‌తి తెలిసిందే. ఫ్యాక్షనిస్టులు నోటికొచ్చినట్టు మాట్లాడితే సైనికుడు ఉప్పెనలా పోరాడుతాడని స్పష్టంచేశారు. దూరం నుంచి చూస్తే తాను మెతకగానే కనిపిస్తానని, దగ్గరకొస్తే తోలు తీస్తానని పవన్ ధ్వజమెత్తారు. ``సినిమాల్లో డ్యాన్సులు చేసి, డైలాగులు చెప్పానని అనుకుంటున్నారేమో. బయటకు రండి నేనేంటో చూపిస్తా. వ్యక్తిగత విమర్శలు చేయాలనుకుంటే మీకంటే బలంగా చేయగలను. నా వెనుక వేల కోట్ల ఆస్తులు లేవు. ప్రజాభిమానమే ఉంది. చిన్నప్పుడు బాడీగార్డునవుతానని చెప్పేవాడిని. ఈ రోజు నేను సమాజానికి అంగరక్షకుడిని`` అంటూ ఉద్వేగంగా మాట్లాడారు. అనంత‌ర‌మే తిరిగి సంయ‌మ‌నం ట్వీట్ చేశారు. మ‌రోవైపు అభిమానులు విరుచుక‌ప‌డి, రెండు రోజుల పాటు వ‌క్ర‌భాష్యాలు ప్ర‌చారం పెట్టి, దుష్ప్ర‌చారం చేసిన త‌ర్వాత ప‌వ‌న్ త‌న ఫ్యాన్స్‌కు సూచిస్తే ప్ర‌యోజ‌నం ఏంటని ఇంకొంద‌రు అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు