జ‌గ‌న్ బ‌లంపై ఉండ‌వ‌ల్లి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

జ‌గ‌న్ బ‌లంపై ఉండ‌వ‌ల్లి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

జ‌నాక‌ర్ష‌ణ నేత కాకున్నా.. ఆయ‌న మాట‌ల్ని ఆస‌క్తిగా వినే ఛ‌రిష్మా ఉన్నోడిగా మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ ను చెప్పొచ్చు. ఏపీ నేత‌ల్లో ఎక్కువ మంది పారిశ్రామిక‌వేత్త‌లు.. వ్యాపార‌వేత్త‌లే ఎక్కువ‌గా క‌నిపిస్తారు. డొక్క శుద్ధి ఉన్న త‌క్కువ మందిలో ఉండ‌వ‌ల్లి ఒక‌ర‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. విభ‌జ‌నతో ఏపీకి జ‌రిగిన న‌ష్టం మీద ప‌ది నిమిషాలు మాట్లాడ‌మంటే.. ఏపీలో చాలామంది నేత‌లు మాట్లాడ‌లేరు. కానీ.. ఉండ‌వ‌ల్లికి ఆ అవ‌కాశం ఇస్తే.. గంట పాటు నాన్ స్టాప్ గా మాట్లాడే స‌త్తాతో పాటు.. అవును.. విభ‌జ‌న‌తో ఏపీకి చాలా అన్యాయం జ‌రిగింద‌న్న స‌మ‌ర్ధింపు మాట‌ను అనిపించే స‌త్తా ఉన్నోడిగా చెప్పాలి.

ఒక‌ప్పుడు దివంగ‌త నేత వైఎస్ రాజశేఖ‌ర్ రెడ్డికి ఎంతో స‌న్నిహితంగా ఉన్న ఉండ‌వ‌ల్లి.. ఆయ‌న మ‌ర‌ణం త‌ర్వాత ఆయ‌న కుమారుడు జ‌గ‌న్ తో క‌లిసి రాజ‌కీయ ప్ర‌యాణాన్ని చేసేందుకు మ‌క్కువ ప్ర‌ద‌ర్శించ‌లేదు. అదే స‌మ‌యంలో విభ‌జ‌న నిర్ణ‌యం తీసుకున్న కాంగ్రెస్ తోనూ ఆయ‌న ఉండ‌లేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ఆయ‌న‌.. విభ‌జ‌న కార‌ణంగా ఏపీకి జ‌రిగిన‌ అన్యాయం.. ఏపీకి ప్ర‌త్యేక హోదాతో క‌లిగే ప్ర‌యోజ‌నం గురించి త‌న వాద‌న‌ను వినిపిస్తూ ఉంటారు.

తాజాగా జ‌గ‌న్ బ‌లం ఎంత‌?  జ‌గ‌న్ స‌భ‌ల‌కు జ‌నం రావ‌టం వెనుక కార‌ణం ఏమిటి?  హోదా అంశాల‌పై ఆయ‌న ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ అంతా టీడీపీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మ‌ధ్యే ఉంటుంద‌ని ఉండ‌వ‌ల్లి తేల్చిచెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌భ‌ల‌కు జ‌నం రావ‌టం వెనుక కార‌ణం వేర‌ని.. సినిమాన‌టుడ్ని చూసేందుకు వ‌చ్చిన‌ట్లుగా జ‌నం వ‌స్తున్నార‌న్నారు. అయితే.. జ‌గ‌న్ కు ఓట్లు రావ‌ని తేల్చి చెప్పారు.

ఎన్నిక‌ల నాటికి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పోల్ మేనేజ్ మెంట్.. రాజ‌కీయ వ్యూహాలకు జ‌గ‌న్ త‌ట్టుకోలేర‌ని ఉండ‌వ‌ల్లి స్ప‌ష్టం చేశారు. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ జ‌గ‌న్ గెలుస్తార‌ని ప్ర‌చారం చేశార‌ని.. కానీ జ‌రిగిన ప్ర‌చారానికి భిన్నంగా లెక్క‌లు తేలి.. టీడీపీ అధిక్య‌త సంపాదించుకోవ‌టాన్ని గుర్తు చేశారు. జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ గురించి అప్పుడే చెప్ప‌టం క‌ష్ట‌మ‌న్న ఆయ‌న‌.. 2014లో ఏపీలో కాంగ్రెస్ ప‌రిస్థితి ఎలా ఉందో తాజాగా బీజేపీ ప‌రిస్థితి అదే తీరులో ఉంద‌న్నారు.

ప్ర‌త్యేక హోదా అంశం భావోద్వేగ అంశంగా మారి.. రాజ‌కీయాల‌ను నిర్దేశిస్తుంద‌న్నారు. ఈశాన్య రాష్ట్రాల‌కు ప్ర‌త్యేక హోదాతో ప్ర‌యోజ‌నం పెద్ద‌గా ఉండ‌క‌పోవ‌చ్చు కానీ.. ఏపీకి మాత్రం హోదాతో పారిశ్రామిక ప్రోత్సాహ‌కాలు ల‌భించ‌టం ఖాయ‌మ‌న్నారు. ఏపీ ప్ర‌యోజ‌నాల‌కు హోదా దోహ‌దం చేస్తుంద‌న్నారు. తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీకి కాంగ్రెస్ క‌ట్టుబ‌డి ఉంద‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌స్తే ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌టం ఖాయ‌మ‌న్నారు.  తాను ఏ పార్టీలోనూ లేన‌ని.. అలా అని రాజ‌కీయాల్లో లేన‌ని ఎవ‌రైనా ప్ర‌చారం చేస్తే వారికి బుద్ధి లేద‌న్నారు. తాను రాజ‌కీయాలకు దూరంగా ఉన్నాన‌ని ఎవ‌డైనా అంటే..మెంట‌ల్ గా తేడా ఉన్న‌ట్లేన‌ని వ్యాఖ్యానించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు