కారు.. పెళ్లాలు.. ప‌వ‌న్ కు జ‌న‌సేన కౌంట‌ర్‌

కారు.. పెళ్లాలు.. ప‌వ‌న్ కు జ‌న‌సేన కౌంట‌ర్‌

ఊహించ‌ని రీతిలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పై వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌కు దిగిన ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌పై ఆ పార్టీ స్పందించింది. జ‌న‌సేన ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మాదాసు గంగాధ‌రం మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ వ్యాఖ్య‌ల్ని ఆయ‌న తీవ్రంగా ఖండించారు.

ప‌వ‌న్ పై జ‌గ‌న్ చేసిన వ్య‌క్తిగ‌త వ్యాఖ్య‌లు ఏ మాత్రం హుందాగా లేవ‌న్న ఆయ‌న‌.. వ్య‌క్తిగ‌తం.. కుటుంబం గురించి మాట్లాడ‌టం మంచిది కాద‌న్నారు. రాజ‌కీయాల్లో సంస్కారం ఉండాల‌ని.. అది చాలా ముఖ్య‌మన్నారు. సంకుచిత ధోర‌ణిలో మాట్లాడే ప్ర‌తిప‌క్ష నేత మ‌న‌కు ఉండ‌టం బాధాక‌ర‌మ‌న్న ఆయ‌న‌.. త‌మ అధినేత ప‌వ‌న్ ఎప్పుడూ వ్య‌క్తిగ‌తంగా విమ‌ర్శించ‌ర‌న్నారు.

ఎవ‌రిపైనా వ్య‌క్తిగ‌తంగా విమ‌ర్శించ‌కూడ‌ద‌ని జ‌న‌సేన సిద్ధాంతంలో ఉంద‌న్న ఆయ‌న‌.. త‌మ అధినేత జ‌న‌సైనికులంద‌రికి ఆద‌ర్శంగా ఉంటార‌న్నారు. ప‌వ‌న్ త‌న జ‌న‌సైనికుల‌ను సంస్కారంగా ఉండటం నేర్పించార‌ని.. విధాన‌ప‌ర‌మైన త‌ప్పిదాలు ఉంటే ఎత్తి చూపిస్తామే త‌ప్పించి.. ఎవ‌రిని విమ‌ర్శించ‌మ‌న్నారు.

ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ పై విమ‌ర్శ‌లు సంధించారు. జ‌గ‌న్ అప‌రిప‌క్వ‌త క‌లిగిన రాజ‌కీయ నేత‌గా అభివ‌ర్ణించ‌ట‌మేకాదు.. నేత‌కు ప‌రిప‌క్వ‌త రావాల‌న్నారు. అస‌హ‌నం త‌గ్గాల‌ని.. ఆయ‌న నోటినుంచి మంచి మాట‌లు రావాల‌ని దేవుడ్ని ప్రార్థిద్దామంటూ ముగించారు. మాదాసు మాట‌ల ప్ర‌కారం.. జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌పై ప‌వ‌న్ ఇప్ప‌ట్లో స్పందించేఅవ‌కాశం లేద‌న్న మాట వినిపిస్తుంది. త‌న‌కు.. త‌న కుటుంబ స‌భ్యుల‌కు సంబంధించిన విమ‌ర్శ‌ల‌పై వెంట‌నే స్పందించే ప‌వ‌న్.. తాజా ఉదంతంలో మాత్రం ఆచితూచి వ్య‌వ‌హ‌రించేలా ఉండ‌నున్నార‌ని.. అందుకే పార్టీ త‌ర‌ఫున మాట్లాడించార‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు