అయ్యో పాపం.. రాహుల్ గాంధీ

అయ్యో పాపం.. రాహుల్ గాంధీ

కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని వచ్చే ఎన్నికలకు ప్రధాని అభ్యర్థిగా ప్రకటించి రెండు రోజులు కూడా కాకముందే తూచ్ అనాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ పొత్తుల పరిశీలనలో ఉన్న పలు పార్టీలు రాహుల్ అభ్యర్థిత్వాన్ని ఏమాత్రం ఇష్టపడకపోవడంతో రాహుల్ ను త్యాగాలకు రెడీ చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే... యూపీఏ కూటమికి ఎక్కువ సీట్లు లభిస్తే, కూటమిలోని ఏ నేతనైనా ప్రధానిని చేసేందుకు సిద్ధమన్న సంకేతాలను కాంగ్రెస్ పంపింది. బీజేపీని ఎలాగైనా అడ్డుకోవాలన్న ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ ఈ త్యాగానికి సిద్ధమవుతోంద. మొన్న కర్ణాటక ఎన్నికల్లోనూ ఇలాగే తమకంటే తక్కువ సీట్లొచ్చిన జేడీఎస్ కు సీఎం పదవి ఇచ్చి ప్రభుత్వాన్నిఏర్పరిచి బీజేపీని అడ్డుకోగలిగింది. జాతీయ స్థాయిలోనూ అదే ఫార్ములా ట్రై చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.

2019లో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లభిస్తే, ప్రధాని పదవిని వదులుకుంటామని, విపక్షాల్లో బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేపథ్యం లేని ఎవరికైనా ఆ చాన్స్ ఇస్తామని కాంగ్రెస్ చెబుతోంది. బీఎస్పీ అధినేత్రి మాయావతి లేదా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీల్లో ఒకరివైపు ఆ పార్టీ మొగ్గు చూపవచ్చని తెలుస్తోంది. వీరిద్దరిలో మాయావతి ఆ పదవిని బలంగా కోరుకుంటున్నారు. ఇటీవల ఆమె పార్టీ నేతలు సంచలన వ్యాఖ్యలు చేశారు. విదేశీ మూలాలున్న రాహుల్ ప్రధాని అవడానికి తాము అంగీకరించబోమని.. మాయావతి ప్రధాని కావాలని అన్నారు. ఇక మమత కూడా ఫెడరల్ ప్రంట్ పేరుతో జాతీయ రాజకీయాలపై కన్నేస్తున్నారు. ఎన్నికల తరువాత లెక్కల ప్రకారం ఆమె కూడా ప్రధాని రేసులో నిలిచే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో.... వారిని దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్ ఈ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇటీవలి అవిశ్వాస తీర్మానం సమయంలో ఎన్డీయేకు 300కు పైగా సభ్యుల మద్దతు రావడంతోనే కాంగ్రెస్ వైఖరిలో ఈ మార్పు వచ్చిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వాస్తవానికి నరేంద్ర మోదీ సర్కారుకు వ్యతిరేకంగా విపక్షాలను ఏక తాటిపైకి తెచ్చేందుకు రాహుల్ ఎంతగా ప్రయత్నిస్తున్నా సఫలం కావడం లేదు. వివిధ ప్రాంతీయ పార్టీలు భిన్నాభిప్రాయాలతో ఉండటమే ఇందుకు కారణం. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి ఎదురొడ్డి నిలవాలంటే, సాధ్యమైనన్ని ఎక్కువ ప్రాంతీయ పార్టీలను కలుపుకు పోతేనే సాధ్యమవుతుందని సోనియా గాంధీ సైతం నమ్ముతూ రాహుల్‌ను త్యాగానికి రెడీ చేస్తున్నట్లు సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు