అమెరికా- మనోళ్లు..21 మందికి జైలు

అమెరికా-  మనోళ్లు..21 మందికి జైలు

అగ్ర‌రాజ్యం అమెరికాకు చెందిన వారిని మోసం చేసిన కేసులో సంచ‌ల‌న తీర్పు వెలువ‌డింది. అమెరికా ఈ చ‌ర్య‌ను క‌ఠిన నేర‌ల‌పై ఉక్కుపాదంగా పేర్కొంటుండ‌గా...కొంద‌రు భార‌తీయులు త‌మ దేశానికి జ‌రిగిన అవ‌మానంగా భావిస్తున్నారు. భారత్ నుంచి జరిగిన ఓ భారీ కాల్‌సెంటర్ కుంభకోణంలో అమెరికాలోని 21 మంది భారత సంతతికి చెందిన వారికి 20 ఏళ్ల‌ వరకు జైలు శిక్ష పడింది.

కోర్టుకు సమర్పించిన ప్రాసిక్యూషన్ కథనం ఇలా సాగింది..భారత్‌కు చెందిన కొన్ని నకిలీ కాల్‌సెంటర్లు వృద్ధులైన అమెరికన్లను, చట్టబద్ధంగా పౌరసత్వం పొందిన వారిని లక్ష్యంగా చేసుకొని మోసాలకు పాల్పడ్డాయి. అహ్మదాబాద్‌కు చెందిన కొన్ని నకిలీ కాల్‌సెంటర్ల నుంచి కొందరు తాము అమెరికన్ రెవెన్యూ అధికారులు లేదా ఇమ్మిగ్రేషన్ అధికారులమని పేర్కొంటూ అమెరికాలోని వృద్ధులకు లేదా చట్టబద్ధంగా పౌరసత్వం పొందిన వారికి ఫోన్లు చేసేవారు.

డాటా బ్రోకర్లు, ఇతర వనరుల నుంచి వారికి సంబంధించిన సమాచారాన్ని ముందుగానే సేకరించేవారు. మీరు ప్రభుత్వానికి భారీ మొత్తంలో డబ్బు బాకీ ఉన్నారని, అది చెల్లించకపోతే జైలు పాలవుతారని బెదిరించేవారు. చెల్లించాల్సిన మొత్తంలో కొంతైనా కడితే శిక్ష తప్పుతుందని చెప్పేవారు. దీంతో సదరు బాధితులు డబ్బు చెల్లించడానికి అంగీకరించగానే, అది ఏ విధంగా చెల్లించాలో సూచించేవారు. అలా డబ్బు చెల్లింపు జరుగగానే ఈ కాల్‌సెంటర్లు అమెరికాలోని అక్రమ నగదు లావాదేవీలు జరిపేవారిని ఆశ్రయించేవి. ఆ డబ్బును వివిధ రూపాల్లో భారత్‌కు పంపే విధంగా వారితో ఒప్పందాలు చేసుకొనేవి.

ఇలా సాగిన కుంభకోణంలో వేల సంఖ్యలో అమెరికన్ పౌరులను మోసం చేసిన నేరగాళ్లు వారి నుంచి కొన్ని వందల కోట్ల డాలర్లను కొల్లగొట్టారు. ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చిన త‌ర్వాత అమెరికాకు చెందిన ద‌ర్యాప్తు సంస్థ‌లు రంగంలోకి దిగి శ‌ర‌వేగంగా విచార‌ణ జ‌రిపాయి. ఈ కేసులో దోషులుగా ఖరారైన 21 మందికి కోర్టు వారి నేరాలను బట్టి నాలుగు నుంచి 20 ఏళ్ల‌ వరకు జైలుశిక్ష విధించింది.ఈ కేసులో భారత్‌కు చెందిన 32 మంది కుట్రదారులను, ఐదు కాల్‌సెంటర్లను కూడా దోషులుగా తేల్చారు. వీరిని ఇంకా కోర్టు ముందు హాజరుపరుచాల్సి ఉంది.

శిక్ష పూర్తయిన తర్వాత వీరిలో పలువురిని భారత్‌కు తిరిగి పంపుతామని అమెరికా అటార్నీ జనరల్ జెఫ్ సెషన్స్ చెప్పారు. భారీ మోసాలను అరికట్టే విషయంలో ఇది తమకు భారీ విజయమని వ్యాఖ్యానించారు. ని తెలిపారు. ఈ మోసాలు 2012 నుంచి 2016 మధ్య జరిగినట్టు ప్రాసిక్యూషన్ పేర్కొంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు