బీజేపీ నేత‌ల వ‌ద్ద ప‌వ‌న్ ట్విట్ట‌ర్ పాస్‌వ‌ర్డ్‌

బీజేపీ నేత‌ల వ‌ద్ద ప‌వ‌న్ ట్విట్ట‌ర్ పాస్‌వ‌ర్డ్‌

ఏపీ ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలో పెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ విష‌యంఓ అధికార పార్టీ త‌న కౌంట‌ర్‌ను మొద‌లుపెట్టింది. గ‌తంలో తాను స‌మ‌ర్థించిన అంశాల‌ను ప్ర‌స్తుతం వ్య‌తిరేకిస్తున్న నేప‌థ్యంలో అస‌లు ప‌వ‌న్ ప‌యనం ఎటు సాగుతోంద‌నే అనుమానం వ్య‌క్తం చేస్తోంది. ఈ క్ర‌మంలో తాజాగా సంచ‌ల‌న విమ‌ర్శ చేసింది. అస‌లు ప‌వ‌న్ తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవాల‌ని ప్ర‌శ్నించింది.

టీడీపీకి చెందిన శాసనమండలి సభ్యులు అన్నం సతీష్‌ ప్రభాకర్ ఈ మేర‌కు ప‌వ‌న్ అమ‌రావ‌తి ప‌ర్య‌ట‌న‌పై స్పందించారు. ప్రశ్నించటానికే రాజకీయాల్లోకి వచ్చానంటున్న  ఎవర్ని ప్రశ్నించాలో కూడా తేల్చుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. పోరాటం చేస్తా, నిలదీస్తా, అడిగేస్తా, కడిగేస్తా అని ప్రసంగిస్తున్న పవన్‌ కల్యాణ్‌ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు. రాజధాని కోసం 33వేల ఎకరాల భూములను రైతులు త్యాగం చేస్తే.. బలవంతంగా లాక్కుంటున్నారంటూ వారి మనసుల్లో విషం నింపే ప్రయత్నం చేయటం సిగ్గుచేటు అంటూ మండిప‌డ్డారు. బీజేపీ, వైసీపీ మాటలు పవన్‌ నోటి వెంట వస్తున్నాయనటానికి ఇదే నిదర్శనమ‌న్నారు.

మన రాష్ట్ర రాజధాని నిర్మాణానికి మా భూములివ్వటం గర్వంగా ఉందని రైతులు చెప్పిన విషయం పవన్‌ కల్యాణ్‌ తెలుసుకోవాలని కోరారు. ``రాజధానికి వేల ఎకరాల భూములు అవసరమా అని ప్రశ్నించే పవన్‌ కల్యాణ్‌కు గుజరాత్‌లోని డొలేరా నగర నిర్మాణానికి సేకరించిన లక్ష ఎకరాల భూములు కనిపించటం లేదా? సింగూరు, బ‌షీర్‌భాగ్‌ కాల్పుల ఘటనల పేరుతో రాజధాని రైతుల్లో విధ్వేషాలు నింపటం పవన్‌ కల్యాణ్‌కు మంచిది కాదు. రైతుల పేరుతో బీజేపీ ఆడుతున్న కుట్రలో పవన్‌ కల్యాణ్‌ పావుగా మారుతున్నారు. ఇదంతా ఆపరేషన్‌ గరుడలో భాగమని పవన్‌ వైఖరితో స్పష్టమవుతోంది.`` అని స్ప‌ష్టం చేశారు. అవిశ్వాసానికి మద్దతు కూడగడతా అన్న వ్యక్తి పార్లమెంట్‌ సమావేశాల్లో టీడీపీ అవిశ్వాస తీర్మానం ఇచ్చి కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడుతుంటే.. ట్విట్టర్‌లో ట్వీట్లు చేసుకుంటూ కూర్చున్నారని ఎద్దేవా చేశారు. ``ట్విట్టర్‌లో మద్దతు కూడగట్టారా.? ట్విట్టర్‌లో ప్రశ్నించినంత మాత్రాన ఏం సాధించలేమన్న జ్ఞానం పవన్‌కు లేదు. పార్లమెంటులో తెలుగు ఎంపీలు చేస్తున్న పోరాటానికి మద్దతిచ్చే దమ్ముగానీ, పార్లమెంటులో ఎంపీల తెగువను మెచ్చుకునే ధైర్యంకానీ మీకు ఉన్నాయా.? ముందుగా పవన్‌ కల్యాణ్‌ బీజేపీ సృష్టించిన మాయా ప్రపంచం నుంచి బయటకు రావాలి. బీజేపీ మాయలో పడి లోకం మొత్తం తప్పుగా కనిపిస్తోంది. పవన్‌ కల్యాణ్‌ ట్విట్టర్‌ అకౌంట్‌ పాస్‌వర్డ్‌ బీజేపీ నేతల చేతుల్లో ఉన్న విషయం నిజం కాదా? వారే పవన్‌ కల్యాణ్‌ ట్విట్టర్‌ అకౌంట్‌ నుంచి ట్వీట్లు చేస్తున్న విషయం నిజం కాదా.?`` అని సంచ‌న‌ల విమ‌ర్శ చేశారు.

ప్రతి విషయంపై ట్విట్టర్‌ ద్వారా స్పందించే పవన్‌.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేస్తున్న అన్యాయంపై, మోడీ నిరంకుశత్వంపై ఎందుకు ప్రశ్నించటం లేదని ప‌వ‌న్ సూటిగా ప్ర‌శ్నించారు. మోడీ పేరు చెబితే పవన్‌ ట్విట్టర్‌ పిట్ట నోరు మూతబడుతోందా అని ఎద్దేవా చేశారు. పవన్‌ బీజేపీ పంజరంలో చిక్కుకున్న ట్విట్టర్‌ పిట్టలా మారారని, ఇప్పటికైనా కమల జెండా వదిలి తెలుగువాడిగా ఆలోచించటం మొదలుపెట్టాల‌ని కోరారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు