టీడీపీ అవిశ్వాసం..కేటీఆర్ అప్‌సెట్‌

టీడీపీ అవిశ్వాసం..కేటీఆర్ అప్‌సెట్‌

ఔను. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ సార‌థ్యంలోని కేంద్ర ప్ర‌భుత్వంపై తెలుగుదేశం పార్టీ అవిశ్వాసం ప్ర‌వేవ‌పెట్టిన సంగ‌తి తెలిసిందే. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు లోక్‌సభలో హోరాహోరీగా సాగిన చర్చ అనంతరం నిర్వహించిన ఓటింగ్‌లో అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 126 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 325 ఓట్లు వచ్చాయి. దీంతో అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్టు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. అయితే, అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా పార్లమెంట్‌లో జరిగిన సీన్ అందరినీ ఆశ్చర్యపరిచింది.తన ప్రసంగాన్ని ముగించి నేరుగా ప్రధాని దగ్గరకు వెళ్లి ఆయనను కౌగిలించుకోవడం... ఆ తర్వాత తన సీట్లో కూర్చొని పక్కనే ఉన్న ఎంపీకి కన్నుగీటడంపై సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరుగుతోంది. అయితే దీనిపై తెలంగాణ మంత్రి, సీఎం కేసీఆర్ త‌న‌యుడు కేటీఆర్ అప్‌సెట్ అయ్యారు. మోడీ అవిశ్వాసం ఎపిసోడ్‌, పార్ల‌మెంటులో ప‌రిణామాల‌పై కేటీఆర్ అప్‌సెట్ అవ‌డం ఎందుకు అనుకుంటున్నారా? అదే ట్విస్ట్‌!

అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా లోక్‌సభలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మోడీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో వాగ్బాణాలను సంధించిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్.. తన ప్రసంగం పూర్తయిన తర్వాత నేరుగా మోడీ దగ్గరికి వెళ్లి ఆయనను ఆలింగనం చేసుకున్నారు. రాహుల్ చర్యతో సభలోని వారే కాదు ప్రత్యక్ష ప్రసారం చూస్తున్న వారూ ఆశ్చర్యపోయారు. ఈ హఠాత్పరిణామంతో మోదీ కూడా ఆశ్చర్యపోయారు. కొద్దిసేపటి తర్వాత తేరుకున్న ప్రధాని.. తిరిగి వెళ్లిపోతున్న రాహుల్‌ను వెనక్కి పిలిచి కరచాలనం చేసి భుజం తట్టారు. తర్వాత తన స్థానంలోకి వెళ్లి కూర్చున్న రాహుల్‌ను సహచర సభ్యులు ఏదో అడగటంతో ఆయన నవ్వుతూ కన్నుకొడుతూ కనిపించారు. మోడీతో రాహుల్ ఆలింగనం, తర్వాత కన్ను కొడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ ప‌రిణామంపైనే కేటీఆర్ స్పందించారు. `నేను ఆ మేజర్ డ్రామాను లైవ్‌గా చూడడం మిస్ అయ్యా... కౌగిలింతలు, కన్నుగొట్టడం, వాక్చాతుర్యం మొదలైనవి చూడ‌లేక‌పోయా` అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

కాగా, రాహుల్‌గాంధీ తన వద్దకు వచ్చి ఆలింగనం చేసుకోవడాన్ని పరోక్షంగా ప్రస్తావించిన మోడీ దానిపై సెటైర్లు వేసిన సంగ‌తి తెలిసిందే.`` అవిశ్వాసంపై సీరియస్‌గా చర్చ సాగుతుంటే, ఓ సభ్యుడు నావద్దకు వచ్చి.. ఉఠో ఉఠో (లేవండి లేవండి) అన్నారు. నాకు మొదట అర్థంకాలేదు. నన్ను కుర్చీలోంచి లేపాలన్నది ఆయన ఉద్దేశం కావొచ్చు. దేశ ప్రజలు 2019లోనూ మమ్మల్ని ఇలాగే కుర్చీలో కూర్చోబెడతారు`` అని మోడీ చెప్పారు. ఆలింగనం తర్వాత రాహుల్ కన్నుకొట్టడాన్ని కూడా మోడీ వదలిపెట్టలేదు. ఆ క‌ళ్లు ఏం చేశాయో ఈరోజు దేశ ప్రజలంతా చూశారు అంటూ మోడీ తన చేతులు, కళ్లను ఆడిస్తూ చెప్పారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు