ప్ర‌భుత్వంలో క‌ల‌క‌లం...సింగ‌పూర్ అధ్య‌క్షుడి వివ‌రాలు హ్యాక్‌

ప్ర‌భుత్వంలో క‌ల‌క‌లం...సింగ‌పూర్ అధ్య‌క్షుడి వివ‌రాలు హ్యాక్‌

సింగపూర్ ప్ర‌భుత్వంలో అల‌జ‌డి నెల‌కొంది. హ్యాకర్లు రెచ్చిపోయి ఒక‌టి కాదు రెండు కాదు 15 ల‌క్ష‌లమంది వివ‌రాలను హ్యాక్ చేశారు. ఈ వివ‌రాల‌న్నీ ఆరోగ్యసంబంధ‌మైన‌వి కాగా... అత్యంత ఆస‌క్తిక‌ర‌మైన అంశం..అందులో సింగపూర్ ప్రధాని లీకి చెందిన వ్య‌క్తిగ‌త అంశాలు కూడా ఉండ‌టం. ఈ ప‌రిణామంతో సింగ‌పూర్ ప్ర‌భుత్వం అల‌జ‌డి మొద‌లైంది. సింగపూర్ అధికారిక ఆరోగ్యసంస్థ అయిన సింగ్‌హెల్త్ సిస్టంలోకి చొరబడిన హ్యాకర్లు.. 1 మే 2015 నుంచి 4 జూలై 2018 వరకున్న అవుట్ పేషెంట్ల ప్రిస్కిప్షన్లుసహా పలువురి ఆరోగ్య నివేదికలను దొంగిలించినట్టు సింగపూర్ అధికారులు గుర్తించారు.  మొత్తం 15 లక్షల మందికి చెందిన డాటాను సైబర్ హ్యాకర్లు దొంగిలించినట్టు ప్రభుత్వం పేర్కొన్నది. ఇది సాధారణ హ్యాకర్ల పని కాదని, ఉద్దేశపూర్వకంగా ఏదో ఒక లక్ష్యం పెట్టుకుని ప్రణాళికతో హ్యాక్ చేసినట్టుగా సింగపూర్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ (సీఎస్‌ఏ), ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్‌మేషన్ సిస్టం (ఐహెచ్‌ఐఎస్) అనుమానిస్తున్నాయి.

ప్ర‌ధాన‌మంత్రి సహా అక్కడి ప్రజలకు చెందిన ఆరోగ్య నివేదికలను హ్యాక్ చేసిన ఉందతం ఈ ఏడాది జూన్ 27 నుంచి జూలై 4 వ తేదీల మధ్య జరిగి ఉంటుందని భావిస్తున్నామని అధికారులు తెలిపారు. హ్యాకర్లు ఏ ఒక్క నివేదికను తొలగించడంగానీ, మార్చడంగానీ చేయలేదని సింగపూర్ ఆరోగ్య, సమాచారమంత్రిత్వశాఖలు సంయుక్తప్రకటనలో తెలిపాయి. ప్రధాని లీ ఆరోగ్యానికి సంబంధించిన డాటాపైనే హ్యాకర్లు దృష్టిపెట్టినట్టు వారి తీరు స్పష్టం చేస్తున్నదని ప్రభుత్వం పేర్కొంది. హ్యాకింగ్‌కు గురవడంతో సేవలు అందించడంలో ఆలస్యం జరుగడం పట్ల అక్కడి ఆరోగ్యశాఖ మంత్రి గాన్ కిమ్ యాంగ్ ప్రజలను క్షమాపణలు కోరారు. హ్యాకింగ్‌కు గురైన డాటాలో పేషెంట్ పేరుతోపాటు నేషనల్ రిజిస్ట్రేషన్ ఐడీ కార్డ్ సంఖ్య, చిరునామా ఉన్నాయి. సింగ్‌హెల్త్ ఐటీ డాటా హ్యాకింగ్‌కు గురైన విషయాన్ని తొలుత ఈ నెల 4 వ తేదీన అధికారులు గుర్తించగా.. వారం రోజుల తర్వాత సింగపూర్ ఆరోగ్యమంత్రిత్వశాఖ ధృవీకరించింది. కాగా, ఈ నెల 12 న సింగ్‌హెల్త్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూలై 4 తర్వాత మళ్లీ హ్యాకింగ్ జరుగలేదని, ఆరోగ్యసేవలు అందించడంలో ఎలాంటి సమస్య ఉత్పన్నం కాలేదని ఉన్నతాధికారులు స్పష్టంచేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు