కొత్త వంద‌నోటు వ‌చ్చేందుకు రూ.100 కోట్ల ఖ‌ర్చు

కొత్త వంద‌నోటు వ‌చ్చేందుకు రూ.100 కోట్ల ఖ‌ర్చు

పెద్ద‌నోట్ల ర‌ద్దు అనంత‌రం కొత్త నోట్లు పెద్ద ఎత్తున వ‌చ్చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పటికే చాలా కొత్త నోట్లు తీసుకొచ్చిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఇప్పుడు కొత్త వంద రూపాయల నోటు తీసుకొస్తోంది. మహాత్మాగాంధీ సిరీస్ లోనే వస్తున్న ఈ నోటు లావెండర్ కలర్ లో ఉంది. గుజరాత్ లోని పురాతన కట్టమైన రాణి కి వావ్.. అనే మెట్లబావి ఫొటోను నోటుపై ముద్రించారు. 66 మిల్లీమీటర్ల ఎత్తు, 142 మిల్లీ మీటర్ల పొడవుతో ఈ నోటును తీసుకొస్తున్నారు. అయితే.. కొత్త నోట్లు చలామణిలోకి వచ్చిన తర్వాత కూడా పాత నోట్లు చలామణిలో ఉంటాయని ఆర్‌బీఐ వెల్లడించింది. అయితే, ఏటీఎంల నుంచి కొత్తగా ప్రవేశపెట్టబోతున్న రూ. 100 నోటు రావాలంటే మొత్తం రూ. 100 కోట వ్యయం అవుతుందని ఎఫ్‌ఎస్‌ఎస్ అధ్యక్షుడు బాలసుబ్రమణియన్ తెలిపారు. దేశంలో ఉన్న 2.4 లక్షల ఏటీఎంలను కొత్త నోట్లకు అనుగుణంగా రీకాలిబ్రేట్ చేయాలంటే వంద కోట్ల పెట్టుబడి అవసరమవుతుందని ఆయన తెలిపారు.

కొత్త నోటు ముద్ర‌ణ‌, వాటిని ఏటీఎంలో అమ‌ర్చ‌డం గురించి తాజాగా బాలసుబ్రమణియన్ మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు పంచుకున్నారు.  రూ. 200 నోటుకు అనుగుణంగా ఏటీఎంలను రీకాలిబ్రేషన్ పూర్తవుతున్న దశలో తాజాగా మరో కొత్త నోటు రావడం పెద్ద తలనొప్పే అని ఆయన అన్నారు. పాత, కొత్త వంద రూపాయల నోట్లు రెండూ ఏటీఎంల నుంచి రావాలనుకుంటే మరింత భారం పెరుగుతుందని ఆయన తెలిపారు. కాగా, కొత్త వంద రూపాయల నోటుకు తగ్గట్టుగా ఏటీఎంలు రీకాలిబ్రేట్ చేయాలంటే రూ. 100 కోట్లతో వ్యయంతో పాటు ఏడాది కాలం పడుతుందని హిటాచీ పేమెంట్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ లోనీ అంటోనీ తెలిపారు. కొత్తగా ప్రవేశపెట్టిన రూ. 200 నోటు రీకాలిబ్రేషన్ ఇంకా పూర్తికాలేదనీ, కొత్తగా మళ్లీ వంద నోటుకు రీకాలిబ్రేట్ చేయాలంటే పకడ్బందీ ప్రణాళిక లేకపోతే చాలా కాలం పడుతుందని ఆయన చెప్పారు. పెద్దనోట్ల రద్దు తర్వాత కొత్త నోట్లకు అనుగుణంగా రీకాలిబ్రేషన్లతో ఇప్పటికే ఇబ్బందుల్లో వున్న ఏటీఎం పరిశ్రమపై మరింత భారం పడుతుందని యూరోనెట్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ హిమాన్షు పూజారా తెలిపారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English