షాకింగ్ నిర్ణ‌యం తీసుకున్న వాట్సాప్‌ ?

షాకింగ్ నిర్ణ‌యం తీసుకున్న వాట్సాప్‌ ?

స‌మాచారాన్ని ఒక‌రి నుంచి మ‌రొక‌రికి చేరవేసే విష‌యంలో.. గ‌తంలో మ‌రెప్పుడూ లేనంత వేగంగా ఫార్వ‌ర్డ్ చేసిన ఘ‌న‌త వాట్సాప్ సొంతం. ఈ సందేశ మాధ్య‌మం అందుబాటులోకి వ‌చ్చి.. ఆద‌ర‌ణ చెందిన త‌ర్వాత‌.. చేతికి వ‌చ్చిన స‌మాచారాన్ని జ‌స్ట్ సెక‌న్ల వ్య‌వ‌ధిలో వంద‌ల మందికి పంపే వెసులుబాటు క‌లుగుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే.. ఇదంతా మంచికి సంబంధించిన కోణం. దీనికే మ‌రో నెగిటివ్ కోణం లేక‌పోలేదు.

వాట్సాప్ సందేశాల కార‌ణంగా బోలెడ‌న్ని త‌ప్పుడు వార్త‌లు స‌ర్క్యులేట్ అవుతున్నాయి. చేతికి అందిన స‌మాచారం నిజ‌మా?  కాదా?  అన్న విష‌యాన్ని క్రాస్ చెక్ చేసుకోకుండా.. తెలిసింది తెలిసిన‌ట్లుగా.. మ‌రికొంద‌రు మ‌రికాస్త మ‌సాల ద‌ట్టించి మ‌రీ జ‌నాల మీద‌కు వ‌దులుతున్న వైనం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

వాట్సాప్ లో వైర‌ల్ అవుతున్న త‌ప్పుడు వార్త‌ల కార‌ణంగా గ‌డిచిన రెండు నెల‌ల వ్య‌వ‌ధిలో దేశ వ్యాప్తంగా 20 మందికి పైగా అమాయ‌కులు మృతి చెందిన‌ట్లు అంచ‌నా. పిల్ల‌ల కిడ్నాప‌ర్లుగా భ్ర‌మించి అప‌రిచిత వ్య‌క్తుల్ని స్థానికులు కొట్టి చంపుతున్న వైనం తెలిసిందే. దీనిపై స్పందించిన కేంద్రం.. ఇందుకు సంబంధించి క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌ల్ని తీసుకోవాల‌ని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

 ఈ నేప‌థ్యంలో వాట్సాప్ క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌ల్ని చేప‌ట్టిన‌ట్లుగా చెబుతున్నారు. ఇక‌పై ఒకేసారి ఐదుగురికి మాత్ర‌మే స‌మాచారాన్ని షేర్ చేసే వీలుంద‌ని చెబుతున్నారు. సుల‌భంగా సందేశాన్ని ఫార్వ‌ర్డ్ చేసే సౌక‌ర్యానికి చెక్ పెడుతూ.. ఐదుగురికి మాత్ర‌మే షేర్ చేయొచ్చ‌ని.. షేర్ ఐకాన్ నుసైతం తొల‌గిస్తామ‌న్న మాట‌ను వాట్సాప్ వెల్ల‌డించింది.

వదంతుల నియంత్ర‌ణ‌లో భాగంగా శుక్ర‌వారం నుంచి మెసేజ్ ల‌ను ఫార్వ‌ర్డ్ చేసే విష‌యంలో ప‌రిమితిని విధిస్తున్న‌ట్లు పేర్కొంది. ఇక‌పై.. భార‌త్ లోని వినియోగ‌దారులంతా ఏక‌కాలంలో ఐదు చాట్ ల‌ను మాత్ర‌మే ఇత‌రుల‌కు ఫార్వ‌ర్డ్ చేయ‌గ‌లుగుతార‌ని పేర్కొంది. ఒక సందేశాన్ని ఒకేసారి ఎక్కువమందికి పంపే వీలున్న క్విక్ ఫార్వ‌ర్డ్ బ‌ట‌న్ ను సైతం తొల‌గిస్తున్న‌ట్లు వాట్సాప్ పేర్కొంది. వాట్సాప్ ను వినియోగించే వారికి తాజా నిర్ణ‌యం భారీ షాక్ కు గురి కావ‌టం ఖాయం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు