టీడీపీ గళం యథాతథంగా వినిపించిన యంగ్ ఎంపీ

టీడీపీ గళం యథాతథంగా వినిపించిన యంగ్ ఎంపీ

లోక్ సభలో అవిశ్వాన తీర్మానంపై చర్చలో తెలుగుదేశం సభ్యుడు కింజరాపు రామ్మోహననాయుడు తన ప్రసంగంతో సభ్యులను ఆకట్టుకున్నారు. హిందీలో అనర్గళంగా మాట్లాడిన ఆయన యావత్పార్టీల చూపును తనవైపు తిప్పుకోగలిగారు. మాట్లాడింది 12 నిమిషాలే అయినా కేంద్రం ఏపీకి చేసిన అన్యాయం, హామీల అమలు విషయంలో చెబుతున్న అబద్ధాలను ఆయన సోదాహరణంగా ఎండగట్టారు. హరిబాబు, రాజ్ నాథ్ సింగ్ తదితరులు సభలో చెప్పినవన్నీ అసత్యాలేననీ, మోడీ అయినా సరైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

    "విశాఖ రైల్వేజోన్ విషయంలో కేంద్రం మోసం చేసింది. విశాఖలో భూములు, పోర్టులు ఉన్నా రైల్వేజోన్ ఎందుకు ఇవ్వడం లేదు..?. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధాని రాజ్యసభలో అన్నారు. హోదా ప్రకటనకు జైట్లీ కూడా సమర్థించారు. హోదా ఐదేళ్లు కాదు.. పదేళ్లు కావాలని బీజేపీ డిమాండ్ చేసింది. నాటి ప్రకటనను ఇప్పటి ప్రభుత్వం కచ్చితంగా అమలు చేసి తీరాల్సిందే. హోదా వస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయి. ఏపీకి కేంద్రం ఇచ్చిన కొద్దిపాటి నిధుల గురించే చెబుతున్నారు.. ఇవ్వాల్సిన నిధులపై ఎందుకు మాట్లాడరు..? విభజన చట్టంపై హోం మంత్రి, ప్రధాని మంత్రి ఎప్పుడైనా సమీక్ష జరిపారా.? హామీల అమలుపై కేంద్రం అన్నీ అబద్ధాలే చెబుతున్నారు. హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పినవన్నీ అసత్యాలే. ఏపీకి ఇప్పటి వరకూ కేవలం 5శాతం మాత్రమే నిధులు ఇచ్చారు.. ఇలా కొసరుతూపోతే మరో ఇరవై ఏళ్లు పడుతుంది. ఓ ప్రధాని పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీని మరో ప్రధాని ఎందుకు అమలు చేయడం లేదు..?" అంటూ కేంద్రంపై వరుస ప్రశ్నల వర్షం కురిపించారు.

    ఒక్క మాటలో చెప్పాలంటే.. ఉత్తరాది ఎంపీలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో హిందీలో అనర్గళంగా మాట్లాడుతూ.. సీనియర్ పార్లమెంటేరియన్లకు ఏమాత్రం తీసిపోని రీతిలో ఎక్కడా తడబాటు లేకుండా సభ అటెన్షన్ సాధించి తాను చెప్పదలచుకున్నది సూటిగా చెప్పగలిగారు.

    విశాఖ - చెన్నై పారిశ్రామిక కారిడార్ కు కేంద్రం ఇప్పటికీ పైసా కూడా ఇవ్వలేదని, అయితే సభ సాక్షిగా బీజేపీ ఎంపీ హరిబాబు అసత్యాలు ప్రచారం చేశారని రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. టీడీపీకి 15 మంది ఎంపీలున్నారని, తమను తక్కువగా తీసుకోవద్దని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.  ప్రజాస్వామ్య ఆలయం పార్లమెంట్ అని, తమకు అన్యాయం జరిగింది ఈ సభలోనే కనుక, ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ అడుగుతామని ప్రశ్నించారు. ఏపీకి సంబంధించి ప్రధాని మోదీ విధానం ఏమిటో ఈరోజు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఇకపై చందమామ కథలు చెబితే కుదరని హెచ్చరించారు.