ఆంధ్రోళ్ల ఆక్రోశాన్ని తీర్చేశావ్.. అదిరిందిలే గ‌ల్లా..!

ఆంధ్రోళ్ల ఆక్రోశాన్ని తీర్చేశావ్.. అదిరిందిలే గ‌ల్లా..!

ఆంధ్రోళ్ల‌కు క‌ష్టాలు కొత్తేం కాదు. ఎప్ప‌టిక‌ప్పుడు స‌వాళ్లు విసిరే ప్ర‌కృతి. కొన్ని ద‌శాబ్దాల‌కు ఒక‌సారి రాజ‌కీయ భూకంపాల పుణ్య‌మా అని.. నేటికి రాజ‌ధాని న‌గ‌ర‌మంటూ లేని రాష్ట్రంగా ఏపీని చెప్పాలి. ఆంధ్రోడు మామూలోడు కాదురా.. సానా తెలివైపోళ్లురా? అన్న గొప్ప‌ల‌కు త‌క్కువ లేదు. కానీ.. వాక్ శుద్ధితో జ‌రిగిన అన్యాయం గురించి సూటిగా చెప్పి.. క‌డిగిపారేసే నాయ‌కుడు భూత‌ద్దం వేసినా దొర‌క‌ని ప‌రిస్థితి.

తెలంగాణ‌కు జ‌రిగిన అన్యాయం గురించి తెలంగాణ నేత‌లు చెప్పిన తీరులో.. ఏపీకి చెందిన ఒక్క నేతంటే ఒక్క‌డు కూడా లేడ‌న్న కొర‌త తీరిపోయిన‌ట్లే. ఆ మ‌ధ్య‌న మిస్ట‌ర్ ప్రైమ్ మినిస్ట‌ర్ అంటూ గాండ్రించినంత ప‌ని చేసి.. బీజేపీ నేత‌లు సైతం ఉలిక్కిప‌డేలా చేసిన గ‌ల్లా జ‌య‌దేవ్ వ్యాఖ్య‌లు అప్ప‌ట్లో సంచ‌ల‌నం సృష్టించాయి.

టీడీపీ ప్ర‌వేశ పెట్టిన అవివ్వాస తీర్మానాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవ‌టం ద్వారా.. ఏపీ అంశాల్ని తెర మీద‌కు తేవ‌టం ద్వారా.. జాతీయ అంశాలు ప‌క్క‌న ప‌డేలా చూడొచ్చ‌న్న వ్యూహంతోనేన‌న్న మాట‌లు వినిపించాయి. ఈ వ్యూహం ఎంత నిజ‌మ‌న్న‌ది ప‌క్క‌న పెడితే.. ఆంధ్రోళ్ల‌కు అవ‌కాశం ఇవ్వాలే కానీ ఏం చేస్తార‌న్న విష‌యాన్ని గ‌ల్లా జ‌య‌దేవ్ తాజా ప్ర‌సంగంలో తేల్చేశారు.
మోడీ స‌ర్కారుపై ఆయ‌న చేసిన ప్ర‌సంగంలో ఏపీకి ప్ర‌త్యేక హోదా ఎంత అవ‌స‌ర‌మ‌న్న విష‌యంతో పాటు.. నాలుగేళ్ల పాటు బీజేపీతో దోస్తీ కార‌ణంగా ఒరిగిందేమీ లేద‌న్న విష‌యాన్ని చెప్ప‌ట‌మే కాదు..న‌మ్మిన మిత్రుడ్ని మోస‌గించ‌టంలో మోడీ మ‌హా మొన‌గాడ‌న్న విష‌యాన్ని త‌న మాట‌ల‌తో చెప్పేశారు గ‌ల్లా.

ఏపీ అంశాల్నే గ‌ల్లా ప్ర‌స్తావించిన‌ప్ప‌టికీ.. అర నిమిషానికోసారి.. మోడీ పాల‌న‌లో.. మోడీ పాల‌న‌లో అంటూ ప్ర‌ధాని పేరును ప‌దే ప‌దే ప్ర‌స్తావించట‌మే కాదు.. ఆయ‌న పాల‌న‌లోని త‌ప్పుల్ని.. ఆయ‌న గ‌తంలో ఇచ్చిన హామీల్ని ఏ విధంగా మార్చిపోతున్నార‌న్న విష‌యంలో పాటు.. ఏపీ విష‌యంలో ఆయ‌న ప్ర‌ద‌ర్శించిన వివ‌క్ష‌ను తీవ్ర‌స్థాయిలో ఎండ‌గ‌ట్ట‌టం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించేలా చేసింది.

ఏపీకి ప్ర‌త్యేక హోదా హామీలు నెర‌వేర్చ‌క‌పోవ‌టం లాంటివి పాత విష‌యాల‌తో పాటు మ‌రికొన్ని మ‌సాలా విష‌యాల్ని ప్ర‌స్తావించటం ఆస‌క్తిక‌రంగా మారింది.  మాజీ మంత్రి గాలి జ‌నార్ద‌నరెడ్డి గురించి ప్ర‌స్తావిస్తూ.. నేను తిన‌ను.. తిన‌నివ్వ‌నంటూ మోడీ చెప్పార‌ని.. కానీ గాలితో పాటు ఏపీలోని ఏ1.. ఏ2ల‌ను ర‌క్షిస్తున్నారంటూ మోడీ ముఖం మీద‌నే అడిగేశారు.

మిమ్మ‌ల్ని ఎందుకు న‌మ్మాల‌ని.. ఏపీ ప్ర‌జ‌ల బాధ‌.. అసంతృప్తి.. ఆక్రోశంతో ఉన్నార‌న్నారు. ఇదే కాదు.. గుజ‌రాత్ లోని ఆహ్మాదాబాద్ కు స‌మీపంలో నిర్మిస్తున్న కొత్త న‌గ‌రం గురించి ప్ర‌స్తావించి.. మీకో న్యాయం.. మాకో న్యాయ‌మా? అంటూ అడిగేశారు. ఢిల్లీని త‌ల‌ద‌న్నే రాజ‌ధానిని నిర్మిస్తాన‌ని మోడీ హామీ ఇచ్చార‌ని.. రూ.1500 కోట్ల‌తో అది  సాధ్య‌మేనా? అంటూ మోడీ ముఖానే అడిగేశారు. త‌ర‌చూ మోడీ హ‌యాంలో అంటూ ఆయ‌న పేరును ప్ర‌స్తావించ‌టం.. మోడీ ప‌రోక్షంలో త‌ర‌చూ చేసే విమ‌ర్శ‌ల్ని.. ఆయ‌న ముందే.. అందునా భారీ బీజేపీ గ‌ణం ఎదుట అనేయ‌టం గ‌ల్లా జ‌య‌దేవ్‌కే చెల్లింద‌ని చెప్పాలి. ఏమైనా.. గ‌ల్లా ప్ర‌సంగం మొత్తం విన్న త‌ర్వాత‌.. ఆడు మ‌గ‌డ్రా బుజ్జి అన్న మాట‌ల్ని గ‌ల్లాకు అన్వ‌యించుకోవాల‌న్న భావ‌న కల‌గ‌టం ఖాయం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు