బిగ్ బాస్ కు కోర్ట్ సెంటిమెంట్!

బిగ్ బాస్ కు కోర్ట్ సెంటిమెంట్!

ప్ర‌ముఖ హేతువాది బాబు గోగినేనిపై గత నెలలో మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన సంగ‌తి తెలిసిందే. కొంత‌మంది వ్య‌క్తుల‌ ఆధార్ సమాచారాన్ని సేక‌రించిన గోగినేని ఆధార్ చట్టాన్ని ఉల్లంఘించార‌ని కేవీ నారాయణతో పాటు మరికొందరు ఫిర్యాదు చేశారు. దాంతోపాటు, హేతువాద ప్రచారం కోసం నిధులు దుర్వినియోగ‌పరుస్తున్నారని ఆరోపించారు.

దీంతో, బాబు గోగినేనిపై దేశద్రోహం, మతాలు, కులాలు, వర్గాల పేరిట ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొట్టడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం, మత విశ్వాసాలను అవమానించడం వంటి అభియోగాల‌పై కేసు న‌మోదు చేశారు. అయితే, ఆ కేసు దర్యాప్తులో తీవ్ర జాప్యం జరుగుతోందంటూ హైకోర్టులో ఓ పిటిష‌న్ దాఖ‌లైంది. దీంతో, ఈ నెల 25లోగా బాబు గోగినేనిపై పెట్టిన కేసుల పురోగ‌తిపై వివ‌ర‌ణ ఇవ్వాలంటూ కోర్టు ఆదేశించింది. దీంతో, బిగ్ బాస్ హౌస్ లో ఉన్న బాబు గోగినేనికి నోటీసులు జారీ చేసేందుకు మాదాపూర్ పోలీసులు సిద్ధ‌మ‌య్యారు.  

ముందుగా బిగ్ బాస్ నిర్వాహకులకు పోలీసులు నోటీసులు జారీ చేయ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ఆ త‌ర్వాత బాబు గోగినేనిని హౌస్ బయటకు తీసుకువ‌చ్చి విచార‌ణ చేప‌ట్టే యోచ‌న‌లో పోలీసులు ఉన్న‌ట్లు తెలుస్తోంది.  విచారణ పూర్తయిన తర్వాత బాబు గోగినేని య‌థాత‌ధంగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ల‌నున్న‌ట్లు తెలుస్తోంది. బాబు గోగినేని వ్య‌వ‌హారంతో....బిగ్ బాస్ హౌస్ కు ఓ కొత్త సెంటిమెంట్ వ‌చ్చిన‌ట్లయింది. వ‌రుస‌గా రెండో సీజ‌న్ లో కూడా బిగ్ బాస్ లో కోర్టు సీన్ రిపీట్ అయింది. ప్ర‌తి సీజ‌న్ లో ఎవ‌రో ఒక హౌజ్ మేట్ కోర్టుకు వెళ్తున్నారు.

 గ‌త ఏడాది, టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సినీ నటి ముమైత్ ఖాన్ ను సిట్ అధికారులు విచార‌ణ జ‌రిపిన సంగ‌తి తెలిసిందే. బిగ్ బాస్ నిర్వాహ‌కుడితోపాటు సిట్ విచార‌ణ‌కు హాజ‌ర‌య్యేందుకు ముమైత్...హౌస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చింది. విచార‌ణ అనంత‌రం మ‌ళ్లీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లింది. ఇపుడు అదే త‌ర‌హాలో బాబు గోగినేని కూడా విచార‌ణ నిమిత్తం హౌస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి....రెండు రోజుల త‌ర్వాత లోప‌ల‌కు వెళ్లే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఒక‌వేళ‌ బిగ్ బాస్ -3 నిర్వ‌హిస్తే....ఈ కోర్టు సెంటిమెంట్ బ్రేక్ కావాల‌ని ఆశిద్దాం!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు