ఈ దేశం..ఇప్పుడు యూదుల‌కు మాత్ర‌మే

ఈ దేశం..ఇప్పుడు యూదుల‌కు మాత్ర‌మే

ఇజ్రాయెల్ రాజధానిగా జెరుసలెంను గుర్తిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన పాలస్తీనియన్లు, ఇజ్రాయెలీల మధ్య చిచ్చు పెట్టిన సంగ‌తి గుర్తుండే ఉంటుంది. తూర్పు జెరుసలెం చాలా కాలంగా యూధులు, ముస్లిం, క్రిస్టియన్ సామాజిక వర్గాలకు పవిత్ర స్థలంగా ఉంది. అయితే ఈ విష‌యంలో చేసిన ప్ర‌క‌ట‌న ర‌చ్చ‌రచ్చ‌గా మారింది. దీనికి కొన‌సాగింపుగా...ఇజ్రాయిల్ తాజాగా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ఇజ్రాయెల్‌ను యూదుల దేశంగా గుర్తిస్తూ ఇజ్రాయెల్ పార్లమెంట్ గురువారం ఓ చారిత్రక బిల్లును ఆమోదించింది. రాత్రంతా ఈ బిల్లుపై చర్చ జరిపిన పార్లమెంట్.. గురువారం తెల్లవారుఝామున బిల్లును పాస్ చేసింది.పార్లమెంట్‌లో ఈ చట్టం 62-55తో ఆమోదం పొందింది. ఇద్దరు సభ్యులు ఓటింగ్‌కు హాజరు కాలేదు.

ఇజ్రాయెల్ యూదుల దేశం అనే బిల్లుపై బుధవారం రాత్రంతా వాడివేడి చర్చ జరిగింది. అనుకూలంగా, వ్యతిరేకంగా సభ్యుల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. గురువారం తెల్లవారుఝామున బిల్లును పాస్ చేసిన సంద‌ర్భంగా ప్రధాని బెంజమిన్ నేతన్యాహు మాట్లాడుతూ ఇజ్రాయెల్, జియోనిజం చరిత్రలో ఇదొక చరిత్రాత్మక సందర్భమని వెల్ల‌డించారు. కొత్తగా తాము చేసిందేమీ లేదని, ప్రస్తుతం ఇజ్రాయెల్ స్వభావాన్నే చట్టంగా చేసినట్లు వివ‌రించారు. ``ఇక్కడ ప్రతి పౌరుడి వ్యక్తిగత హక్కులను గౌరవిస్తాం. ఇది మన దేశం. యూదుల దేశం. మనల్ని అస్థిరపరిచే ప్రయత్నం కొందరు చేస్తున్నారు. మన ఉనికిని, మన హక్కులను అస్థిరపరచాలని చూస్తున్నారు. అందుకే ఇవాళ ఈ చట్టాన్ని చేశాం. ఇది మన దేశం. మన భాష. ఇది మన జాతీయ గీతం. ఇది మన జెండా. ఇజ్రాయెల్ వర్ధిల్లాలి`` అంటూ నేతన్యాహు ఉద్వేగభరిత ప్రసంగం చేశారు.

అయితే, ఇజ్రాయెల్ జనాభాలో 20 శాతం అరబ్బులే ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ఈ చట్టాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇది దేశంలో మైనార్టీలుగా ఉన్న అరబ్బుల అణచివేతకు దారితీస్తుందని వాళ్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. చర్చ సందర్భంగా అరబ్ జాయింట్ లిస్ట్ చీఫ్ ఆయ్‌మాన్ ఓదె నల్ల జెండాను ఊపారు. అరబ్బులు తమ దేశంలో ఉండకూడదని పరోక్షంగా ఈ చట్టం ద్వారా చెప్పినట్లయిందని ఆయన అభిప్రాయపడ్డారు. `ఇజ్రాయెల్ ఎప్పుడూ యూదులదే అని, ఇక్కడ మనం రెండో తరగతి పౌరులుగానే ఉండాల్సిందేనని చెప్పారు` అంటూ ఓదె మండిపడ్డారు. మాజీ ప్రధాని, నేతన్యాహు పార్టీ లికుడ్ వ్యవస్థాపకుడు మెనాచెమ్ బెగిన్ తనయుడు బెన్నీ బెగిన్ కూడా ఓటింగ్ దూరంగా ఉండటం గమనార్హం. లుకిడ్ పార్టీ నాయకత్వం నుంచి ఇలాంటి నిర్ణయాన్ని తాను ఆశించలేదని ఆయన అన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు