రేప‌టితో కేసీఆర్ థ‌ర్డ్ ఫ్రంట్‌కు స‌మాధి

రేప‌టితో కేసీఆర్ థ‌ర్డ్ ఫ్రంట్‌కు స‌మాధి

జాతీయ పార్టీలైన భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు కోసం దేశమంతా తిరిగిన తెలంగాణ ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆ ఆలోచనకు మంగళం పాడినట్లే కనిపిస్తోంది. దీనికి తాజా ఉదాహరణ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై తెలుగుదేశం పార్టీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వమని ప్రకటించడమే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సాటి తెలుగు రాష్ట్రం కష్టాల్లో ఉంటే... తమకు అన్యాయం జరిగిందంటూ వాపోతూంటే మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణ ఎటువంటి సాయం చేయడానికి ముందుకు రాకపోవడమే ఇందుకు తార్కాణం. ఆంధ్రప్రదే‌శ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కేంద్రంపై పెట్టిన అవిశ్వానికి మద్దతు ఇవ్వాలంటూ అందరికీ లేఖలు రాస్తూంటే పొరుగున్న తెలుగు రాష్ట్రం తెలంగాణ మాత్రం ఇందుకు ససేమిరా అంటూ ప్రకటించింది. అన్నదమ్ముల్లా విడిపోదాం... రెండు రాష్ట్రాలను అభివ్రద్ధి చేసుకుందాం అంటూ చెప్పిన కబుర్లు వట్టివేనని తెలంగాణ రాష్ట్ర సమితి చెప్పకనే చెప్పింది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తే హైదరాబాద్ లో ఉన్న పరిశ్రమలన్నీ విజయవాడకు తరలిపోతాయని, అందుకే తాము మద్దతు ఇవ్వమని ప్రకటించింది. ఈ ఒక్క ప్రకటనతో తెలంగాణ రాష్ట్ర సమితి ఎటువైపు ఉందో.... మూడో ఫ్రంట్ ఎవరి కోసం ఏర్పాటు చేయాలనుకుంటున్నారో తేటతెల్లమైంది.

 తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు కాళ్లలో బలపం కట్టుకుని పశ్చిమ బెంగాల్, కర్నాటక, తమిళనాడు వంటి రాష్ట్రాలకు పరుగులు పెట్టి థర్డ్ ఫ్రంట్ గురించి మాట్లాడినప్పుడే అందరూ ఇది భారతీయ జనతా పార్టీ కోసమే అని అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే తన మాటల గారడీతో జాతీయ  పార్టీల హవా ఇక వద్దు అంటూ కె. చంద్రశేఖర రావు చేసిన ప్రకటనలపై కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. వాటన్నింటికి తెలుగుదేశం పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానంతో సమాధానం దొరికింది. శుక్రవారం నాడు లోక్‌సభలో అవిశ్వాసంపై చర్చ జరిగి... ఆ తర్వాత ఓటింగ్ జరిగితే తెలంగాణ రాష్ట్ర సమితి అధికార పక్షం వైపు ఉంటుంది. ఈ విషయాన్ని ఆ పార్టీ లోక్‌సభ సభ్యుడు వినోద్ ప్రకటించారు. ఈ ప్రకటన, శుక్రవారం నాడు ఓటింగ్ లో అధికార పక్షానికి  తెలంగాణ రాష్ట్ర సమితి మద్దతు పలకడం జరిగితే ఇక మూడో ఫ్రంట్ పటాపంచలైనట్లే. ఈ అవిశ్వాస తీర్మానం కనుక రాకుంటే లోక్‌సభ ఎన్నికల వరకూ తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు మూడోఫ్రంట్ డ్రామాను సమర్ధవంతంగా నడిపించే వారు. అవిశ్వాస తీర్మానంతో ఆయన థర్డ్‌ఫంట్ అనే టెంటుకు చిల్లు పడినట్లే. రేపు బీజేపీకి మ‌ద్ద‌తు ప‌లికితే కేసీఆర్ ప్ర‌జా ఫ్రంట్‌కు రేప‌టితో స‌మాధి క‌ట్టడం పూర్త‌వుతుంది. అంతేకాదు, ఇక ఎన్న‌టికీ కేసీఆర్ బీజేపీ మ‌నిషే అనేది నిరూపితం అవుతుంది. బ‌హుశా ఇది ముందే అర్థం చేసుకుందేమో మ‌మ‌తా బెన‌ర్జీ ఆ త‌ర్వాత ఆ ఫ్రంటు గురించి ఒక్క మాట కూడా మాట్లాడ‌లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు