`సైకిల్` కు షాకిచ్చిన `పులి`!

`సైకిల్` కు షాకిచ్చిన `పులి`!

గ‌త ఎన్నిక‌ల్లో బీజేపీకి శివ‌సేన‌ మిత్ర‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రించిన సంగ‌తి తెలిసిందే. అయితే, కొంత కాలంగా బీజేపీపై సంద‌ర్భానుసారంగా శివ‌సేన విమ‌ర్శ‌లు గుప్పిస్తోంది. మిత్ర‌పక్షాల‌కు బీజేపీ క‌నీస గౌర‌వం ఇవ్వ‌డం లేద‌ని శివ‌సేన ఆరోపిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఆ రెండు పార్టీల మ‌ధ్య కోల్డ్ వార్ జ‌రుగుతోంది. 2019 ఎన్నిక‌ల్లో మ‌హారాష్ట్ర లో దాదాపుగా ఆ రెండు పార్టీలు క‌లిసి బ‌రిలోకి అవ‌కాశం లేద‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. లోకసభలో శివసేనకు 18 మంది ఎంపీలు ఉన్న నేప‌థ్యంలో అవివ్వాస తీర్మానంలో మోదీ స‌ర్కార్ కు వారి మ‌ద్ద‌తు ఎంతో అవ‌స‌రం. ఈ నేప‌థ్యంలో తాజాగా, శుక్ర‌వారం జ‌ర‌గ‌నున్న అవిశ్వాస తీర్మానం విషయంలో ఎన్డీఏకు వ్య‌తిరేకంగా శివ‌సేన ఓటు వేస్తుంద‌ని అంతా భావించారు. అయితే, ఎన్డీఏకు శివ‌సేన మ‌ద్ద‌తివ్వ‌నుంద‌ని ఆ పార్టీ అధినేత ఉద్ధ‌వ్ థాక్రే చేసిన ప్ర‌క‌ట‌న సంచ‌ల‌నం రేపింది. అంతేకాకుండా, ఎన్డీయే స‌ర్కార్ కు అనుకూలంగా ఓటు వేయాలని ఎంపీలకు ఉద్ధ‌వ్ థాక్రే ఆదేశాలు జారీ చేయ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

శుక్ర‌వారం నాడు పార్ల‌మెంటులో  అవిశ్వాస తీర్మానం చ‌ర్చ‌కు రానున్న నేప‌థ్యంలో  ఏపీ సీఎం చంద్రబాబుకు వరుసగా ఎదురుదెబ్బ‌లు త‌గులుతున్నాయి. ఓ ప‌క్క జేసీని బుజ్జ‌గించే ప్ర‌య‌త్నంలో త‌ల‌మున‌క‌లై ఉన్న బాబుకు ఉద్ధ‌వ్ థాక్రే మ‌రో షాకిచ్చారు.టీడీపీ అవిశ్వాస తీర్మానానికి శివ‌సేన‌ మద్దతివ్వడం లేద‌ని ఉద్ధ‌వ్ స్పష్టం చేశారు. అంతేకాకుండా, శివ‌సే ఎంపీలకు విప్ జారీ చేశారు. ఉద్ధ‌వ్ ను బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా బుజ్జ‌గించ‌డంతోనే శివ‌సేన ఈ నిర్ణ‌యం తీసుకుంద‌ని తెలుస్తోంది. మ‌రోవైపు, పోల‌వ‌రంపై గుర్రుగా ఉన్న‌ ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కూడా చంద్ర‌బాబుకు షాకిచ్చారు. తమ 20 మంది ఎంపీలకు బీజేడీ విప్ జారీ చేసింది. పొరుగు రాష్ట్రం తమిళనాడులోని  అన్నాడీఎంకే కూడా అవిశ్వాసానికి మద్దతివ్వబోమని ప్ర‌క‌టించింది. అయితే, అవిశ్వాసానికి డీఎంకే మ‌ద్దతిస్తోంది. మ‌రోవైపు, లోక్ సభలో ప్రభుత్వానికి తగిన సంఖ్యాబ‌ల‌ముంద‌ని కేంద్ర మంత్రి అనంత్ కుమార్ అన్నారు. ఎన్డీయేకు 313 మంది మ‌ద్ద‌తు తెలుపుతున్నార‌ని, అవిశ్వాసం నెగ్గేందుకు కావాల్సిన 268 సీట్ల కంటే చాలా ఎక్కువగా ఉన్నాయని ఆయ‌న అన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు