ముక్క‌లు చెక్క‌లైన జ‌గ‌న్ పార్టీ ఓట్లు!

ముక్క‌లు చెక్క‌లైన జ‌గ‌న్ పార్టీ ఓట్లు!

మోడీ స‌ర్కారు ఆవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొంటున్న వేళ‌.. ఏ పార్టీ ఎంపీ ఓట్లు ఎటువైపు ప‌డ‌తాయ‌న్నది ఆస‌క్తిక‌రంగా మారింది. లోక్ స‌భ‌లోని మ‌రే పార్టీలో లేని విచిత్ర‌మైన ప‌రిస్థితి ఏపీ విప‌క్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటోంది. ఆ పార్టీకి చెందిన ఎంపీ ఓట్లు ముక్క‌లు చెక్క‌లుగా మారిపోయాయి. ఏదైనా పార్టీకి చెందిన ఎంపీలు త‌మ పార్టీ విధానాన్ని ఫాలో కావ‌టం.. లేదంటే.. మ‌రో పార్టీ వైపుకు జంప్ కావ‌టం ఉంటుంది.

కానీ.. జ‌గ‌న్ పార్టీ ఎంపీలు మాత్రం ఇందుకు భిన్నం. వారు దాదాపు నాలుగు పార్టీల‌కు అనుగుణంగా ఓట్లు వేయాల‌ని నిర్ణ‌యించ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. లోక్ స‌భ‌లో న‌లుగురు ఎంపీలు అధికారికంగా వైఎస్సార్ కాంగ్రెస్ పేరిట కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ.. వారి వైఖ‌రి మాత్రం మూడు ర‌కాలుగా ఉండ‌టం జ‌గ‌న్ పార్టీ ఎంపీల‌కు మాత్ర‌మే సాధ్య‌మ‌వుతుందేమో?

ఏపీకి చెందిన బుట్టా రేణుక‌.. ఎస్పీవైరెడ్డిలు టీడీపీకి అనుబంధంగా కొన‌సాగుతున్నారు. దీంతో.. వారిద్ద‌రూ టీడీపీ వైఖ‌రికి అనుకూలంగా.. మోడీ అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓట్లు వేయ‌నున్నారు. ఇక‌.. ఖ‌మ్మం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి టీఆర్ఎస్ లో కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే.

ఆయ‌న తానున్న టీఆర్ఎస్ పార్టీ తీరుకు త‌గ్గ‌ట్లుగా న‌డుచుకోనున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ మోడీ స‌ర్కారుపై పెట్టిన అవిశ్వాస తీర్మానంపై త‌మ వైఖ‌రి ఏమిట‌న్న‌ది గులాబీ పార్టీ వెల్ల‌డించ‌లేదు.
ఇక‌.. ఏ పార్టీలో లేని అర‌కు ఎంపీ కొత్త‌ప‌ల్లి గీత వైఖ‌రి ఏమిట‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ఆమె అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేస్తార‌ని చెబుతున్నారు. ఇలా ఒక పార్టీకి చెందిన న‌లుగురు ఎంపీలు మూడుముక్క‌లు కావ‌టం.. ఎవ‌రి దారి వారిద‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌టం ఒక‌ప్ప‌టి జ‌గ‌న్ పార్టీ నేత‌ల‌కే చెల్లుతుందేమో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు