పాపం సంతోష్ శ్రీనివాస్

పాపం సంతోష్ శ్రీనివాస్

మొత్తానికి ఏడాది కిందట్నుంచి చర్చల్లో ఉన్న సినిమాకు బ్రేక్ పడ్డట్లే కనిపిస్తోంది. తమిళ బ్లాక్ బస్టర్ మూవీ ‘తెరి’కి తెరదించేసినట్లే ఉంది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ. రవితేజ-సంతోష్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఈ చిత్రం తెరకెక్కించాలని ఆ సంస్థ భావించింది. కానీ అనివార్య కారణాల వల్ల ఈ చిత్రాన్ని ఆపేసినట్లు తెలుస్తోంది. నిజానికి ‘తెరి’ రెండేళ్ల కిందటే తెలుగులో ‘పోలీస్’ పేరుతో అనువాదమై రిలీజ్ అయినప్పటికీ.. ఈ చిత్రాన్ని తెలుగులో మళ్లీ రీమేక్ చేద్దామని చూసింది మైత్రీ సంస్థ.

ముందు అనుకున్న హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయనకు అడ్వాన్స్ కూడా ఇచ్చింది ఆ సంస్థ. సంతోష్ శ్రీనివాస్‌ను దర్శకుడిగా ఎంచుకుని స్క్రిప్టు కానీ పవన్ ఈ సినిమాకు డేట్లు కేటాయించలేకపోయాడు. ఇదిగో అదిగో అంటూనే సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి వెళ్లిపోయాడు. ఐతే స్క్రిప్టు రెడీగా ఉండటంతో రవితేజను సంప్రదించారు. అతను కూడా ఓకే అన్నాడు.

రవితేజ కోసం కొన్ని మార్పులు చేసి ఇంకో వెర్షన్ రెడీ చేశాడు సంతోష్. ప్రి ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయి. మైత్రీ బేనర్లోనే శ్రీను వైట్లతో సినిమా చేస్తున్న రవితేజ.. అది పూర్తయ్యాక ఈ ప్రాజెక్టులోకి వెళ్లాలనుకున్నాడు. కానీ అంతా ఓకే అనుకున్నాక ఈ సినిమాకు బ్రేక్ పడిందని.. దీన్ని మైత్రీ వాళ్లు డ్రాప్ చేశారని అంటున్నారు. ‘శ్రీమంతుడు’.. ‘జనతా గ్యారేజ్’.. ‘రంగస్థలం’ సినిమాలతో మైత్రీ బేనర్‌కు తిరుగులేని పేరు వచ్చింది. అలాంటి సంస్థ నుంచి రొటీన్ కథతో తెరకెక్కిన మసాలా మూవీ ‘తెరి’ రీమేక్ అవసరమా అన్న ప్రశ్నలు ముందు నుంచే ఉన్నాయి.

పైగా తెలుగులో ఆల్రెడీ రిలీజ్ అయిన సినిమాను రీమేక్ చేయడమేంటని కూడా అన్నారు. మరోవైపు వరుసగా రొటీన్ సినిమాలతో బోల్తా కొట్టిన రవితేజ.. కూడా ‘తెరి’ రీమేక్ చేసే విషయంలో పునరాలోచనలో పడ్డారట. దీంతో అందరూ కలిసి మాట్లాడుకుని ఈ చిత్రాన్ని ఆపేసినట్లు తెలుస్తోంది. ఐతే అందరూ హ్యాపీనే కానీ.. ఒక్క సంతోష్ శ్రీనివాస్ మాత్రం అన్యాయం అయిపోయాడు. దీని కోసం రెండేళ్లకు పైగా సమయం వృథా చేశాడతను. 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు