టీడీపీ ఎంపీల్లో ఆ ఒక్కడి కోసమే అందరి చూపు

టీడీపీ ఎంపీల్లో ఆ ఒక్కడి కోసమే అందరి చూపు

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మొదలయ్యాయి. తెలుగుదేశం పార్టీ కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడుతున్నట్లు ముందే చెప్పడంతో ఈ సమావేశాలు తొలిరోజు నుంచి వాడివేడిగా సాగుతాయని అంతా ఊహించారు. టీడీపీ పెట్టే అవిశ్వాస తీర్మానాన్ని తీసుకోవడానికి బీజేపీ అడ్డంకులు సృష్టిస్తుందని... దీంతో గత సమావేశాల మాదిరిగానే గందరగోళం తప్పదని అంతా అనుకున్నారు. మీడియా కూడా ఇదే ఊహించింది. అందుకే తెలుగు మీడియాతో పాటు నేషనల్ మీడియా కూడా పార్లమెంటు సమావేశాల తొలిరోజున అక్కడ పెద్ద ఎత్తున మోహరించింది. అయితే.. అనూహ్యంగా లోక్ సభ స్పీకర్ టీడీపీతో పాటు కాంగ్రెస్ ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలను చర్చకు అనుమతించారు. శుక్రవారం వీటిపై చర్చ చేపట్టేందుకు నిర్ణయించారు. దీంతో టీడీపీ దీన్ని విజయంగా భావిస్తూ మీడియా ముందుకొచ్చింది. టీడీపీ ఎంపీలంతా కలసికట్టుగా మీడియా ముందుకొచ్చి మాట్లాడారు.

    అయితే... టీడీపీ ఎంపీల ఉమ్మడి ప్రెస్ మీట్ ముగియగానే ఎప్పటిలాగే అన్ని చానల్స్ వారితో ప్రత్యేకంగా మాట్లాడాయి. తెలుగు చానల్స్ తలో ఎంపీతో మాట్లాడగా ఇంగ్లీష్, హిందీ చానల్స్ ఆ రెండు బాషల్లో మాట్లాడే ఎంపీలు కోసం చూశాయి. అప్పటికే టీడీపీ ఎంపీలు గురించి తెలిసిన నేషనల్ చానల్స్ వారు ఎంపీ రామ్మోహననాయుడు వెంట పడ్డారు. తెలుగుతో పాటు ఇంగ్లిష్ ,హిందీల్లో అనర్గళంగా మాట్లాడే ఆయనకు ఎక్కడలేని డిమాండ్ ఏర్పడింది. దీంతో మిగతా ఎంపీలు ఒక్కో చానల్ తో మాట్లాడి వెళ్లిపోయిన గంట వరకు రామ్మోహన్ నాయుడు నేషనల్ మీడియాతో మాట్లాడుతూనే ఉన్నారు.

    కాగా రామ్మోహన్ కాకుండా మిగిలిన ఎంపీల్లో గల్లా జయదేవ్ , సీఎం రమేశ్‌లు ఆంగ్లంలో మాట్లాడుతుండడంతో పలు ఇంగ్లిష్ చానల్స్ వారితోనూ మాట్లాడాయి. మొత్తానికి తెలుగు మీడియా సహా  ఇంగ్లిష్ మీడియా తాకిడి కేవలం ఆ ముగ్గురికే ఉండగా హిందీ మీడియా కూడా రామ్మోహన్‌నే ఆశ్రయించింది. దీంతో జాతీయ మీడియా ముందు హోల్ అండ్ సోల్ వాయిస్‌గా ఒక్క రామ్మోహనే నిలిచారు. గత సమావేశాల సందర్భంగానూ ఇదే పరిస్థితి.  అందుకే ఏపీకి సంబంధించిన అంశాలు కవర్ చేసేటప్పడు నేషనల్ మీడియా రామ్మోహన్ కోసం వెతకడం కనిపిస్తుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English