మోడీకి ఓటు వేయ‌ను... సామాన్యుడి నిర్ణ‌యం

మోడీకి ఓటు వేయ‌ను... సామాన్యుడి నిర్ణ‌యం

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ క‌ల ఆయ‌న‌కే సెల్ఫ్ గోల్ అవుతోంది. ఆర్థిక వ్యవస్థలో అందర్నీ భాగస్వాముల్ని చేయాలన్న ఆకాంక్షే ప్రధాని నరేంద్ర మోడీ అధికారానికి ప్రతిబంధకంగా మారుతోంద‌ని తేలింది. దేశంలోని చాలా గ్రామాల్లో కొత్త ఖాతాదారులకు బ్యాంక్, ఏటీఎం సేవలు ఇంకా అందడం లేదని ప్రపంచ బ్యాంకే చెబుతున్నది. నగరాలు, పట్టణాలతో పోల్చితే గ్రామాల్లో బ్యాంకుల ఏర్పాటు అంతంతమాత్రంగానే ఉండగా, ఒకవేళ ఏర్పాటైనా.. అందులో అందే సేవలు స్వల్పమే.

ఇక పేదల్ని బలవంతంగా బ్యాంకింగ్ వ్యవస్థలోకి తెచ్చిన మోదీ సర్కారు.. కొన్ని సంక్షేమ పథకాల ప్రయోజనాల్ని ఖాతాలకు ముడిపెట్టింది. అయితే బ్యాంకులు అందుబాటులోని కారణంగా తమకు రావాల్సిన సొమ్ము చేతికందక గ్రామీణ ఖాతాదారులు అనేక ఇబ్బందులు పడుతున్నట్లు ఈవై, అసోసియేటెడ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా అధ్యయనం వెల్లడించింది. పనిచేస్తేగానీ పూటగడువని గ్రామీణులు.. ప్రభుత్వం అందించే సంక్షేమ నిధుల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగడం, ఏటీఎంల ముందు బారులు తీరడం జరుగుతున్నదని పేర్కొన్నది. ఏటీఎంలలో నగదు కొరత కూడా వీరి సమస్యల్ని పెంచుతున్నదని గతేడాది నిర్వహించిన ఈ సర్వే స్పష్టం చేసింది.

2014లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత పౌరులందరికీ బ్యాంక్ ఖాతా సౌకర్యాన్ని దరిచేర్చాలన్న ప్రతిష్ఠాత్మక లక్ష్యాన్ని మోడీ ఎంచుకున్న విషయం తెలిసిందే. ఈ ఖాతాల ద్వారానే పేదలకు నేరుగా ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలని, రుణ, బీమా సదుపాయాల్నీ వర్తింపజేయాలని సంకల్పించారు. ఫలితంగా కేవలం నాలుగేళ్ల‌లోనే 31 కోట్ల మందికి కొత్తగా బ్యాంక్ ఖాతాలు తెరిచారు. కానీ క్షేత్రస్థాయిలో కొరవడిన కనీస మౌలిక వసతులు.. ఈ ఖాతాల లక్ష్యాన్ని దెబ్బతీయగా, గ్రామీణుల ఆగ్రహావేశాలకూ కేంద్రాన్ని గురిచేస్తున్నాయి.

గతేడాదే మొత్తం ఖాతాల్లో దాదాపు సగందాకా మూతబడ్డాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. గడిచిన ఏడాది కాలంలో ఈ ఖాతాల్లో లావాదేవీలే జరుగలేదన్నమాట. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా బ్యాంక్ శాఖలు, ఏటీఎంల కొరత ప్రధాని ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ప్రయత్నాలకు గండి కొట్టగా, వచ్చే ఏడాదే సార్వత్రిక ఎన్నికలున్న క్రమంలో గ్రామీణ ఓటు బ్యాంకూ దూరమవుతోందని స‌ర్వే స్ప‌ష్టం చేసింది.

పనిచేస్తేగానీ పూటగడువని గ్రామీణులు.. ప్రభుత్వం అందించే సంక్షేమ నిధుల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగడం, ఏటీఎంల ముందు బారులు తీరడం జరుగుతున్నదని పేర్కొన్నది. ఏటీఎంలలో నగదు కొరత కూడా వీరి సమస్యల్ని పెంచుతున్నదని గతేడాది నిర్వహించిన ఈ సర్వే స్పష్టం చేసింది.

గ్రామీణ ప్రాంతాలను బ్యాంకింగ్ వసతుల లేమి తీవ్రంగా వేధిస్తున్నట్లు రిసెర్చ్ సందర్భంగా మేము గుర్తించాం అని అహ్మదాబాద్ ఐఐఎం అసోసియేట్ ప్రొఫెసర్ రితికా ఖెహ్రా  చెప్పారు. చాలామంది పేద కూలీలు, పెన్షనర్లు బ్యాంకింగ్ సమస్యల బారినపడుతున్నారని, వారిలో ప్రభుత్వంపట్ల కోపం రావడం సహజమేనని అభిప్రాయపడ్డారు. పాత పెద్ద నోట్ల రద్దు సమయంలో ఈ కష్టాలు మరీ దారుణంగా ఉన్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమైయ్యాయి. జార్ఖండ్‌లోని గ్రామస్తులకైతే నగదు ఉపసంహరణకు ఏకంగా 96 గంటలు పట్టడం గమనార్హం. ఇక రాజస్థాన్‌లోని జొగలియా గ్రామంలో దాదాపు 5,500 మంది నివసిస్తుండగా, ఇక్కడ బ్యాంక్ శాఖలుగానీ, ఏటీఎంలుగానీ లేవు. కనీసం 15 కిలోమీటర్లు వెళ్తేగాని బ్యాంకు సేవలు అందవు. ఇందుకు రూ.60 చార్జీతో బస్సుపై ప్రయాణించాల్సిందే. వృద్ధాప్య పెన్షన్లు, ఇతరత్రా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులైనవారికి ఈ ఖర్చు తప్పట్లేదు.

బ్యాంక్ సదుపాయాలు కల్పించరు. కానీ అన్నింటినీ బ్యాంకులతో ముడిపెడుతారు. వచ్చే ఎన్నికల్లో నేను మోడీకి ఓటే వేయను అని 32 ఏళ్ల‌ రాజూరామ్ అనే జొగలియా గ్రామస్తుడు తన ఆవేదనను వెలిబుచ్చారు. అయితే, మోడీ త‌లిచింది ఒక‌టైతే..జ‌రిగింది ఇంకొక‌టి కావ‌డం గ‌మ‌నార్హం. నిజానికి ఈ ఏడాది మార్చితో ముగిసిన నాలుగేళ్ల‌లో దేశవ్యాప్తంగా సుమారు 25,000 బ్యాంక్ శాఖలు, 45,000 ఏటీఎంలు కొత్తగా ఏర్పాటయ్యాయి. అయినప్పటికీ తమ నూతన గ్రామీణ ఖాతాదారులకు బ్యాంకులు మెరుగైన సేవల్ని అందించడంలో విఫలమే అయ్యాయి. 19 శాతం జనాభాకు ఇప్పటికీ కనీస రుణ సౌకర్యాలు లభించడం లేదని ఈవై సర్వే చెబుతుండ‌టం గ‌మ‌నార్హం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు