గోవాలో ప‌బ్లిక్‌గా మందు తాగితే...అయిపోయారంతే

గోవాలో ప‌బ్లిక్‌గా మందు తాగితే...అయిపోయారంతే

భార‌త‌దేశంలో అత్య‌ధిక ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్షిస్తున్న ప్రాంత‌మైన గోవా ఈ ద‌ఫా కీల‌క నిర్ణ‌యంతో తెర‌మీద‌కు వ‌చ్చింది. దేశ‌, విదేశీ టూరిస్టుల‌కు హాట్ స్పాట్ అయిన గోవా త‌మ ద‌గ్గ‌ర తేడాగా ప్ర‌వ‌ర్తిస్తే బుక్ అయిపోతార‌ని హెచ్చ‌రించింది. అవును. గోవా ప్రభుత్వం  కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో  మందు కొడితే  జరిమానాలు విధిస్తామని గోవా సీఎం మనోహర్‌ పారికర్‌ తెలిపారు. దానికి సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్‌ జారీ చేస్తామని చెప్పారు. ఆగస్టులోపే ఈ విధానం అమలు చేయాలని అనుకుంటున్నట్లు తెలిపారు. అందుకే గోవాలో మందుతో మ‌జా చేసుకోవాల‌నే వాళ్లు కాస్త కాదు ..చాలా జాగ్ర‌త్తగా ఉండాల్సిందే.!

గోవాను మ‌రింత అంద‌మైన ప‌ర్యాట‌క కేంద్రంగా మార్చ‌డం,సుంద‌రీక‌ర‌ణ‌లో భాగంగా ఇటీవల రివర్‌ ఫ్రంట్ పేరుతో ప్ర‌భుత్వం ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టింది. ఇటీవ‌ల ముఖ్య‌మంత్రి పారిక‌ర్‌ ఆ ప్రాంతం గుండా ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డి ప‌రిస్థితుల‌ను చూసి పారిక‌ర్ షాక్ అయ్యారట‌. దాని గురించి మీడియాకు సీఎం పారికర్ వివ‌రిస్తూ స‌ర్కారు ప‌ట్టుద‌ల‌తో అభివృద్ధి  చేసిన  ప్రాంతంలో కాలేజీ విద్యార్థులు బీర్లు తాగుతూ కనిపిస్తున్నారని వెల్ల‌డించారు. అంతేకాకుండా ఇద్దరు, ముగ్గురు విద్యార్థులు బీరు బాటిళ్లు పట్టుకుని వెళ్తుండడం చూశానన్నారు. ఖాళీ బాటిళ్లను ఎక్కడ పడితే అక్కడ పడేయడంతో మిగతా ప్రజలకు ప్రమాదమని అన్నారు. గోవా రోడ్లపై ఖాళీ బీరు సీసాలు పడి ఉంటున్నాయని ఇది రాష్ట్ర ఇమేజ్‌కు సంబంధించిన అంశ‌మ‌ని ఆయ‌న పేర్కొన్నారు. పబ్లిక్‌గా మందు తాగితే రూ.2,500 జరిమానా విధించనున్నట్లు తెలిపారు. ఆగస్టు నుంచి బహిరంగంగా  మందు కొడితే భారీ జరిమానాలుంటాయన్నారు. దీనికి సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్‌ జారీ చేస్తామని, ఆగస్టు 15 నుంచి అమలులోకి తెస్తామని సీఎం పారికర్‌ తెలిపారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు