బాబు-ఉండ‌వ‌ల్లి మీటింగ్ ర‌హ‌స్యం ఇదేనా!

బాబు-ఉండ‌వ‌ల్లి మీటింగ్ ర‌హ‌స్యం ఇదేనా!

ఒకరు నిప్పు... మరొకరు నీరు.....ఒకరు ఆకాశం.. ఇంకొకరు భూమి.. ఒకరు తూర్పు...ఇంకొకరు పడమర...  ఇవి ఎప్పుడూ, ఎన్నడూ కలవవు. రెండూ భిన్నధ్రువాలే. అయితే ఆంధ్రప్రదేశ్ సచివాలయం అమరావతిలో మాత్రం సోమవారం సాయంత్రం ఈ ఉప్పు.. నిప్పు , ఈ భూమి ఆకాశం, ఈ తూర్పు పడమర విచిత్రంగా కలిసాయి. అలా కలిసిన ఇద్దరిలో ఒకరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడైతే మరొకరు మాటల మాంత్రికుడు ఉండవల్లి  అరుణ్ కుమార్. వీరిద్దరి కలయిక వెనుక మంత్రాంగం ఏమిటి ? ఇదే ఇప్పడు హాట్ టాపిక్. బుధవారం నుంచి జరగనున్న లోక్‌సభ వర్షాకాల సమావేశాలలో రాష్ట్రానికి ప్రత్యేక హోదపై  వ్యూహ రచన చేసేందుకని చెబుతున్నారు. దేశంలో తనకంటే సినీయర్ నాయకుడు లేడంటున్న చంద్రబాబుకు రెండుసార్లు మాత్రమే పార్లమేంట్  స‌భ్యుడైన ఉండవల్లి ఎలాంటి వ్యూహరచన నేర్పగలడు అన్నదే పెద్ద ప్రశ్న.  

పైగా నిరంతరం చంద్రబాబును తిట్టిపోసే ఉండవల్లి అరుణ‌్‌కుమార్ ఆయన పిలవగానే వెళ్లి పోతారా....? తెలుగుదేశం పార్టీలోనూ,  చంద్రబాబు అనుచరగణంలోనూ ఆ పాటి మేధావులు లేరా. అనే ప్రశ్నలు తలెత్తున్నాయి. ఈ ఉప్పు నిప్పుల కలయిక వెనుక ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉన్నట్టు చెప్పుతున్నారు. వచ్చే ఎన్నికలలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునే అంశంపై చర్చించేందుకే ఈ తూర్పు పడమర కలిసాయి అంటున్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మధ్యవర్తిత్వంతోనే ఉండవల్లి... చంద్రబాబును కలిసినట్టుగా చెప్పుతున్నారు. మాజీ ముఖ‌్యమంత్రి కిరణ‌్ కుమార్ రెడ్డికి ఉండవల్లి అరుణ్ కుమార్ అత్యంత సన్నిహితుడు. రాష్ట్ర విభజన అనంతరం ఈ ఇద్దరు నాయకులు సమైక్య ఆంధ్రప్రదేశ్ పార్టీని పెట్టారు. ఆ బంధంతోనే నేడు చంద్రబాబును కలిసేందుకు ఉండవల్లిని పంపినట్టు సమాచారం. తెలంగాణలో కాంగ్రెస్‌తో పొత్తుకు తెలంగాణ కాంగ్రెస్ నాయకుడిని పంపితే అది పెద్ద చ‌ర్చ‌కు దారితీస్తుంద‌న్న‌ది వీరి భయం. అదే తెలంగాణాకు, తెలుగుదేశానికి, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని ఉండవల్లిని పంపితే ఏ గొడవా ఉండదని ఈ భేటీని ఏర్పాటు చేసినట్లు సమాచారం. చంద్రబాబుకు ఏపీలో కాంగ్రెస్‌తో పొత్తు అంత‌ర్గ‌తంగా గాని, బ‌హిరంగంగా గానీ పొత్తు పెట్టుకునే ఏ ఉద్దేశం లేని నేప‌థ్యంలో అన‌వ‌స‌రంగా విమ‌ర్శ‌లకు తావు ఎందుక‌ని ఈ కోణంలో మీటింగ్ ఏర్పాటుచేశారు.  చంద్రబాబు, ఉండవల్లి ల తాజా భేటి వెనుక చిదంబర రహస్యం అదే అంటున్నారు.

అదేంటి టీడీపీ-కాంగ్రెస్ పొత్తా అని ఆశ్చ‌ర్య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. మ‌హారాష్ట్ర బీజేపీ గోదావ‌రి నీళ్లు మాకే కావాలంటుంది, తెలంగాణ బీజేపీ తెలంగాణ‌కే నీళ్లు కావాల‌ని అంటుంది. అలాగే ప‌లు రాష్ట్రాల్లో ఒక పార్టీ ఉన్న‌పుడు నిర్ణ‌యాలు, పొత్తులు కూడా అలాగే వేరువేరుగా ఉంటాయి. తెలంగాణ‌లో బ‌ద్ధ శ‌త్రువు టీఆర్ఎస్ కానీ.. కాంగ్రెస్ కాదు. అందుకే టీఆర్ఎస్‌తో కాకుండా కాంగ్రెస్‌తో పొత్తు మంచిద‌న్న‌ది బాబు ఆలోచ‌న‌. ఇది రాహుల్ -సోనియా మంత్రాంగం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English