అధికారుల త‌ల‌తిక్క‌నిర్ణ‌యాన్ని ర‌ద్దుచేసిన బాబు

అధికారుల త‌ల‌తిక్క‌నిర్ణ‌యాన్ని ర‌ద్దుచేసిన బాబు

భ‌క్తుల్లో వెల్లువెత్తిన ఆగ్ర‌హం కావ‌చ్చు...సోష‌ల్ మీడియా ప్ర‌భావం అనుకోవ‌చ్చు...రాజ‌కీయ వ‌ర్గాల విమ‌ర్శ‌లు పునరాలోచ‌న‌లో ప‌డేలా చేసి ఉండ‌ట‌మే కార‌ణం కావ‌చ్చు కానీ...కొద్దిరోజులుగా తీవ్రంగా వార్త‌ల్లో న‌లుగుతున్న అంశంలో కీల‌క మ‌లుపు చోటుచేసుకుంది. చరిత్రలో మొదటిసారి  పాలకమండలి కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడి దర్శ‌నం లేదంటూ నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే.

ఈ  నిర్ణయంపై విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి జరిగే మహా సంప్రోక్షణలో మూడు, నాలుగు గంటలు దర్శనం కల్పించేవారు. అయితే ఈసారి మాత్రం సామాన్యులకు దర్శనమే లేదని ప్రకటించారు. ప్ర‌భుత్వాన్ని సంప్ర‌దించ‌కుండా చేసిన ఈ నిర్ణ‌యంపై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఆగ్ర‌హించారు. దీనిపై పీఠాధిపతులు, సామాన్యుల నుంచి విమర్శలు వ‌చ్చాయి. దీంతో ఆగస్ట్ 11 నుంచి 16వ తేదీ వరకు ఆరు రోజులు కూడా దర్శనం కల్పించాలంటూ టీటీడీ పాలక మండలికి ఆదేశాలిచ్చింది.

మొదట ఐదు రోజులు.. ఆ తర్వాత తొమ్మిది రోజులు.. ఆ తర్వాత ఆరు రోజులు... ద‌ర్శ‌నం బంద్ అంటూ తీసుకున్ననిర్ణయాన్ని  టీటీడీ ఉప‌సంహ‌రించుకుంది. మహా సంప్రోక్షణ జరిగే ఆ 6 రోజులు.. రోజుకి 20 నుంచి 25వేల మంది భక్తులను దర్శనం కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని టీటీడీ బోర్డుని ఆదేశించింది. దర్శనం నిలిపివేత నిర్ణయంపై భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.

ఆగమ శాస్త్రానుసారం పూజ కార్యక్రమాలు నిర్వహించాలని, గతంలో పాటించిన నిబంధనలే పాటించాలని సీఎం చంద్రబాబు సూచించారు. నిబంధనల్లో మార్పులు చేయొద్దని కోరారు. గతంలో నిర్వహించిన విధంగా ఈసారి కూడా భక్తులకు దర్శనం కల్పించాలని ప్రభుత్వం ఆదేశించటంతో.. టీటీడీ కూడా వెనక్కి తగ్గి ప్ర‌క‌ట‌న చేసింది. కాగా, భ‌క్తుల, ప్ర‌జ‌ల చైత‌న్య‌మే పాల‌కులు, టీటీడీ పాల‌క‌మండ‌లి నిర్ణ‌యానికి కార‌ణ‌మ‌ని అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు