ట్రంప్-పుతిన్ భేటీ.. ఇండియాకు ఎందుకు కీలకం?

ట్రంప్-పుతిన్ భేటీ.. ఇండియాకు ఎందుకు కీలకం?

ప్రపంచంలోని రెండు బలమైన దేశాల అధినేతల మధ్య ఈ రోజు భేటీ జరగబోతోంది. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేసేందుకు రష్యా ప్రయత్నించిందన్న ఆరోపణల నేపథ్యంలో చోటుచేసుకున్న తాజా పరిణామాలతో రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులే ఉన్నాయి. అయినా, ఇరు దేశాల అధ్యక్షుల భేటీ మాత్రం ఈ రోజు జరగబోతోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీని రద్దు చేసుకోవాలంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై స్వదేశంలో.. సొంత పార్టీ, విపక్షం నుంచి ఎంతగా ఒత్తిడి వస్తున్నా ఆయన ముందుకే వెళ్తున్నారు.

కొద్దివారాల కిందట ట్రంప్, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ ల మధ్య సమావేశం ప్రపంచంలో ఎంతగా ఆసక్తి రేపిందో ఇప్పుడు వీరిద్దరి సమావేశమూ అంతేస్థాయాలో ఆసక్తి కలిగిస్తోంది. ప్రపంచ దేశాలన్నీ ఈ పరిణామాన్ని పరిశీలిస్తున్నాయి. భారత్ కూడా  ఈ భేటీలో చర్చకొచ్చే అంశాలపై కన్నేసి ఉంచింది... ఇది మనపై ఎలాంటి ప్రభావం చూపనుందనేది అంచనా వేస్తోంది.

మరోవైపు రష్యా విషయంలో ట్రంప్ ధోరణి కొన్నాళ్లుగా అగ్రెసివ్‌గా ఉంది. ఇటీవల ట్రంప్‌ తరచూ రష్యాపై ఏదో విధమైన ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఆ దేశాన్ని వీలైనంతగా ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. ఆఖరకు నాటో కూటమి దేశాల శిఖరాగ్ర సమావేశంలో కూడా రష్యాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు సంధించారు. జర్మనీని రష్యా గుప్పెటపట్టి ఆడిస్తోందంటూ మండిపడ్డారు. ఇప్పటికే రష్యాతో పాటు ఐరోపా, కెనడా, మెక్సికో, చైనాలపై అమెరికా వాణిజ్య యుద్ధం ప్రకటించింది. పైగా బ్రిటన్‌ను అనవసరంగా వివాదాల్లోకి లాగే ప్రయత్నం చేశారు. ఇలా వివాదాస్పదంగా మారిన ట్రంప్‌ వైఖరి పుతిన్‌ భేటీలో ఏ విధంగా ఉంటుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.

ఓ వైపు ట్రంప్‌ చైనాపై పగబట్టినట్లే వ్యవహరిస్తున్నారు. మరోవైపు రష్యాతో పోలిస్తే చైనా కొన్ని అంశాల్లో మెరుగంటూ కితాబిస్తున్నారు. ఇంకోసారి పుతిన్‌ తనకు సమర్ధుడైన పోటీదారు డంటూ పేర్కొంటున్నారు. ఇలా రోజుకో విధంగా రష్యా పట్ల ఆయన భావాల్ని వ్యక్తీకరిస్తున్నారు. దీంతో వీరి మధ్య భేటీ ఎలా ఉండబోతోందన్న ఆసక్తి అంతటా నెలకొంది.

పుతిన్‌, ట్రంప్‌ల మధ్య జరిగే చర్చల్లో కొన్ని సానుకూల నిర్ణయాలు తీసుకున్నా అవెంతకాలం అమల్లో ఉంటాయన్న విషయం సందేహాస్పదమేనని నిపుణులు పేర్కొంటున్నారు. అసలే రష్యాకు చెందిన రహస్య గూఢచార వ్యవస్థ అమెరికా అధ్యక్షఎన్నికల్లో పరోక్షంగా ప్రభావం చూపించిందన్న ఆరోపణలున్నాయి. ఇటీవలె ఇందుకు సంబంధించి 12మంది రష్యన్‌ రహస్యాధి కారులపై చార్జిషీట్‌లు కూడా నమోదయ్యాయి. రష్యా ఒకప్పుడు అమెరికాకు అతిపెద్ద పోటీదారు. అయితే ఇప్పుడా పరిస్థితిలేదు. కానీ గతంతో పోలిస్తే రష్యా ప్రపంచ సమాజంతో సంబంధాలు మెరుగు పర్చుకునే ప్రయత్నం చేస్తోంది. అలాగే అమెరికాతో కూడా సత్‌సంబంధాలు నెరపాలని ఆశిస్తోంది.

అంతర్జాతీయ భద్రత, అణునిరాయుధీకరణ, తీవ్ర వాదంపై పోరు, ప్రాం తీయ ఘర్షణలకు స్వస్తిప లకడం, ద్వైపాక్షిక సంబంధాల్ని మెరుగుప ర్చుకోవడం వంటి అంశాలు వీరిద్దరి మధ్య చర్చల్లోకి రావొచ్చు. అయితే ఇంతవరకు స్పష్టంగా అజెండాల్ని మాత్రం రూపొందించుకోలేదు. కానీ ఇద్దరి లక్ష్యం సుస్పష్టం. అది ప్రపంచాన్ని తమ గుప్పెట పట్టి ఉంచడం. ఆయుధ వ్యాపారం.

భారత్‌కు రక్షణావసరాల్ని తీర్చడంలో రష్యాదే పైచేయి. ఆ దేశం నుంచి భారత్‌ పెద్దసంఖ్యలో ఆయు ధాల్ని కొనుగోలు చేస్తోంది. ట్రంప్‌, పుతిన్‌ల మధ్య జరిగే చర్చల్లో ఆయుధ వ్యాపారం కూడా ఒకటని భావిస్తున్నారు.  ప్రస్తుతం భారత్‌ -రష్యాల మధ్య వ్యూహాత్మక సాంకేతిక పరికరాలు, పరిజ్ఞాన మార్పిడిలో 39ర ష్యన్‌ సంస్థలు సహకారాన్నందిస్తున్నాయి. ఈ చట్టం మేరకు ఇలాంటి సంస్థలు శాస్త్రీయ పరిజ్ఞానం, పరికరాల విక్రయాల్ని కొన్ని దేశాలకు జరపకుండా అడ్డుకునే వీలుంది. అయితే పుతిన్‌ ప్రస్తుతం భారత్‌కు అనుకూలంగా ఉన్నారు. పైగా ఆ దేశం నుంచి రక్షణ పరికరాల కొనుగోలుదారుల్లో భారత్‌ ఒకటి.

పుతిన్‌, ట్రంప్‌ల మధ్య చర్చలు సఫలీకృతమైతే రష్యా నుంచి మరింత ఆధునిక ఆయుధ పరిజ్ఞానం భారత్‌కు అందజేసే వెసులుబాటు పుతిన్‌కు లభిస్తుంది. లేనిపక్షంలో అంతర్జాతీయ ఆంక్షల పేరిట భారత్‌కు కూడా ఆధునిక ఆయుధాల సరఫరాను కట్టడి చేయాల్సిన పరిస్థితి రష్యాకు నెలకొంటుంది. ఇప్పటికే భారత్‌ వద్ద పుంఖానుపుంకాలుగా రష్యాకుచెందిన జెడ్‌ ఫైటర్లు, సబ్‌మెరైన్లు, యుద్ధనౌకలు ఇతర రకాల ఆయుధాలున్నాయి. వీటికి విడిభాగాలు కావాలన్నా, మరమ్మతులు చేయాలన్నా రష్యా సంస్థల సహకారం కావాల్సిందే. దీంతో ఇప్పుడు పుతిన్‌, ట్రంప్‌ల మధ్య చర్చలు భారత్‌పై కూడా ప్రభావం చూపనున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు