ఆ ఎన్నారై కేసు ఏమైందంటే...!

ఆ ఎన్నారై కేసు ఏమైందంటే...!

అమెరికాలోని కన్సాన్ సిటీలోని ఓ రెస్టారెంట్‌లో ఈ నెల 6న గుర్తు తెలియని అగంతకుడు కాల్పులు జరపడంతో తెలుగు బిడ్డ కొప్పు శరత్ మృతి చెందిన విషయం విదితమే. యూనివర్సిటీ ఆఫ్ మిస్సోరిలో ఎంఎస్ చేసేందుకు శరత్.. ఆర్నేళ్ల కిందటే అమెరికా వెళ్లారు. చ‌దువుకుంటూ ఉద్యోగం చేస్తున్న కొప్పు శరత్ ఇలా దుర‌దృష్ట‌క‌ర‌మైన ఘ‌ట‌న‌లో క‌న్నుమూశారు. అయితే ఈ హత్య కేసులో నిందితుడిని పోలీసులు హతం చేశారు. కన్సాస్‌లో నిందితుడి ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. దీంతో పోలీసులపై దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. పోలీసులు కూడా కాల్పులు జరపడంతో దుండగుడు మృతి చెందాడు.

శరత్ హత్య కేసులో నిందితుడిని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. నిందితుడు నల్లజాతీయుడి అని గుర్తించిన పోలీసులు.. అతడి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. సీసీటీవీ పుటేజ్ స‌హా ఇత‌ర వివరాల ఆధారంగా ఆ దుండ‌గుడి నివాసం క‌నుగొన్న‌పోలీసులు ఆయ‌న్ను అరెస్ట్ చేసేందుకు ప్ర‌య‌త్నించారు. అయితే దుండగుడు కాల్పులు జ‌రిపాడు. దీంతో పోలీసులు సైతం కాల్పులు జ‌రప‌గా ఆ నిందితుడు మ‌ర‌ణించాడు. కాగా ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయి.

ఇదిలాఉండ‌గా...శ‌ర‌త్ ఆరునెల‌ల వ్య‌వ‌ధిలోనే అమెరికాలోని భార‌తీయులకు ఉప‌యోగ‌ప‌డే ఆవిష్క‌ర‌ణ‌చేశాడు. అమెరికాకు వచ్చే వివిధ దేశాలవారిలో ఇంగ్లిష్ తెలియనివారికి ఇబ్బందులు తప్పవు. అలాంటివారు అడ్రస్‌లు, ఇతర స్థానిక విషయాలు తెలుసుకోవడంలో ఉపయోగపడేలా ఒక మొబైల్ యాప్‌ను రూపొందించడంపై శరత్ పనిచేశాడు. మిస్సోరి యూనివర్సిటీ విద్యార్థిగా తాను రూపొందిస్తున్న యాప్ వివరాలను శరత్ యూట్యూబ్‌లో వివరించాడు. ఎవరైనా ఇంగ్లిష్ చదవడం రానివాళ్లు దానిని తమ భాషలో చదువుకునే సౌలభ్యం కల్పించాడు. ఉదాహరణకు ఏదైనా ప్రాంతానికి సంబంధించిన సైన్‌బోర్డు కనిపిస్తే దాని ఫొటో తీసి, శరత్ రూపొందించిన యాప్‌లో అప్‌లోడ్ చేసి, వారికి తెలిసిన భాషపై క్లిక్ చేస్తే ఆ పేరు వారు కోరుకున్న భాషలో కనిపిస్తుంది. ఈ యాప్ ఉప‌యోగించుకున్న ప‌లువురు తాజాగా దుండ‌గుడి కాల్పుల ఘ‌ట‌న‌లో శ‌ర‌త్ క‌న్నుమూయ‌డంపై తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు