అమిత్‌షా టూర్ సాక్షిగా..టీబీజేపీ సెల్ఫ్‌గోల్‌

అమిత్‌షా టూర్ సాక్షిగా..టీబీజేపీ సెల్ఫ్‌గోల్‌

బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా హైదరాబాద్ ప‌ర్య‌ట‌న‌లో అనూహ్య ట్విస్ట్ చోటుచేసుకుంది. త‌మ జాతీయ నాయ‌కుడు రాష్ట్ర ప‌ర్య‌ట‌న ద్వారా పార్టీని బ‌లోపేతం చేసుకోవాల‌ని స్కెచ్చేసిన బీజేపీ సెల్ఫ్‌గోల్ చేసుకుంది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం అంశం వివాదాస్పదం కావడంతో బీజేపీ వెనక్కు తగ్గింది. హైదరాబాద్‌లో జరిగిన సమావేశాల్లో పార్టీ అధినేత అమిత్ షా రామాలయం అంశాన్ని ప్రస్తావించలేదని కేంద్ర కమిటీ ప్రకటించింది. ఇందుకు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ వేసిన కౌంట‌ర్లు కార‌ణం కాగా, తెలంగాణ బీజేపీ నేత‌ల అత్యుత్సాహం కూడా ఒక అంశ‌మ‌ని అంటున్నారు.

హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి రామాలయ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సానుకూల చర్యలు తీసుకుంటుందని అమిత్ షా వ్యాఖ్యానించినట్టు వివిధ ఛానళ్ల ముందు తెలంగాణ పార్టీ నేతలు చెప్పడం చర్చనీయాంశమైంది. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు పేరాల చంద్రశేఖర్ (శేఖర్‌జీ) రామాలయం విషయాన్ని మీడియాకు చెప్పారు. అనంత‌రం అమిత్ షా రామాలయం అంశాన్ని ప్రస్తావించారని పేర్కొంటూ శేఖర్ జీ ప్రకటనను కూడా బీజేపీ రాష్ట్ర కార్యాలయం విడుదల చేయడం, ఆ వార్తకు మీడియా అత్యంత ప్రాధాన్యం ఇవ్వడంతో వివాదం రాజుకుంది. అమిత్ షా రామాలయం అంశాన్ని ప్రస్తావించారన్న వార్త‌ల నేప‌థ్యంలో వెంటనే ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ పార్టీ నేతలతో భేటీ అయి చర్చించారు. సుప్రీం కోర్టు పరిధిలో ఉన్న సున్నితమైన అంశంపై బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఎలా మట్లాడతారని అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఇలాంటి అంశాలను ప్రస్తావిస్తే ఓటర్లను ప్రభావితం చేసినట్టవుతుందని అసుదుద్దీన్ అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ఈ మేరకు అసదుద్దీన్ సైతం ట్వీట్ చేస్తూ సార్వత్రిక ఎన్నికల అనంతరమే అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం ఉత్తమమని ఓవైసీ పేర్కొన్నారు.

మ‌రోవైపు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సైతం అమిత్ షా వ్యాఖ్యలను తప్పుపట్టారు. కోర్టుల‌ను ప్ర‌భావితం చేసేలా అమిత్ షా వ్యాఖ్య‌లున్నాయ‌న్నారు. దీంతో పార్టీ దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. ఇదంతా మీడియా సృష్టేనంటూ వ్యాఖ్యానించింది. ఏకంగా అమిత్ షా ట్వీట్ చేస్తూ తాను తెలంగాణ పర్యటనలో రామాలయంపై ఎలాంటి ప్రకటన చేయలేదని పేర్కొన్నారు. అజెండాలో కూడా రామాలయ అంశం లేదని ట్వీట్ చేశారు. కాగా, అమిత్ షా వ్యాఖ్యలను మీడియాకు చెప్పిన రాష్ట్ర నాయకులు వివాదానంతరం దానిపై వివరణ ఇచ్చేందుకు ముందుకు రాక‌పోవ‌డం కొస‌మెరుపు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English