ద‌టీజ్ రామోజీ..అమిత్‌షా కూడా ఇంటికి రావాల్సిందే

ద‌టీజ్ రామోజీ..అమిత్‌షా కూడా ఇంటికి రావాల్సిందే

రామోజీ రావు..మీడియా మొఘ‌ల్‌. ఎంత‌టి వారైనా ఆయ‌న శ‌క్తిని, యుక్తిని తెలుసుకోవాల్సిందే. వాటిని గుర్తించి ఆయ‌న వ‌ద్ద‌కు రావాల్సిందే. అంతే త‌ప్ప స్వ‌యంగా రామోజీ వెళ్ల‌డం అనేది అత్యంత అరుదు. అలాంటి రామోజీరావు ఇంటికి దేశంలోనే అత్యంత శ‌క్తివంతుల జాబితాలో టాప్‌లో నిలిచే బీజేపీ జాతీయ అధ్యక్షుడు, ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ న‌మ్మిన‌బంటు అమిత్‌షా విచ్చేస్తున్నారు. ఔను. దేశ‌వ్యాప్త ప‌ర్య‌ట‌న‌లో భాగంగా హైద‌రాబాద్ వ‌చ్చిన అమిత్‌షా స్వ‌యంగా రామోజీ ఇంటికి వెళ్లి ఆయ‌న‌తో స‌మావేశం కానున్నారు.

2019 ఎన్నిక‌లు స‌మీపిస్తుండటం, దానికంటే ముందుగానే ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌చ్చేస్తున్న నేప‌థ్యంలో అమిత్‌షా ఆయా రాష్ర్టాల్లో బిజీబిజీగా ప‌ర్య‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. అలా వేస్తున్న టూర్ల‌లో భాగంగానే ఆయ‌న తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చారు. ఇందులో భాగంగా రాబోయే ఎన్నిక‌ల గురించి పార్టీ నేత‌ల‌కు దిశానిర్దేశం చేయ‌నున్నారు. రెండు ద‌ఫాలుగా పార్టీ ముఖ్యుల‌తో నాంప‌ల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాల‌యంలో స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు. అనంత‌రం ఆయ‌న స్వ‌యంగా మీడియా మొఘ‌ల్ రామోజీ రావు ఇంటికి వెళ్ల‌నున్నారు.

ఇటీవ‌ల `సంప‌ర్క్ ఫ‌ర్‌ స‌మ‌ర్థ‌న్` పేరుతో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ సార‌థ్యంలోని ఎన్డీఏ సర్కారు నాలుగేళ్ల పాల‌న విజ‌యాల‌ను వివ‌రించేందుకు బీజేపీ ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. అందులో భాగంగా ఇప్ప‌టికే ప‌లువురిని అమిత్ షా క‌లిశారు. దానికి కొన‌సాగింపుగా హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌లో రామోజీరావుతో ఆయ‌న భేటీ కానున్నారు. ఇందుకోసం నాంప‌ల్లి పార్టీ కార్యాల‌యం నుంచి అమిత్‌షా రామోజీ ఫిలింసిటీకి వెళ్లి ఆయ‌న‌తో దాదాపు 20 నిమిషాల పాటు స‌మావేశం కానున్నారు. ఈ రోజు సాయంత్రం ఈ భేటీ జ‌ర‌గ‌నుంది. ఈ స‌మావేశం ప‌లు వ‌ర్గాల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఇదిలాఉండ‌గా... బ్యాడ్మింట‌ర్ స్టార్ సైనా నెహ్వాల్‌, ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త శ్రీ‌నిరాజుతో కూడా అమిత్‌షా స‌మావేశం కానున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు