మోడీ గెలిస్తే... భార‌త్ అథోగ‌తి

మోడీ గెలిస్తే... భార‌త్ అథోగ‌తి

మేధావిగా గుర్తింపు పొందిన మాజీ కేంద్ర‌మంత్రి శ‌శిథ‌రూర్‌.. త‌న భార్య సునంద మ‌ర‌ణం విష‌యంలో ఇబ్బందులు ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. యూపీఏ హ‌యాంలో కేంద్ర‌మంత్రిగా వ్య‌వ‌హ‌రించిన ఆయ‌న‌.. త‌న మాట‌ల‌తో.. చేత‌ల‌తో దేశ ప్ర‌జ‌ల‌కు సుప‌రిచితుడ‌య్యాడు. వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో స‌హా.. విష‌యం ఏదైనా స‌రే స్పందించే గుణం ఉన్న ఆయ‌న‌.. ఒక‌ద‌శ‌లో మోడీని పొగ‌డ్త‌ల‌తో ముంచెత్త‌టాన్ని మ‌ర్చిపోకూడ‌దు.

అలాంటి ఆయ‌న తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 2019 లోక్ స‌భ ఎన్నిక‌ల్లో మోడీ నేతృత్వంలోని బీజేపీ మ‌రోసారి గెలిస్తే.. భార‌త్‌.. హిందూ పాకిస్థాన్ లా మారుతుంద‌ని వ్యాఖ్యానించారు. తిరువ‌నంత‌పురంలో జ‌రిగిన మీటింగ్లో మాట్లాడిన శ‌శి.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పాక్ లో మైనార్టీల హ‌క్కుల‌కు గౌర‌వం లేన‌ట్లే.. దేశంలో కూడా బీజేపీ అదే తీరులో వ్య‌వ‌హ‌రించే ప్ర‌మాదం ఉంద‌న్నారు.

రానున్న ఎన్నిక‌ల్లో మోడీ బ్యాచ్ విజ‌యం సాధిస్తే.. ఇప్పుడున్న రాజ్యాంగం స్థానే మ‌రో రాజ్యాంగాన్ని రాసేస్తార‌న్నారు. దేశాన్ని బీజేపీ హిందూ రాష్ట్రంగా మారుస్తుంద‌న్నారు. శ‌శిథ‌రూర్ వ్యాఖ్య‌ల‌పై రాజ‌కీయ ర‌గ‌డ మొద‌లైంది. శ‌శి వ్యాఖ్య‌ల‌పై కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ సారీ చెప్పాల‌న్న డిమాండ్‌ను తెర మీద‌కు తెచ్చారు బీజేపీ నేత‌లు. కాంగ్రెస్ పార్టీ నేత‌లు హిందువుల‌ను నిందిస్తున్నారంటూ కొత్త మాట‌ను చెప్పుకొచ్చారు. మొత్తంగా శ‌శి థ‌రూర్ వ్యాఖ్య‌లు రాజ‌కీయ ర‌గ‌డ‌ను మ‌రింత పెంచ‌టం ఖాయ‌మ‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు