జ‌లీల్ ఖాన్ తెలివి మామూలుగా లేదు

జ‌లీల్ ఖాన్ తెలివి మామూలుగా లేదు

ఏమాటకామాట చెప్పుకోవాలి.. టీడీపీ నేత జలీల్ ఖాన్ చదివింది బీకామ్‌లో ఫిజిక్సే తెలివితేటల్లో మాత్రం అంతకంటే ఉన్నత చదువులు చదివిన చంద్రబాబు కూడా బలదూరే. అంతేకాదు... లౌక్యం ప్రదర్శించడంలో, మర్మగర్భంగా మాట్లాడడంలో ఆయనకు పీహెచ్‌డీ ఉందా అనిపించేలా మాట్లాడతారు. తాజాగా ఆయన చంద్రబాబు అస్సలు నచ్చని జగన్‌ను.. కొత్త శత్రువు బీజేపీని తిట్టడంలో దూకుడు పెంచారు. జగన్‌ను, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను టార్గెట్ చేయడం ద్వారా చంద్రబాబు వద్ద మార్కులు కొట్టే ప్రయత్నంలో ఉన్నారు. అందులో భాగంగానే స్వామి కార్యం, స్వకార్యం సాధించుకునేలా ఆయన తాజాగా ఓ ప్రకటన చేశారు. ఎంతో వినయంగా... చంద్రబాబు అనుమతిస్తేనే ఆ పని చేస్తానని చెప్పుకొచ్చారు. చంద్రబాబు అనుమతిస్తే తాన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపైనా.. తన కుమార్తె వైసీపీ అధినేత జగన్‌పైన పోటీ చేస్తామని అన్నారు.

ఇది విన్నవారంతా పార్టీ కోసం జలీల్ ఖాన్ కుటుంబం కొండలను ఢీకొట్టడానికి కూడా సిద్ధపడుతోందని అనుకుంటున్నారు. కానీ.. ఆయన గురించి తెలిసినవారు.. ఆయన్ను విమర్శించే వారు మాత్రం అందులోని లోగుట్టు బయటపెడుతున్నారు. తనతో పాటు తన కుమార్తెకు కూడా టిక్కెట్ కావాలని చంద్రబాబును అడగడమే ఈ ప్రతిపాదన అని చెబుతున్నారు.

ఇక్కడ ఇంకో లాజిక్ కూడా ఉంది. కన్నాపై తాను పోటీ చేస్తే గెలుపు బాధ్యత పార్టీయే చూసుకుంటుంది. బీజేపీతో వ్యవహారం చెడడంతో ఆ పార్టీకి బుద్ధి చెప్పాలని చంద్రబాబు రగిలిపోతున్నారు. ఆ క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని ఓడించి ఆ పార్టీ ఆత్మ స్థైర్యం దెబ్బతీయడం చంద్రబాబు, టీడీపీ ప్రధాన ప్రణాళికల్లో ఒకటి. సో... కన్నాపై జలీల్ పోటీ చేస్తే గెలుపు సంగతి చంద్రబాబే చూసుకుంటారు.

ఇక జగన్‌పై పోటీ అంటే గెలుపుపై ఆశ వదులుకోవడమే. మరి అలాంటప్పుడు కుమార్తెకు టిక్కెట్ అడగడం కోసం జగన్‌పైనే పోటీ చేయిస్తానంటూ సాహసం చేయడం ఎందుకున్న ప్రశ్న తలెత్తుతుంది. విమర్శకులు దీనికీ సమాధానం చెబుతున్నారు. జలీల్ కుమార్తెకు టిక్కెట్ ఇస్తే జగన్ కాకుండా ఇతరులెవరిపైనైనా కూడా గెలిచే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఈ ప్రకటన చేయడానికి కారణం ఉంది. ఏదో రకంగా ఎన్నికల బరిలోకి తేవడం ఒక ప్రణాళిక కాగా జగన్ పై పోటీ చేసి పాపులారిటీ సంపాదించుకోవడం రెండో లక్ష్యమని తెలుస్తోంది. పనిలో పనిగా జగన్ ను ఢీకొట్టి ఓడిపోయారన్న సింపతీ చంద్రబాబు వద్ద పొంది ఇతర పదవులేవైనా తెచ్చుకోవచ్చన ఆలోచన కూడా ఉండొచ్చంటూ పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు