లోకేష్ పంచ్‌: కేంద్రంతో రాజీ.. ఆంధ్రాకు నామాలు !

లోకేష్ పంచ్‌: కేంద్రంతో రాజీ.. ఆంధ్రాకు నామాలు !

కాలం మారింది. అదే రీతిలో ప్ర‌త్య‌ర్థుల‌పై దాడి చేసే తీరు మారింది. రాజ‌కీయంలో ప్ర‌త్య‌ర్థి త‌ప్పుల్ని ఎత్తి చూపించ‌టం మానేసి.. అత‌డి వ్య‌క్తిత్వ హ‌న‌నం చేసే ధోర‌ణి అంత‌కంత‌కూ పెరుగుతోంది. య‌థాలాపంగా దొర్లే త‌ప్పుల్ని భూత‌ద్దంలో చూపిస్తూ.. ముద్ర‌లు వేసే వైనం ఈ మ‌ధ్య‌న ఎక్కువైంది. సంప్ర‌దాయ మీడియాకు మించి హ‌డావుడి చేసే సోష‌ల్ మీడియా అస‌రా చేసుకొని త‌మ ప్ర‌త్య‌ర్థుల‌పై విరుచుకుప‌డ‌టం.. ట్రోల్ చేయటం అ మ‌ధ్య‌న అంత‌కంత‌కూ ఎక్కువ అవుతోంది.

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కుమారుడు లోకేశ్ విష‌యాన్నే తీసుకుందాం. ఆయ‌న్ను ఏదోలా డ్యామేజ్ చేసే ప్ర‌య‌త్నాలు ఎక్కువ అవుతున్నాయి. ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వ్యాఖ్య‌ల్ని వింటే చాలానే త‌ప్పులు క‌నిపిస్తాయి. కానీ.. వాటిని భూత‌ద్దంలో వేసి అస్స‌లు చూపించ‌రు. అదే స‌మ‌యంలో లోకేశ్ నోటి నుంచి పొర‌పాటున వ‌చ్చే గ్రామ‌ర్ త‌ప్పుల్ని కూడా ఎత్తి చూపిస్తూ.. ఆయ‌న ఇమేజ్ డ్యామేజ్ చేసే ప‌ని గ‌డిచిన కొంత‌కాలంగా జ‌రుగుతోంది.

అదే స‌మ‌యంలో.. ప్ర‌త్య‌ర్థుల‌పై లోకేశ్ వేసే పంచ్ ల్ని పెద్ద‌గా ఫోక‌స్ కాకుండా జాగ్ర‌త్త ప‌డుతున్న ఆయ‌న వైరి వ‌ర్గం.. లోకేశ్ కు మాట్లాడ‌టం చేత‌కాద‌న్న ఇమేజ్ వేసే ప్ర‌య‌త్నంలో వ్యూహాలు ర‌చిస్తున్నారు. తాజాగా చేస్తున్న క‌ర్నూలు జిల్లా ప‌ర్య‌ట‌న రెండో రోజున లోకేశ్ మాట‌ల్ని.. ప్ర‌త్య‌ర్థుల‌పై ఆయ‌న విసిరే పంచ్ ల‌కు ప్ర‌ధాన మీడియా ఏదీ పెద్ద‌గా ప్రాధాన్య‌త ఇచ్చిన‌ట్లు క‌నిపించ‌లేదు. ఇక‌.. లోకేశ్ ప్ర‌త్య‌ర్థి మీడియా అయితే.. ఏదో క‌వ‌ర్ చేశామంటే క‌వ‌ర్ చేసిన‌ట్లుగా చేస్తూ.. అందులో త‌ప్పులు వెతికే ప్ర‌య‌త్నం చేసింది.

ఇటీవ‌ల కాలంలో ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌లు త‌ర‌చూ ప్ర‌స్తావిస్తున్న రాజీనామా మాట‌పై లోకేశ్ వ్యాఖ్యానించారు. రాజీనామా పేరుతో జ‌గ‌న్ పార్టీ నేత‌లు చేస్తున్న రాజ‌కీయం.. ఆడుతున్న డ్రామాల్ని త‌న ఒక్క పంచ్ తో లోకేశ్ చెప్పిన తీరు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజీనామా ఓ డ్రామాగా లోకేష్‌ అభివ‌ర్ణిస్తూ ... *కేంద్రంతో రాజీ.. ఆంధ్రాకు నామాలు* పెడుతున్నారంటూ జ‌గ‌న్ పార్టీ ఎంపీల మాట‌ల‌కు భారీ కౌంట‌ర్ వేశారు. నాలుగేళ్ల బాబు పాల‌న‌తో సాధించిన ఘ‌న‌త‌ల గురించి వివ‌రించే ప్ర‌య‌త్నం చేస్తూ లోకేశ్ ప్ర‌స్తావించిన ప‌లు అంశాలు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి. గ్రామ పంచాయితీల అభివృద్దిపై స‌ర్వే చేస్తే దేశంలోని టాప్ 83 పంచాయితీల్లో 33 ఏపీలో ఉన్నాయ‌ని.. టాప్ టెన్ పంచాయితీల్లో 7 ఏపీకి చెందిన‌వేన‌ని చెప్ప‌టం చూస్తే.. బాబు చేసింది మ‌రింత ఎఫెక్టివ్ గా చెప్పుకోవ‌టం లేద‌న్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు