జ‌గ‌న్ ముసుగు తొలిగింది.. మోడీ జ‌మిలికి జై!

జ‌గ‌న్ ముసుగు తొలిగింది.. మోడీ జ‌మిలికి జై!

లోక్ స‌భ‌..  అసెంబ్లీల‌కు ఒకేసారి ఎన్నిక‌లు నిర్వహించే జ‌మిలి ఎన్నిక‌ల‌కు ఏపీ విప‌క్ష పార్టీ వైఎస్సార్ సీపీ జై కొట్టింది. ప్ర‌ధాని మోడీ క‌ల అయిన జ‌మిలికి ఓకే చెప్ప‌టం ద్వారా వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి త‌న ముసుగును తొల‌గించార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ప్ర‌ధాని మోడీ ప్ర‌తిపాదించిన జ‌మిలికి దేశ వ్యాప్తంగా ఉన్న రాజ‌కీయపార్టీల్లో అత్య‌ధికం వ్య‌తిరేకంగా రియాక్ట్ అవుతున్న వేళ‌.. జ‌గ‌న్ మాత్రం అందుకు భిన్నంగా జ‌మిలికి జై అన‌టం విశేషం.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ప్ర‌ధాని మోడీతో ర‌హ‌స్య స్నేహం ఉంద‌ని ఆరోప‌ణ‌లు ఎదుర్కొనే తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ బాట‌లోనే జ‌గ‌న్ న‌డుస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. జ‌మిలిపై కేసీఆర్ వ‌ల్లెవేసిన వాద‌న‌నే జ‌గ‌న్ పార్టీ కూడా చెప్ప‌టం గమ‌నార్హం.లోక్ స‌భ‌కు.. అసెంబ్లీకి ఏక‌కాలంలో ఎన్నిక‌లు నిర్వహించ‌టానికి త‌మ పార్టీ అనుకూలంగా లా క‌మిష‌న్ కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెల్ల‌డించింది.

జ‌మిలిపై త‌మ పార్టీ 9 పేజీల నివేదిక‌ను ఇచ్చిన‌ట్లుగా పార్టీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి వెల్ల‌డించారు. ఇందులో జ‌మిలిపై త‌మ వాద‌న‌ను వినిపిస్తూ 1951 నుంచి 1967 వ‌ర‌కు.. 1999 నుంచి 2014 వ‌ర‌కు ఏపీలో లోక్ స‌భ తో పాటు అసెంబ్లీకి ఒకేసారి ఎన్నిక‌లు జ‌రిగాయ‌ని పేర్కొంటూ తాము అనుకూల‌మ‌ని వెల్ల‌డించారు. అయితే.. జ‌మిలి కార‌ణంగా ఏర్ప‌డే స‌వాళ్ల‌ను ప‌రిష్క‌రించాల‌న్నారు. ఇందుకు సంబందించిన రాజ్యాంగ స‌వ‌ర‌ణ‌లు చేప‌ట్టాల‌ని సూచ‌న‌లు చేసిన‌ట్లు చెప్పారు. మిగిలిన మాట‌లు ఎలా ఉన్నా.. జ‌మిలిపై జ‌గ‌న్ పార్టీ ఓకే చెప్ప‌టం ద్వారా మోడీతో త‌న‌కున్న అప్ర‌క‌టిత స్నేహాన్ని ఎంతోకొంత బ‌య‌ట‌పెట్టిన‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు.

జ‌మిలిపై ప‌లు పార్టీలు లేవ‌నెత్తిన అంశాల్ని పెద్ద‌గా ప్ర‌స్తావించ‌ని జ‌గ‌న్ పార్టీ.. మోడీ విధాన‌మే త‌మ విధాన‌మ‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించిద‌న్న అభిప్రాయాన్ని ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు. వెనువెంట‌నే ఎన్నిక‌లు జ‌ర‌గాల‌న్న‌ట్లుగా జ‌గ‌న్ తీరు ఉందే త‌ప్పించి.. ఒక‌సారి జ‌మిలి విధానం అమ‌ల్లోకి వ‌స్తే.. దాని కార‌ణంగా ఎదుర‌య్యే విప‌రిణామాల విష‌యంలో పెద్ద‌గా ఆలోచించిన‌ట్లు జ‌గ‌న్ క‌నిపించ‌లేదంటున్నారు. జ‌మిలిపై త‌న నిర్ణ‌యాన్ని వెల్ల‌డించే వేళ‌.. భ‌విష్య‌త్తులో ఎదురయ్యే స‌మ‌స్య‌లు.. స‌వాళ్ల కంటే కూడా తాత్కాలిక ప్ర‌యోజ‌నాల వైపే జ‌గ‌న్ మొగ్గుచూపిన‌ట్లుగా ఆయ‌న నిర్ణ‌యం ఉందంటున్నారు. జ‌మిలిపై జ‌గ‌న్ వాద‌న తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ వినిపించిన‌ట్లే ఉండ‌టం గ‌మ‌నార్హం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు