అమిత్‌షా గోబ్యాక్‌...ఇదో వైర‌ల్ నినాదం

అమిత్‌షా గోబ్యాక్‌...ఇదో వైర‌ల్ నినాదం

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షాకు ఊహించ‌ని ప‌రాభ‌వం ఎదురైంది. పార్టీ నేతలతో భేటీ అయ్యేందుకు అమిత్‌ షా సోమవారం చెన్నైలో పర్యటించగా..ఆయ‌న‌కు మిశ్ర‌మ స్పంద‌న ల‌భించింది. నగర శివారులోని ఈంజంబాక్కంలో సోమవారం నిర్వహించిన భాజపా లోక్‌సభ ఎన్నికల సన్నాహక సభకు నాయకులు, కార్యకర్తలను ఓ వైపు బీజేపీ నేత‌లు పెద్ద సంఖ్యలో కార్య‌క‌ర్త‌ల‌ను తరలించ‌గా...మ‌రోవైపు అదే రీతిలో అనూహ్యంగా నెటిజ‌న్లు గో బ్యాక్ అమిత్‌షా నినాదం అందుకున్నారు.  'గోబ్యాక్‌ అమిత్‌ షా' అంటూ తమిళ ప్రజలు ట్వీట్లు చేశారు. ఇదే టాగ్‌తో స్వల్ప సమయంలో 75 వేల ట్వీట్లు షేర్‌ చేయడంతో ట్రెండింగ్‌గా మారింది.

త‌మిళ‌నాడులో ప‌ట్టు పెంచుకోవాల‌ని ఓవైపు బీజేపీ ప్ర‌య‌త్నిస్తుంటే...మ‌రోవైపు ఆ రాష్ట్రంలో ప‌రిస్థితులు కలిసి రావ‌డం లేద‌నే సంగ‌తి తెలిసిందే. గత ఏప్రిల్‌లో తమిళనాడు పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొన్న విషయం తెలిసిందే. హేతువాద ఉద్యమ వ్యవస్థాపక నాయకుడు పెరియార్‌ విగ్రహం ఈ ఏడాది మార్చిలో విధ్వంసం చేయడంతో తమిళ ప్రజల ఆగ్రహాన్ని బీజేపీ చవిచూసింది.

కావేరీ వాటర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు ఏర్పాటుపై కూడా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆలస్యం చేయడంతో ఆ రాష్ట్ర ప్రజలు ఇటీవల నిరసనలు కూడా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీకి జనాధరణ అథమస్థాయికి దిగజారింది. ఆర్‌కె నగర్‌ ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి నోటా కంటే తక్కువ ఓట్లు రావడం ఇందుకు ఉదాహరణగా కొంద‌రు చెప్తున్నారు. తాజాగా సోష‌ల్ మీడియాలో త‌మిళ తంబీలు సీరియ‌స్‌గా స్పందించ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

ఇదిలాఉండ‌గా...త‌మిళ‌నాడులోని బీజేపీ నేత‌ల్లో విశ్వాసం నింపే ప్ర‌య‌త్నం మంత్రి కేటీఆర్ చేశారు. మధ్యాహ్నం చెన్నైకి చేరుకున్న అమిత్‌ షా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్‌, జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌ రావు, కేంద్ర మంత్రి పొన్‌ రాధాకృష్ణన్‌, పార్టీ సీనియర్‌ నేత హెచ్‌ రాజా తదితరులతో క‌లిసి ఇక్కడే పార్టీ లోకసభ నియోజవర్గ బాధ్యులు, ముఖ్య నేతలతో సమీక్ష నిర్వహించారు.

అనంత‌రం అమిత్‌ షా సాయంత్రం ఏడు గంటలకు వేదికపైకి చేరుకొని ప్రసంగాన్ని ప్రారంభించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పని చేయాలని, అలానే రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. నాలుగు సంవత్సరాల్లో భాజపా చేసిన అభివృద్ది, సంక్షేమ పథకాలు, రాష్ట్రానికి కేటాయించిన నిధులను వెల్లడించారు. తమిళనాడులో మాత్రం కొంత వెనుకబడి ఉన్నామని... ఇప్పుడు వచ్చిన కార్యకర్తలను చూస్తే వచ్చే ఎన్నికల్లో సత్తా చాటుతామనే నమ్మకం కలుగుతోందని ఆయ‌న అన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు