కన్నడ సూపర్ స్టార్ ఫ్యాన్స్ హర్టయ్యారు

కన్నడ సూపర్ స్టార్ ఫ్యాన్స్ హర్టయ్యారు

తెలుగులో చాలా ఏళ్ల పాటు మల్టీస్టారర్లు రాకుండా ఆగిపోవడానికి ఒక కారణం.. హీరోల అభిమానుల్లో ఉండే విభేదాలే. మల్టీస్టారర్లు చేస్తే మా హీరోకు ఎన్ని పాటలు.. ఎన్ని ఫైట్లు.. ఎంత స్క్రీన్ టైం అంటూ లెక్కలేసుకునే అభిమానులంటారు. ఒక టైంలో హీరోలకు ఇలాంటి మ్యాడ్ ఫ్యాన్స్ ఎక్కువై.. ఫిలిం మేకర్లకు స్వేచ్ఛ లేకుండా పోయింది. కానీ తర్వాత తర్వాత కాలం మారింది.

మన ప్రేక్షకుల అభిరుచి మారింది. ఆలోచనా మారింది. హీరోయిజం కోసం చూడకుండా కథతో సాగిపోయే సింపుల్ క్యారెక్టర్లను కూడా ఆమోదించడం మొదలయ్యాక మల్టీస్టారర్లు తీయడానికి మార్గం సుగమమైంది. దీంతో సినిమాలో ఏ హీరో నిడివి ఎంత.. ఎవరికి ప్రాధాన్యం ఎక్కువ లాంటి విషయాల్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఐతే మన ప్రేక్షకుల్లో ఉన్నంత పరిణతి కన్నడ ఆడియన్స్‌లో కనిపించడం లేదనే చెప్పాలి. టాలీవుడ్‌తో పోలిస్తే శాండిల్‌వుడ్ పదేళ్లు వెనుకబడి ఉంటుందని అంటుంటారు. అక్కడి ప్రేక్షకులు కూడా ఇలాగే తయారయ్యారు.

కన్నడలో శివరాజ్ కుమార్.. కిచ్చా సుదీప్‌ల క్రేజీ కాంబినేషన్లో ‘ది విలన్’ అనే సినిమా తెరకెక్కింది. ‘ఇడియట్’ హీరోయిన్ రక్షిత భర్త ప్రేమ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి రెండు టీజర్లు వదిలారు. ఒకటి శివరాజ్ కుమార్ ప్రధానంగా సాగేది. ఇంకోటి సుదీప్‌ను హైలైట్ చేసేది. దీంతో పాటుగా కొన్ని పోస్టర్లు కూడా రిలీజ్ చేశారు. ఐతే వీటిలో శివరాజ్ కుమార్‌కు ప్రాధాన్యం తగ్గిందటూ ఆయన ఫ్యాన్స్ గగ్గోలు పెడుతున్నారు. సినిమాలో శివరాజ్‌కు కావాలనే ప్రాధాన్యం తగ్గించారని.. ఆయనకు రెండు పాటలు పెట్టి.. సుదీప్‌కు మూడు పాటలు ఇచ్చారని.. పోస్టర్లలో కూడా శివన్న ఫొటో చిన్నదిగా వేశారని.. ఆయన టీజర్‌తో పోలిస్తే సుదీప్‌ టీజరే బాగుందని.. ఇలా రకరకాల అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. ఈ సినిమాను శివరాజ్ ఫ్యాన్స్ అందరూ బాయ్ కాట్ చేయాలని పిలుపునిచ్చారు. ఇది పెద్ద వివాదంగా మారింది శాండిల్‌వుడ్లో.

దీనిపై దర్శకుడు ప్రేమ్ పెద్ద స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. తాను శివన్న ఫ్యాన్ అని.. వ్యక్తిగతంగా కూడా ఆయన్ని ఎంతో ఇష్టపడతానని.. ఇలాంటి ప్రచారాల్ని పట్టించుకోవద్దని అభిమానులకు పిలుపునిచ్చాడు. అవసరమైతే ఫ్యాన్స్‌కు సారీ చెప్పడానికి కూడా తాను రెడీ అని అతనన్నాడు. ఐతే ఈ వివాదంపై శివరాజ్ మౌనంగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English