ప‌వ‌న్ `అజ్ఞాన` వాసం ఎన్నాళ్లు?

ప‌వ‌న్ `అజ్ఞాన` వాసం  ఎన్నాళ్లు?

2014లో టీడీపీ, బీజేపీల త‌ర‌ఫున జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కాళ్ల‌కు బ‌ల‌పం క‌ట్టుకొని ప్ర‌చారం చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే, కొద్ది నెల‌ల క్రితం టీడీపీతో మిత్రబంధం తెంచుకున్న ప‌వ‌న్....చంద్ర‌బాబుపై ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. తాజాగా, మ‌రోసారి చంద్ర‌బాబుపై ప‌వ‌న్ క‌ల్యాణ్ విమ‌ర్శ‌లు గుప్పించారు. 2014లో తన వల్లే టీడీపీ అధికారంలోకి వచ్చిందని...కానీ, ప్రమాణ స్వీకారం చేశాక త‌న‌ను వారు మ‌ర‌చిపోయారని అన్నారు.

రాబోయే ఎన్నిక‌ల్లో మ‌రోసారి టీడీపీకి అధికారం క‌ట్ట‌బెడితే...టీడీపీ నేత‌లంతా అనకొండలై భూములను స్వాహా చేస్తార‌ని విమ‌ర్శించారు. రాబోయే ఎన్నిక‌ల్లో టీడీపీకి ఓటేస్తే మన తల్లులు, అక్కలను కూడా దూషిస్తారన్నారు. లోకేష్ తో స‌హా టీడీపీ మంత్రులు, నేతల భూదందాల‌పై పోరాటం చేస్తానన్నారు. జ‌గ‌న్ పై త‌న‌కు ఉన్న‌వీ లేనివీ చెప్పి.....దుష్ప్ర‌చారం చేశార‌ని చెప్పారు. విశాఖ‌లో శ‌నివారం జ‌రిగిన జ‌నసేన క‌వాతు అనంత‌రం ప‌వ‌న్ ప్ర‌సంగించిన సంద‌ర్భంగా ఈ వ్యాఖ్య‌లు చేశారు.

జ‌గ‌న్ సీఎం అయితే భూ క‌బ్జాలు పెరిగిపోతాయ‌ని త‌న‌కు దుష్ప్ర‌చారం చేశార‌ని, కానీ, చంద్రబాబు సీఎం అయ్యాక భూకబ్జాలు, దోపిడీల‌కు అడ్డూ అదుపూ లేకుండా పోయింద‌ని విమ‌ర్శించారు. త‌న‌కు గురువు, దైవం అయిన చిరంజీవిగారిని కాద‌ని 2014లో టీడీపీకి మ‌ద్ద‌తిచ్చాన‌న్నారు. త‌న‌ను చంపేస్తామంటూ...త‌న కారు యాక్సిడెంట్ చేయిస్తామ‌ని బెదిరింపులు వస్తున్నాయని, త‌న‌కు ప్రాణం మీద, డబ్బుమీద తీపిలేదని అన్నారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాక్సైట్‌ తవ్వకాలకను వ్య‌తిరేకించిన చంద్ర‌బాబు.....అధికారంలోకి వచ్చాక తవ్వకాలను ఎందుకు ప్రోత్సహిస్తున్నారని ప్ర‌శ్నించారు. విశాఖకు రైల్వే జోన్‌ కోసం ఉద్యమాలు అవ‌స‌రం లేద‌ని....న‌లుగురు వ్య‌క్తుల‌తో జోన్ వ‌స్తుంద‌ని అన్నారు. లోకేష్, చంద్ర‌బాబు, జగన్‌, తాను క‌లిసి రైళ్లకు ఎదురెళ్లి రైల్ రోకో చేస్తే తప్పకుండా రైల్వే జోన్‌ వస్తుందన్నారు.

ఈ త‌ర‌హాలో అప‌రిప‌క్వ విమ‌ర్శ‌లు చేయ‌డం...నాలుక క‌రుచుకోవ‌డం ప‌వ‌న్ కు కొత్తేమీ కాదు. గ‌తంలో అనేక సందర్భాల్లో త‌న వ్యాఖ్య‌ల‌తో ప‌వ‌న్ న‌వ్వుల‌పాల‌య్యారు. సీరియ‌స్ పొలిటిషియ‌న్ గా ఎద‌గ‌డానికి ప‌వ‌న్ కు మ‌రింత స‌మ‌యం ప‌ట్టేలా క‌నిపిస్తోంద‌న‌డానికి తాజాగా చేసిన వ్యాఖ్య‌లే నిద‌ర్శనం. రాబోయే ఎన్నిక‌ల్లో ఏపీలో చ‌క్రం తిప్పాల‌ని చూస్తోన్న ప‌వ‌న్.....చంద్ర‌బాబును విమ‌ర్శించ‌డం పెద్ద ఆశ్చ‌ర్యం క‌లిగించ‌దు. లేదంటే...త‌న‌ను గురించి తాను గొప్ప‌లు చెప్పుకోవ‌డంలో త‌ప్పులేదు. కానీ, జ‌గ‌న్ అంటే చంద్ర‌బాబుకు భ‌యం...నాతో చెప్పారు....వంటి వ్యాఖ్య‌లు చేయ‌డం `అజ్ఞాత‌వాసి` అజ్ఞానానికి నిద‌ర్శ‌నం.

అస‌లు, మిత్ర ప‌క్షంలో ఉంటే త‌ప్ప‌....ఒక రాజ‌కీయ నాయ‌కుడి గురించి మ‌రో రాజ‌కీయ నాయకుడో....పార్టీ అధినేతో పొగ‌డ‌డం అనేది...న‌భూతో న‌భ‌విష్య‌త్. అదీగాక‌, మొన్న‌టివ‌ర‌కు విమ‌ర్శించిన‌....ఇక‌పై విమ‌ర్శించాల్సిన ప్ర‌తిప‌క్ష నేత‌ జ‌గ‌న్ ను హైలైట్ చేస్తే...ఆటోమేటిక్ గా తీను వీక్ అయిపోతాన‌నే ప్రాథ‌మిక సూత్రాన్ని కూడా ప‌వ‌న్ విస్మ‌రించారు. ఇంత అవివేకంగా వ్య‌వ‌హ‌రిస్తోన్న ప‌వ‌న్ ...పాలిటిక్స్ లో ప‌రిణ‌తి చెంద‌డానికి ఎన్ని సంవ్స‌త‌రాలు ప‌డుతుందో చెప్ప‌లేని ప‌రిస్థితి ఉందంటే అతిశ‌యోక్తి కాదు. ప‌వ‌న్ `అజ్ఞాన` వాసం ఎన్నాళ్లు కొన‌`సాగు`తుందో వేచి చూడ‌డం త‌ప్ప చేసేదేమీ లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు