టీఆరెస్ ఎమ్మెల్యే రాజకీయ సన్యాసం?

టీఆరెస్ ఎమ్మెల్యే రాజకీయ సన్యాసం?

టీఆరెస్ పార్టీకి చెందిన రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ సంచలన ప్రకటన చేశారు. తాను రాజకీయాలను వదిలేస్తానని... పదవులను త్యజిస్తానని అన్నారు. ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ గానూ ఉన్న ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు టీఆరెస్ లో వర్గపోరును బయటపెడుతున్నాయి.

రామగుండం, గోదావరి ఖని ప్రాంతంలో టీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య విభేదాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే సోమారపు సత్యనారాయణ ఈ ఉదయం సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో తనకు తగినంత గౌరవం దక్కడం లేదని, తన పదవులకు రాజీనామా చేసి, రాజకీయ సన్యాసం తీసుకోనున్నానని ఆయన తెలిపారు. రామగుండం మేయర్ కొంకటి లక్ష్మీ నారాయణ చేస్తున్న పార్టీ వ్యతిరేక పనులను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినా, చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.

కాగా రామగుండం కార్పొరేషన్లో శనివారం స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరుగగా, సోమారపు వర్గం మూడు స్థానాలను, మేయర్ వర్గం ఒకటి, కాంగ్రెస్ పార్టీ ఒకటి గెలుచుకుంది. అంతకుముందు శుక్రవారం నాడు 41 మంది కార్పొరేటర్లు మేయర్ పై అవిశ్వాసం పెట్టారు. అదంతా సోమారపు సత్యనారాయణ  కనుసన్నల్లోనే జరిగిందన్నది లక్ష్మీనారాయణ ఆరోపణ. కాగా గత కొద్దికాలంగా ఇద్దరి మధ్య గొడవలు ఉండడంతో గత వారం కేటీఆర్ రెండు గ్రూపుల నేతలనూ పిలిచి మాట్లాడారు. ఆ సందర్భంగా సోమారపునే ఆయన మందలించినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆయన అలిగి ఈ ప్రకటన చేసినట్లు చెబుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు