జ‌మిలిపై టీఆర్ఎస్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!

జ‌మిలిపై టీఆర్ఎస్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!

లోక్ స‌భ‌కు.. దేశ‌వ్యాప్తంగా ఉండే రాష్ట్రాల‌కు ఒకేసారి ఎన్నిక‌లు జ‌ర‌పాల‌న్న అంశంపై గ‌డిచిన కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ అంశంపై దేశ వ్యాప్తంగా ఉన్న రాజ‌కీయ పార్టీలు ఎలా రియాక్ట్ అవుతున్నాయి?  వారేం అనుకుంటున్నారు?  అన్న అంశంపై లా క‌మిష‌న్ అభిప్రాయ సేక‌ర‌ణ చేప‌ట్ట‌టం తెలిసిందే. అయితే.. లా క‌మిష‌న్ సేక‌రిస్తున్న అభిప్రాయ సేక‌రణ సైతం స‌రికాద‌ని.. జ‌మిలి ఎన్నిక‌ల ఇష్యూ ఆ శాఖ ప‌రిధిలోకి రాదంటూ ప‌లు రాజ‌కీయ పార్టీలు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. జ‌మిలికి తాము ఒప్పుకునేదే లేదంటూ  ప‌లు పార్టీలు త‌మ అభిప్రాయాన్ని కుండ బ‌ద్ధ‌లు కొట్టాయి. ఇక‌.. వామ‌ప‌క్ష పార్టీలైతే.. అస‌లు జ‌మిలి మీద స‌మావేశం అవ‌స‌ర‌మే లేద‌ని తేల్చేశాయి. ఇక‌.. ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీలైన బీజేపీ.. కాంగ్రెస్ పార్టీలు మాత్రం త‌మ అభిప్రాయాన్ని ఇప్ప‌టివ‌ర‌కూ వెల్ల‌డించ‌లేదు.

ఇలాంటి వేళ ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో టీఆర్ఎస్ జ‌మిలి మీద త‌న‌దైన రీతిలో రియాక్ట్ అయ్యింది. టీఆర్ఎస్ పార్టీ ప్ర‌తినిధి క‌మ్ ఎంపీ వినోద్ కుమార్ ఈ రోజు (ఆదివారం) లా క‌మిష‌న్ ను క‌లిసి.. జమిలిపై త‌మ అభిప్రాయాన్ని వెల్ల‌డించారు. ఇందుకు సంబంధించిన లేఖ‌ను కూడా వారికి అందించారు.

జ‌మిలి ఎన్నిక‌ల్ని తాము పూర్తిగా మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. తెలుగు రాష్ట్రాల్లో 1999 నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ లోక్ స‌భ‌.. అసెంబ్లీల‌కు క‌లిసే ఎన్నిక‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో త‌మ‌కు జ‌మిలిపై ఎలాంటి అభ్యంత‌రం లేద‌న్న మాట‌ను ఆయ‌న చెప్పారు. జ‌మిలికి అనుకూలంగా స్పందించిన తొలి పార్టీగా టీఆర్ఎస్ నిలిచింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు